Wednesday, April 24, 2024

దేశాన్ని దెబ్బతీసే నెగటివ్ థింకర్స్!

- Advertisement -
- Advertisement -

ఆయుధం చేసే శబ్దం కన్నా అక్షరం పేల్చే శబ్దమే ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించగలదు. నాటికి, నేటికీ ఏ నాటికైనా అభ్యుదయం లేని అక్షరం, కలం పోరు చేయని కవి రాజ్యానికి బానిసలే! ప్రతి రోజు ప్రతి ఒక్కరి మెదడులో రెండు ఆలోచనలు పోట్లాడుతుంటాయి. ఒకటి పాజిటివ్ థింకింగ్, రెండు నెగటివ్ థింకింగ్. వాటిలో ఏది గెలుస్తుందో మీకు మీరే తేల్చుకోవచ్చు. మీరు దేనికి బలమైన ఊతమిచ్చి బలిష్టంగా వుంచుకుంటారో అదే గెలుస్తుంది! అయితే, ప్రస్తుతం దేశం నెగటివ్ థింకర్స్‌తో విచ్చలవిడిగా పేట్రేగిపోతోంది. దానికి విరుగుడు పాజిటివ్ థాట్‌ను పాజిటివ్ థింకర్స్‌ను బలిష్టంగా తయారు చేసుకోవడమే! మరో మార్గం లేదు. అబద్ధాలతో అధికారంలో కొనసాగాలనుకునే వారి ఆట కట్టించాలనుకుంటే అది కేవలం ప్రజలకే సాధ్యం! వివేకవంతులైన ఈ దేశ ప్రజలే దేశాన్ని ముందుకు తీసుకు పోగలరు.

ప్రపంచ జ్ఞానమంతా భారతీయులదే అని చెప్పుకోకపోతే ఏమిటి నష్టం? అన్నీ మా వేదాల్లో వున్నాయని అనకపోతే ఎవరైనా ఏమైనా అంటారా? ఏమీ అనరంటే అనరు పైగా ప్రపంచ దేశాలలో గౌరవం పెరుగుతుంది. అబద్ధాలతో ఎవరూ గౌరవ మర్యాదలు పొందలేరు. గత వందేళ్లలో భారతీయులు కనిపెట్టిన కొత్త వస్తువు లెన్ని? వాటి మీద వచ్చిన పేటెంట్లు ఎన్ని? నోబెల్ సాధించిన భారతీయులెందరూ? స్వదేశీ ఫార్ములాలతో తయారైన వస్తువుల్ని మనం నిత్య జీవితంలో ఎన్ని వాడుతున్నాం? ఆ లెక్కలన్నీ తీసిన తర్వాతే నోర్లు విప్పండి. అప్పటి దాకా అవాకులూ చవాకులూ మాట్లాడకుండా నోటికి విశ్రాంతి నివ్వండి. సత్యాన్ని ఆవిష్కరించే క్రమంలో దానికి మద్దతు తెలిపే వారి కన్నా, వ్యతిరేకించే వారే ఎక్కువగా వుంటారు. కారణం ఏమిటంటే మన సంస్కృతుల పునాదులన్నీ సత్యం మీద ఆధారపడి లేవు. స్వర్గం, నరకం, పునర్జున్మ, దేవుడు, దయ్యం వంటి కల్పిత విశ్వాసాల మీద నిర్మించబడ్డాయి కాబట్టి!

నెగటివ్ థింకర్స్ వాదనలు ఎలా వుంటాయో చూద్దాం. దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్.ఐ.సి) ని ఎవరు ప్రారంభించారు? భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఎప్పుడూ? 1956లో ఆ ప్రారంభానికి పెట్టిన పెట్టుబడి ఎంత? రూ. 5 కోట్లు! ఇప్పుడు దాని విలువ రూ. 31 లక్షల కోట్లు! గత సంవత్సరం (2021) ఎల్.ఐ.సి తన లాభంలో ప్రభుత్వానికి ఇచ్చిన వాటా రూ. 2611 కోట్లు! మరి ఇంతటి గొప్ప సంస్థని, లాభాలు తెచ్చే సంస్థని అమ్మడానికి పెట్టిందెవరూ? మహారాజు శ్రీశ్రీ చౌకీదార్ మోడీ సర్కార్! ఈ విషయాలన్నీ అలా వుంచి, ఇంతకీ దేశాన్ని నాశనం చేసిందెవరో చెప్పండి! నెహ్రూ! నెహ్రూ!! నెహ్రూ !!! ఇదీ ప్రస్తుత నెగటివ్ థింకర్స్ వాదన! జవహర్ లాల్ నెహ్రూ పేరు ఉచ్ఛరించడానికి కూడా అర్హత లేని వారు… ఆయన వల్లే దేశం ఎన్నో అనర్థాలకు గురైందని మాట్లాడుతున్నారు. దేశం నెగటివ్ థింకర్స్ చేతిలో చిక్క విలవిలలాడుతోంది. ఇక్కడ ఒకే ఒక్కడైన సావర్కర్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత ఈ దేశభక్తులకు ఆదర్వప్రాయుడు ఆయన కాబట్టి!

ఆర్.ఎస్.ఎస్ బిజెపి పాలిత కర్ణాటక రాష్ట్రంలో పదవ తరగతి కన్నడి పాఠ్య పుస్తకం నుంచి భగత్ సింగ్ పాఠం తొలగించి హెడ్గెవార్ పాఠం చేర్చారు. సరే, బిజెపి వారికి సావర్కర్ ఎందుకు మహనీయుడయ్యాడూ అంటే ఆయన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నెంబర్ వన్ దేశద్రోహిగా ప్రకటించింది కాబట్టి! ఒక బ్రిటిష్ అధికారి హత్య కోసం తన సహచరుడికి తుపాకి ఇచ్చినందుకు లండన్‌లో వినాయక్ సావర్కర్‌ను అరెస్టు చేసి ఇండియాకు తీసుకుని వస్తూ వుంటే, ఆయన ఫ్రాన్స్ తీరం వద్ద తప్పించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇండియాలో విచారణ తర్వాత జీవిత ఖైదు విధించబడి అండమాన్‌లోని సెల్యులర్ జైలుకు పంపబడ్డాడు (1911). అక్కడ ఒక ఏడాది గడిపే సరికి జవసత్వాలు ఉడిగి, బ్రిటిష్ అధికారులకు క్షమా పత్రం సమర్పించాడు. తన తప్పును ఒప్పుకుంటూ ఇక ముందు బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడిగా వుంటానని, తనను దయతో విడుదల చేస్తే భారతీయ యువతీ యువకుల్ని భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా అడ్డుకుంటాననీ..

వారిని తనలాగే బ్రిటిష్ భక్తులుగా మార్చుతాననీ విన్నవించుకున్నాడు. చివరకు రెండేళ్ళ తర్వాత విడుదలై, పుణె చేరుకున్నాడు. ఐదేళ్ళపాటు ఏ రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనకుండా, కేవలం బ్రిటిష్ అధికారికి వార్తలు మోస్తుండేవాడు. 18601940 వరకు 80 వేల మంది స్వాతంత్య్ర పోరాట వీరులు అండమాన్ కాలాపాని సెల్యులార్ జైలుకి పంపబడ్డారు. అక్కడ వేల మందిని కాల్చి, ఉరి వేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. మరి కొందరు అనారోగ్యంతో మరణించారు. కానీ, వీరందరిలో ఒకే ఒక్క ‘మహా పురుషుడు’ బ్రిటిష్ వారి కాళ్ళు మొక్కి, క్షమాపణలు అడుక్కొని, ఆ జైలు నుంచి బయటపడ్డాడు. ఆ ఘనుడే ‘వీర్’ సావర్కర్! ఆయన అనుచరులే ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నామనుకుని, అధోగతి పాలు చేస్తున్న వారు. వీరు చేస్తున్న దుష్ప్రచారాలకు హద్దూ అదుపూ లేకుండా పోతుంది!

ప్రస్తుత దేశభక్త పరిపాలకులు చేసే అబద్ధపు ప్రచారాలు ఎలా వుంటున్నాయో ఉదాహరణకు కొన్ని చూద్దాం!
“ఆక్సిజన్ అనే పదం నిజానికి ఆక్స్ (OX) అనే ఇంగ్లీషు పదం నుండి వచ్చింది. OX GENERATED అని మనం అంటుంటే పాశ్చాత్యులు దాన్నే OXYGEN అని ముద్దుగా పిలుస్తున్నారు. అసలైతే వారి కన్నా ముందుగా మనమే OX నుండి OXYGEN వచ్చిందని కనిపెట్టాం!” అని అన్నాడో కాషాయీయుడు. ఇందుకు విరుద్ధమైన భావజాలం గల యువకులు కొందరు, ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు “అబద్ధానికి వయసు వుండదని ఎవరన్నారూ? చూడండి. ఈరోజు దానికి 71 ఏళ్ళు ” అని! పైగా ఆ రోజును ‘రాష్ట్రీయ నిరుద్యోగ దినం’ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో పతంజలి ఉత్పత్తుల్ని నిషేధిస్తే, ఈ దేశంలో మాత్రం ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్వయాన ఆ రామ్‌దేవ్ బాబానే ఏమని ప్రకటించాడో చూడండి. “భారత్ మాతాకి జై అని, అనం అని కొందరు ప్రముఖులు చెపుతున్నారు. ఈ దేశానికి చట్టాలు, రాజ్యాంగం వున్నాయని, వాటి మీద గౌరవంతో ఊరుకుంటున్నాం లేదంటే.. ఆ నినాదం చేయని వాళ్ని ఎవరినీ వదిలి పెట్టే వాళ్లం కాదు. ఈ పాటికి లక్షల తలలు నరికేసే వాళ్లం!!” అని పతంజలి రామ్‌దేవ్ బహిరంగంగా ప్రకటిస్తే అధికారంలో వున్నవాళ్ళు ఏం చేస్తున్నట్టూ? అదే మాట వేరే వాళ్ళంటే ఈపాటికి వారి మీద ఇడి సోదాలు జరిగేవి లేదా జైల్లో పెట్టేవారు. కాని అలాంటిదేం జరగలేదంటే అది ప్రభుత్వ పెద్దల ‘మన్‌కి బాతే’.. నేమో?

5 ఏప్రిల్ 2022న జగ్జీవన్ రామ్ జయంతికి ప్రధాని మోడీ నివాళులు అర్పించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ తిరిగింది. అందులో ఆశ్చర్యమేముంది? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఆ ఫోటోలో 24 ఆగస్టు 2019న మరణించిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా వున్నారు. అందుకే జనం ‘ఇంత ఫేకా?’ అని హాశ్చర్యపోయారు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మైనర్ బాలకులు పాకిస్తానీ పాటలు విన్నందుకు అరెస్టు చేశారు. దేశ ప్రధాని మాత్రం పాకిస్తాన్ వెళ్లి అక్కడ బిర్యానీ తిని రావచ్చు. అది యాంటీ నేషనల్ కాదు. అది కూడా దేశభక్తే! ఏడు కోట్ల జనాభా గల ఫ్రాన్స్ రాఫెల్ లాంటి యుద్ధ విమానాల్ని తయారు చేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటూ వుంటే నూటా ముప్పయి అయిదు కోట్ల జనాభా గల మన దేశంలో మాత్రం నేటికీ మసీదుల పునాదుల కింద మట్టిలో దూరి, అందులో శివ లింగాలు, విగ్రహాలు ఉన్నాయేమోనని తవ్వకాలు ప్రారంభించారు. వారెవా! న్యూ ఇండియా అంటే ఇదేనన్న మాట!

హిందువుల జీవన విధానంలో “ఆహారమే ఔషధం!’ అని పెరుగు గురించి విరివిగా ప్రచారం జరుగుతూ వుంది. ఒక అభిమాని పంపిన పోస్టర్‌లో విషయం ఇలా వుంది మెదడులో ట్రిప్టోఫాన్ అనే రసాయనాన్ని విడుదల చేయగల ఏకైక ఆహారం భారతీయుల పెరుగన్నం! ట్రిప్టోఫాన్ అనే పదం సంస్కృత పదం ‘తృప్తి’ నుండి వచ్చింది. పాశ్చాత్యులు పెరుగులో చక్కెర కలిపి ‘యోగర్ట్’ గా తీసుకుంటారు. ఇది నాడీ కార్యకలాపాల సమతుల్యతను దెబ్బ తీస్తుంది. హైపర్ ఏక్టివిటీని ప్రేరేపిస్తుంది” అని ఉన్న పోస్టర్ పైన ఆర్‌ఎస్‌ఎస్ జెండా, కింద జై శ్రీరామం నినాదం, ధర్మ ధ్వజం శీర్షికతో వచ్చిందంటే అది అబద్ధాల ప్రచార కేంద్రం నుండి వచ్చిందని అర్థమవుతూ వుంది కదా? సరే, ఏదో ఒక విషయం వండి వార్చారు గాని, ఆ అర్ధజ్ఞాన ప్రవీణులకు అర్థం కాని విషయాలు అందులో ఇంకా వున్నాయి. పెరుగు, చక్కెరలు కలిపి తీసుకుంటే మానసిక ఆరోగ్యానికి మంచిదని మన ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. ఆయుర్వేదం మన దేశానిది. ఆ వైద్య విధానం ఏం చెపుతుందో కూడా తెలుసుకోవాలి కదా? చాలా మంది ఉదయాన్నే పెరుగు పంచదార కలిపి తింటారు. రోజంతా ఉత్సాహంగా వుంటారు.

ముఖ్యంగా వేసవిలో అల్పాహారంలో పెరుగు పంచదార తీసుకుంటే కడుపులో ఎసిడిటి తగ్గుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. పైగా ఒత్తిడిని అలసటను తగ్గిస్తుంది. ఈ మిశ్రమం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్స్ రావు. గుండె సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. ట్రిప్టోఫాన్ అనేది ఒక అమైనో ఆసిడ్. అది పసి పిల్లల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. ట్రిప్టోఫాన్ పాలు, పెరుగులతో చేసిన ఉత్పత్తులలో అరటి పండు, చీజ్, చికెన్‌లలో, గుడ్డు తెల్లసొనలో, నట్స్, సీడ్స్‌లలో కూడా వుంటుంది. యోగర్ట్ విలువ తగ్గించి, పెరుగన్నం గూర్చి గొప్పగా చెప్పుకోవడం బుద్ధి తక్కువ పని! ట్రిప్టోఫాన్‌కు ‘తృప్తి’ అనే పదానికి సంబంధం లేదు.

హిందువుల జీవన విధానానికి పెరుగన్నానికి సంబంధమే లేదు. ఇతర మతస్థులు ఎవరూ పెరుగు తినడం లేదా? తల తిక్క అన్వయింపులు మానుకోవడం మంచిది. ఆహారానికి మతానికి సంబంధం లేదు. అది గ్రహించుకోవాలి! ఒక మనిషి చనిపోయినప్పుడు అది అందరికీ తెలుస్తుంది. కానీ, ఆ చనిపోయిన వ్యక్తికే తెలియదు. ఒక మనిషి మూర్ఖత్వంలో వున్నప్పుడు కూడా జరిగేది అదే అతని మూర్ఖత్వం అందరికీ తెలుస్తుంది. అతనికి తప్ప ఇతర దేశాల వారిలో, ఇతర జాతుల వారిలో ఇతర మతాల వారిలో మంచిని చూడకపోవడం ఒక లోపమే. అందుకే థామస్ అల్వా ఎడిసన్ అంటాడు “ఇతరులలో మంచిని చూడకపోవడం.. మనలో మంచి లేకపోవడాన్ని సూచిస్తుంది!” అని !! అదే మరి! మంచిని చూడలేకపోవడమే నెగటివ్ థింకింగ్!!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News