Sunday, September 15, 2024

చట్టబద్ధత లేకున్నా జనామోదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ప్రకృతి సిద్ధ జలవనరులను పూర్వస్థితికి పునరుద్ధరించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలనే సదాశయంతో ఏర్పడిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మోనిటరింగ్ ఏజెన్సీ) బుల్డోజర్ కూల్చివేతలపై రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. హైడ్రాకు చట్టబద్ధత లేదనే విమర్శలు అక్కడక్కడా వినిపిస్తున్నా ఈ సంస్థ సాహసోపేతంగా కొనసాగిస్తున్న కూల్చివేతలను ప్రజలు ప్రత్యేకించి పర్యావరణ ప్రేమికులు హర్షిస్తున్నారు. చెరువులు, కుంటలు, నాలాలు, జలాశయాలను చెరపట్టిన ఆక్రమణదారులపైనే కాకుండా జలవనరుల్లో అక్రమ నిర్మాణాలను అనుమతి ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెడుతూ హైడ్రా విరుచుకుపడడంతో అక్రమాలు చేసిన వారంతా వణికిపోతున్నారు. గత మూడు నెలల్లో అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో అక్రమ ఆక్రమణల నుంచి 43.94 ఎకరాలు తిరిగి స్వాధీనమయ్యాయి.

ఈ నిర్మాణాల తొలగింపునకు ఇచ్చిన తాఖీదులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం హైడ్రాకు మరింత ఊతం ఇచ్చినట్టయింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు వివిధ వర్గాల ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. చివరకు తన సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని రెవెన్యూ విభాగం నోటీసులు ఇవ్వడం, కూల్చివేయడానికి సిద్ధం కావడం కాంగ్రెస్ పాలనలోని పారదర్శకతకు నిదర్శనంగా నిలిచింది. చెరువుల నగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో చెరువుల చిరునామా గత కొన్నేళ్లుగా చెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. ఉదాహరణకు దుర్గంచెరువు 154.27 ఎకరాల్లో విస్తరించి ఉండేది.

1980లో హుడా ఈ చెరువు విస్తీర్ణాన్ని 90 ఎకరాలే అని చూపించింది. అదే ఏడాది రూపొందిన జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద 60.27 ఎకరాలను రెసిడెన్షియల్ జోన్ కింద గుర్తించారు. 2000లో హైదరాబాద్ నగరంలో 24 సెం.మీ వర్షం కురిసినప్పుడు దుర్గంచెరువు పరిసరాలు భారీగా ముంపునకు గురయ్యాయి. అప్పటికే అక్కడ అధికారికంగా 25 అపార్టుమెంట్లు, 79 ఇళ్లు, 14 వాణిజ్యభవనాలు వెలిశాయి. దీనిపై వివాదాలు తలెత్తడంతో ప్రభుత్వ విభాగాలే వాటికి అనుమతులిచ్చాయి. కాబట్టి కూల్చడానికి వీల్లేదని అప్పట్లో హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతిని ఉల్లంఘించిన భవనాలను కూల్చివేయవచ్చని ఆదేశించింది.అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇది ఒక్క దుర్గంచెరువు పరిస్థితే కాదు. హైదరాబాద్‌లోని ప్రతి చెరువు ఈ విధంగానే కట్టడాలతో చెరిగిపోయింది. కొన్ని దశాబ్దాల క్రితం భాగ్యనగరంలో సరస్సులు, చెరువులు, రిజర్వాయర్లు, వాగులు, చేపల చెరువులు, సహజమైనవి, మానవ నిర్మితమైనవి దాదాపు 3000 నుంచి 7000 వరకు ఉండేవి. వీటిలో చాలా వరకు 16, 17 శతాబ్దాల్లో కుతుబ్‌షాహి పాలనలో నిర్మించారు. తరువాత నిజాం పాలకులు ప్రజల దాహార్తిని తీర్చడానికి చెరువులు, సరస్సులు నిర్మించారు. ఈ లక్షంతోనే హుస్సేన్‌సాగర్ 1575లో నిర్మాణమైంది. 1930 వరకు ప్రజల దాహార్తిని హుస్సేన్‌సాగర్ తీర్చేది. కానీ ముప్ఫయ్యేళ్లలో 550 హెక్టార్ల నుంచి 349 హెక్టార్ల వరకు 30% కుదించుకుపోయింది.

అదే విధంగా శామీర్‌పేట్ సరస్సు 1989లో 486 హెక్టార్ల నుంచి 2006 లో 256 హెక్టార్లకు కుదించుకుపోయింది. మొత్తం మీద 1989 నుంచి 2001 వరకు అంటే 12 ఏళ్లలో 3245 హెక్టార్ల జలవనరులు పూర్తిగా అదృశ్యమయ్యాయి. 2010 నాటికి హుడా పరిధిలో 500 చెరువులు మిగిలాయి. 2018మే నాటికి హుడా కేవలం 169 చెరువులు మాత్రమే 10 హెక్టార్ల పరిధిలో ఉన్నట్టు రికార్డు చూపించింది. వీటిలో ప్రభుత్వ ఆధీనంలోని 62 చెరువుల్లో 25 ప్రైవేట్ సంస్థల యాజమాన్యం కిందకు వెళ్లాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంయుక్త యాజమాన్యంలో 82 చెరువులున్నాయి. తీగల కుంత, సోమాజిగూడ ట్యాంక్, మీర్‌జుమ్లాట్యాంక్, పహార్ తీగల కుంత, కుంత భవానీదాస్, నవాబ్ సాహెబ్ కుంత, అఫ్జల్‌సాగర్, నల్లకుంట, మాసాబ్ ట్యాంక్ తదితర జలవనరులు పూర్తిగా అదృశ్యమైపోయాయి.

హుస్సేన్‌సాగర్, కుంట మల్లయ్యపల్లి జలవనరులు ఆక్రమణలతో పూర్తిగా కుదించుకుపోయాయి. ఇంకా కొన ఊపిరితో ఉన్న చెరువులు చెత్తను నిల్వచేసే డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. హుడా నోటిఫై చేసిన 169 భారీ తటాకాల్లో మొదటి దశలో 87 తటాకాలను పునరుద్ధరించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హైడ్రా సారథ్యంతో అపరభగీరథ ప్రయత్నం చేస్తున్నారు. చెరువుల ఎఫ్‌టిఎల్ (ఫుల్ టాంక్ లెవెల్), బఫర్ జోన్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి దూసుకుపోవడం నిజం గా సాహసోపేతమే. ఇందులో ఎలాంటి లొసుగులు, లోపాలు లేకుం డా చర్యలు సాగితేనే భాగ్యనగర గత చారిత్రక వైభవం సిద్ధిస్తుందని, ప్రజల కోసం అప్పటి పాలకులు శ్రమించి నిర్మింప చేసిన జలవనరులు మళ్లీ జీవం పోసుకుంటాయన్నదే అందరి ప్రగాఢ ఆకాంక్ష.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News