Thursday, June 13, 2024

కాలుష్యం కోరల్లో మానవాళి

- Advertisement -
- Advertisement -

భూమ్మీద నివసిస్తున్న జీవకోటి మునుపెన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అణుబాంబులో, అంతర్యుద్ధాలో దీనికి కారణం కాదు. రోజురోజుకీ పెరుగుతున్న పర్యావరణ సంక్షోభమే దీనికి ప్రధాన కారణం. మానవునితో పాటు సమస్త జీవరాశి మనుగడకు కావాల్సిన వనరులు అన్నింటినీ ప్రకృతే అందిస్తున్నది. జీవులకు ప్రాణావసరాలైన గాలి, నీరు, ఆవాసం, ఆహారం అన్ని ప్రకృతి వర ప్రసాదితాలే. మానవ మనుగడతో పాటు జీవకోటి మనుగడలో కీలకపాత్రను పోషించిన ఈ సహాజ వనరులు అన్నీ కలుషితమై జీవ మనుగడకు విఘాతంగా మారిపోతున్నాయి. మానవ నాగరికతకు పాదులేసిన నదులన్నీ కలుషిత వ్యర్ధాలను మోసుకుపోయే మురికి కాలువలుగా మారిపోయాయి.

గాలి, నీరు, ఆహారం పెద్దయెత్తున్న కలుషితమై పోతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు కాలుష్యం వల్ల ప్రాణ నష్టాన్ని ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. ఒక్క వాయు కాలుష్యం వల్లే ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 51 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుంటే, దానిలో 21.80 లక్షల మంది భారతీయులే కావడం మహావిషాదం. వాయు కాలుష్యం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఆధారంగా నిర్మించిన ప్రపంచ దేశాల జాబితాలో చైనా మొదటి స్ధానంలో ఉంటే, భారత దేశం రెండవ స్ధానంలో ఉందని చికాగో విశ్వవిద్యాలయ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తన నివేదికలో స్పష్టం చేసింది. పరిశ్రమలు, విద్యుత్తుత్పత్తి కేంద్రాలు, రవాణా రంగాలలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న శిలాజ ఇంధనాలు ఈ సంక్షోభానికి ఒక కారణం. భారత దేశంలో 1984 డిసెంబర్ 2, 3 తేదీలలో భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రిమి సంహారక మందుల తయారీ పరిశ్రమలో సంభవించిన పెనుప్రమాదం వల్ల సుమారు 8వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 6 లక్షల మందికి పైగా ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డారు.

ఆది నుండి భారత దేశం పర్యావరణ పరిరక్షణ దిశగా జరిగే పోరాటాలలో విలువైన పాత్రనే పోషిస్తూ వస్తున్నది. పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలు అన్నింటినీ ఒక్కతాటి మీదకు తీసుకు రావాలన్న లక్ష్యంతో 1972లో మొట్టమొదటిసారి స్టాక్‌హోంలో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న అప్పటి భారత్ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన ప్రసంగం పెను సంచలనానికి కారణమైంది. ఆమె ఈ సదస్సులో మాట్లాడుతూ ‘ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సంక్షోభానికి కారణమైన పర్యావరణ కాలుష్యాన్ని కలిగించడంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉండే అసమాన భాగస్వామ్యాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పెద్ద యెత్తున కాలుష్యాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తున్న అగ్రదేశాలే, ఆ కాలుష్య నివారణకు కూడా పూనుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్య నివారణకు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలను సమాన భాగస్వాముల్ని చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు.

ఇదే జరిగితే కాలుష్య నివారణ అనేది అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల ఆర్ధిక ప్రగతికి అవరోధంగా మారుతుందని, దీని వల్ల ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికం మరింత పెరిగే అవకాశముందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న 45 శాతం కార్బన్‌డైయాక్సైడ్, 40 శాతం సల్ఫర్‌డైయాక్సైడ్, 50 శాతం నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు అభివృద్ధి చెందిన దేశాల నుండి విడుదలవుతున్నాయి. ప్రపంచ జనాభాలో కేవలం 20 శాతం వాటా మాత్రమే కలిగి ఉన్న అమెరికా, రష్యా, జపాన్, బ్రిటన్ వంటి సంపన్న దేశాలు నుండే 60 శాతం పైగా కాలుష్యం వెదజల్లబడుతుందంటే, ఆయా దేశాలు ప్రపంచ పర్యావరణానికి ఏ మేరకు నష్టం కలుగచేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ జనాభాలో 5 శాతం వాటా కలిగిన అమెరికా ఇప్పటి వరకు సుమారు 51 బిలియన్ టన్నుల కర్బన్ కలుషితాలను వాతావరణంలోకి విడుదల చేసిందని ఒక అంచనా.

చైనా ప్రతి సంవత్సరం 4 వేల 938 టన్నుల విషతుల్యమైన కాలుష్య వ్యర్ధాలను వాతావరణంలోకి విడుదల చేస్తుంటే, అమెరికా 7 వేల 074 మిలియన్ టన్నులకి పైగా కలుషితాలను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఇదిలా ఉండగా భారతదేశం సంవత్సరానికి 1884 మిలియన్ టన్నుల కాలుష్య వ్యర్ధాలను విడుదల చేస్తూ వాతావరణ కాలుష్యానికి కారణమైన దేశాల జాబితాలో నాల్గవ స్ధానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక స్ధాయిలో కాలుష్యం కలిగి ఉన్న నగరాల జాబితాలోని 15 నగరాల్లో 14 నగరాలు భారత దేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్యుహెచ్‌ఒ) తాజా నివేదిక స్పష్టం చేసింది. కాలుష్యం వల్ల తలెత్తున్న వివిధ ప్రాణాంతక సమస్యల వల్ల భారత దేశంలోని 40 శాతం మంది ప్రజలు తమ జీవిత కాలంలో 7 సంవత్సరాల ఆయుర్దాయం కోల్పోతున్నారని స్పష్టం చేసింది. పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని ప్రజలు అత్యంత దుర్భర కలుషిత పరిస్థితులలో జీవిస్తున్నారు.

వాయు కాలుష్యం కాలుష్యం వల్ల సుమారు 20 లక్షల మంది తీవ్రమైన ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతున్నారని, వీరిలో సగం ఢిల్లీలో నివశించేవారేనని ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. భారత దేశంలో సుమారు 14 కోట్ల మంది ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్యుహెచ్‌ఒ) నిర్దేశిత ప్రమాణాల కన్నా 10 రెట్లు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని ఒక అంచనా. 2017 లో వాయు కాలుష్యం కారణంగా సుమారు 1 లక్షా 95 వేల 546 మంది చిన్నారులు చనిపోయారంటే దేశ వ్యాప్తంగా కాలుష్య సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 180 దేశాలకు చెందిన గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో 2016లో 141వ స్ధానంలో ఉన్న భారత్ 2020 నాటికి 168వ స్ధానానికి దిగజారింది. దేశంలో దాదాపు 275 నదులుంటే వాటిలో సుమారు 121 పూర్తిగా కలుషితమైపోయాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది.

దేశంలో భూగర్భ జలాలు మినహాయిస్తే, ఉపరితల జలాల్లో దాదాపు 80 శాతం జలాలు కలుషితమైపోయాయని ఆ సంస్ధ స్పష్టం చేసింది. భారత దేశంలో 80 శాతం వ్యాధులకు జల కాలుష్యమే కారణం. ప్రపంచ వ్యాప్తంగా వెదజల్లబడుతున్న కాలుష్యం కారణంగా తలెత్తుతున్న పర్యావరణ సంక్షోభం నుండి మానవాళితో పాటు, సమస్త జీవకోటిని రక్షించడానికి తక్షణమే ప్రపంచ దేశాలన్నీ ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి వంటి సంస్ధలు కోరుతున్నప్పటికీ అమెరికా వంటి సంపన్న దేశాలు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల అమెరికా ఆది నుండి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది. అమెరికా వంటి అగ్రదేశాలు అవలంబిస్తున్న ఏకపక్ష విధానాలే మిగిలిన దేశాల పాలిట శాపాలుగా మారుతున్నాయని, ఆయా దేశాలు తమ ద్వంద్వ వైఖరికి స్వస్తి పలికి పర్యావరణ పరిరక్షణకు మిగిలిన దేశాలతో కలిపి పని చేయాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్నాయి.

భారత్ మాత్రం సమయం వచ్చిన ప్రతి సందర్భంలోను పర్యావరణ పరిరక్షణ దిశగా తాను చేపట్టబోయే చర్యల పట్ల స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది. మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ అగ్రదేశాల వైఖరిలో ఏరకమైన మార్పు లేకపోవడం పర్యావరణ పరంగా అతి పెద్ద విషాదం. ఇటీవల జరిగిన పారీస్ సదస్సులో కూడా అమెరికా అదే వైఖరిని ప్రదర్శించింది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు తమ బాధ్యతను తెలుసుకుని పర్యావరణ పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేయకపోతే భూమ్మీద జీవరాశుల మనుగడ మరింత ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇతర దేశాల వైఖరి ఎలా ఉన్నా పర్యావరణ పరిరక్షణకు భారతీయులంతా ఏకం కావాల్సిన సమయమిప్పుడు ఆసన్నమైంది. కాలుష్యం అన్నది ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన అంశం కాదు. ఇటీవల ఢిల్లీ ఎదుర్కొంటున్న పర్యావరణ అనర్ధాలు ఇతర రాష్ట్రాలోని చర్యలే కారణమని అందరికీ విదితమైన అంశమే. వేలాది మంది చిన్నారుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాల్సిన తరుణమిది. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యతే కాదు, దేశంలో నివసిస్తున్న కోట్లాది భారతీయుల బాధ్యత కూడా. భారత రాజ్యాంగం కూడా పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని దేశంలో నివసిస్తున్న పౌరుల ప్రాథమిక బాధ్యతగా నిర్దేశిస్తుంది. ఆ దిశగా భారతీయుల పర్యావరణ పరిరక్షణ రథ సారథులవుతారని ఆశిద్దాం. భారతీయులారా ఏకంకండి… కాలుష్యం బారి నుండి దేశాన్ని రక్షించండి.

డా. కె. శశిధర్
94919 91918

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News