Friday, September 13, 2024

నా పేరు మీద ఎలాంటి ఫాంహౌస్ లేదు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మిత్రుడికి చెందిన ఫాంహౌస్‌ను లీజుకు తీసుకున్నా
ఆ ఫాంహౌస్ నిబంధనలకు విరుద్ధంగా
ఉంటే నేనే దగ్గరుండి కూల్చేయిస్తా
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తన పేరు మీద ఎలాంటి ఫాంహౌస్ లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. మిత్రుడికి చెందిన ఫాంహౌస్‌ను తాను లీజుకు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ ఫాంహౌస్ ఎఫ్‌టిఎల్, బఫర్‌లో ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని తెలిపారు. ఒకవేళ తప్పు ఉంటే అక్రమ కట్టడాలు కూల్చివేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. మంచి జరగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రులు, పెద్దపెద్ద కాంగ్రెస్ నేతలు అక్రమంగా కట్టిన ఫాం హౌస్‌లు చూపిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొంగులేటి, మహేందర్ రెడ్డి, వివేక్ లాంటి కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలు కూడా కూల్చేయాలన్నారు.

కాంగ్రెస్ మంత్రులు, ఎంఎల్‌ఎల రాజభవనాలు కూడా ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్నాయని, వాటిని కూడా కూల్చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామా అపాలని పేర్కొన్నారు. నిజాయితీ ఉంటే ప్రభుత్వానికి ఒకే రోజు అక్రమ నిర్మాణాలను కూల్చాలని సవాల్ విసిరారు. ముందుగా తమ అక్రమ నిర్మాణాలు కూల్చి ప్రజలకు అదర్శంగా ఉండాలని ముఖ్యమంత్రికి సూచించారు.అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. తప్పు తాను చేసినా, కాంగ్రెస్ వాళ్లు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. తన అఫిడవిట్‌లో ఏముందో పబ్లిక్ డొమెయిన్‌లో ఉందని, ఎవరైనా డాక్యుమెంట్ చూసుకోవచ్చని అన్నారు.

రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోంది
రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను పచ్చి దగా, మోసం చేస్తోందని కెటిఆర్ అన్నారు. రవ్వంత రుణమాఫీ చేసి ఈ ముఖ్యమంత్రి కొండంత డబ్బా కొట్టుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ అసలు రైతులకు ఎంత రుణం మాఫీ చేసిందన్నది అటు ముఖ్యమంత్రి సహా మంత్రులకు కూడా తెలుసో లేదోనని కెటిఆర్ అనుమానం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను పచ్చి మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం పావు శాతం రుణమాఫీ చేసి, వందశాతం రైతులను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రేమో మొత్తం రుణమాఫీ అయిపోయిందంటే, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి మాత్రం ఇంకా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారని చెప్పారు.

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాత్రం కేవలం రూ.7500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ అయ్యాయని చెబుతున్నారని..మరీ ఏదీ నిజం, ఏది రైతులు నమ్మాలో చెప్పాలని అడిగారు. రైతులకు, వ్యవసాయ రంగానికి ఇచ్చిన అన్ని హామీలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం, వేటాడుతామని హెచ్చరించారు. అందుకే గురువారం నుంచి మొదటి అడుగు రైతు ధర్నాతో ప్రారంభిస్తామని అన్నారు. కేవలం మీడియాను, హెడ్ లైన్స్‌ను మేనేజ్ చేసి రైతు రుణమాఫీ నుంచి దృష్టి మరల్చాలని చూస్తున్నారని, ఆ ఆటలు ఎంతోకాలం సాగవని స్పష్టం చేశారు. ఈ దగాకోరు సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతులకు రేవంత్ రెడ్డి చేసిన చీటింగ్‌పై బిఆర్‌ఎస్ పోరాటం ఆగదని కెటిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News