Tuesday, September 17, 2024

బదిలీరోజే భారీగా రిజిస్ట్రేషన్‌లు!

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వానికి ఫిర్యాదులు….
గతనెల 31వ తేదీన ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 100కు పైగా రిజిస్ట్రేషన్‌లు
డాక్యుమెంట్ రైటర్‌లే మధ్యవర్తులు
సంగారెడ్డి, అబ్ధుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికం
త్వరలోనే పూర్తిస్థాయి విచారణ
పలువురు సబ్ రిజిస్ట్రార్‌లపై ఏసిబి నజర్
మనతెలంగాణ/హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత నెల (జూలై 31వ తేదీన) భారీగా రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ ఒక్కరోజే 100 నుంచి 400ల రిజిస్ట్రేషన్‌లు జరిగినట్టుగా తెలిసింది. సంగారెడ్డి, అబ్ధుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మిగతా రిజిస్ట్రార్ కార్యాలయాల కంటే అధికంగా రిజిస్ట్రేషన్‌లు జరిగినట్టుగా తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్‌లను కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆగష్టు 01వ తేదీ తెల్లవారుజాము వరకు చేసినట్టుగా సమాచారం. గత నెల 31వ తేదీ రాత్రి సబ్ రిజిస్ట్రార్‌ల బదిలీలు జరిగాయి. దీంతోపాటు తెల్లారితే ఆగష్టు 01వ తేదీ నుంచి భూముల మార్కెట్ విలువ పెరుగుతుందని పుకార్లు షికార్లు చేయడంతో 31వ తేదీన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు క్రయ, విక్రయదారులతో కిక్కిరిసిపోయాయి. ఇదే అదునుగా భావించిన పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు అందినకాడికి దండుకున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

అయితే పటాన్‌చెరు, సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 31వ తేదీ రాత్రి ఏసిబి అధికారులు దాడి చేయడంతో కొందరు డబ్బులను కిటీకిలోంచి పడేయడం, డాక్యుమెంట్ రైటర్‌లు షాపులు మూసివేసి పారిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే 01వ తేదీన ఈ విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దీనిపై ఇంటలిజెన్స్ విచారణ చేపట్టినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే గత నెల 31వ తేదీన చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికంగా రిజిస్ట్రేషన్‌లు అయ్యాయని, అనుమతు లేని వాటిని కూడా చివరినిమిషంలో రిజిస్ట్రేషన్‌లు చేశారని, దీనికోసం చాలామంది సబ్ రిజిస్ట్రార్‌లు ముడుపులు తీసుకున్నారని, అయితే రిజిస్ట్రేషన్లు అయిన వాటిలో అధికంగా గ్రామకంఠాలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. పాత తేదీల్లో ఆయా గ్రామపంచాయతీల నుంచి లెటర్‌లను తీసుకొని ఈ రిజిస్ట్రేషన్‌లను చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

పటాన్‌చెరు, అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్‌లపై…
ఆయా రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి డాక్యుమెంట్ రైటర్‌లు మధ్యవర్తులుగా వ్యవహారించారని దీనికోసం వారు కూడా భారీగా ముడుపులు తీసుకున్నారని ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. పటాన్‌చెరులో గతనెల 31వ తేదీ వరకు సబ్ రిజిస్ట్రార్ 1గా పనిచేసిన ఓ సబ్ రిజిస్ట్రార్‌పై ప్రభుత్వానికి ఇప్పటికే భారీగా ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది.

గతంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో పలుమార్లు ఆయన్ను బదిలీ చేసినా ఆయనలో ఎలాంటి మార్పురాలేదని తెలిసింది. దీంతోపాటు అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్‌పై ఇప్పటికే కలెక్టర్‌కు, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ (డిఆర్)కు భారీగా ఫిర్యాదులు అందినా ఆ సబ్‌రిజిస్ట్రార్ మాత్రం ఈ నెలరోజుల్లో భారీగా వెనుకేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు పలువురు సబ్ రిజిస్ట్రార్‌లపై గతంలో ఏసిబి కేసులు నమోదైన వారు మళ్లీ అదే పంథాను కొనసాగిస్తుండడంతో వారిపై ఏసిబి నిఘాను మళ్లీ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు గతనెల 31వ తేదీన చేసిన రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News