Tuesday, April 30, 2024

విద్యాహక్కు చట్టం అమలు ఏది?

- Advertisement -
- Advertisement -

పాఠశాలలకు వెళ్లాల్సిన బడి ఈడు పిల్లలు బడిలో చేరడం, చేరినవారు కొనసాగడం, వారందరూ ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి అనువైన, ప్రోత్సాహకరమైన ,స్వేచ్ఛాపూరిత వాతావరణం పాఠశాలల్లో కల్పించడానికి 13 ఏళ్ల క్రితం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. 6-14 వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను హక్కుగా మారుస్తూ సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన ఈ చట్టం ఆచరణలో చతికిలపడింది. దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నీ పాతిక శాతం సీట్లను నిరుపేద విద్యార్థులకు కేటాయించాలనే ఈ చట్ట నిబంధనను ఖాతరు చేస్తున్న వారు కనిపించడం లేదు. అడ్డంగా చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలను నియంత్రించే సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో చట్టం అమలు అభాసుపాలు అవుతున్నది.

విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల దేశంలో 6 కోట్ల మంది పిల్లలు పాఠశాల మొహమే చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా హక్కు చట్టం అమలులోని సాధకబాధకాలను సమీక్షించాల్సిన తరుణమిది. సమాజంలో కొంత మంది పిల్లలు బడి బయట ఉండడం, బాల కార్మికులుగా పనుల్లో, కార్ఖానాల్లో, గనుల్లో పని చేయడం వారి ప్రవేశానికి పాఠశాల నియమ నిబంధనలు అడ్డంకి రావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక హక్కుగా మారిన విద్యను పిల్లలు అందరూ పొందడానికి ‘ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం -2009’ అనే చట్టం ఏప్రిల్ 1, 2010 నుండి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. చట్టం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ప్రధాన మంత్రి మాట్లాడుతూ జాతి, మత, కులాలకు అతీతంగా దేశ బాలలందరినీ బడిలో చేర్పించి నాణ్యమైన విద్యను చట్టం ద్వారా అందిస్తామని అన్నారు. కానీ నేటికీ చట్టం ప్రధాన ఉద్దేశం నెరవేరలేదు.

చట్టం సక్రమంగా అమలు కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో 6% నిధులను విద్యాభివృద్ధికి కేటాయించాలి. అరకొర కేటాయింపులతో అద్భుత ఫలితాలు సాధించడం సాధ్యం కాదనే విషయాన్ని గతం లో సుప్రీం కోర్టు తేల్చి చెప్పినా కూడా ప్రభుత్వాలు విద్యాభివృద్ధి కేటాయిస్తున్న నిధులు పేలవం గా ఉంటున్నాయి. నేటికీ ప్రాథమిక పాఠశాల లేని గ్రామాలు, మౌలిక సదుపాయాలు లేమి, ఉపాధ్యాయుల కొరతతో విద్యా రంగం దురవస్థలపాలు అవుతున్నది. కరోనా కాలంలో దేశంలో 92 లక్షల మంది బాలబాలికలు బడికి దూరం అయ్యారని పలు గణాంకాలు విశ్లేషణ చేస్తున్నాయి. అలాగే వందకు పాతిక శాతం బాలబాలికలు ఐదో తరగతిలోనే బడిమానివేస్తున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ చట్టం అమల్లో భాగంగా బడి ముఖం చూడని పిల్లలకు పాఠశాలలో చేర్పించేందుకు ఉద్దేశించిన పథకం సమగ్ర శిక్ష అభియాన్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎందుకు కొరగానిదిగా మారింది.

విద్యా హక్కు చట్టం సెక్షన్ 12 ప్రకారం దేశంలోని ప్రతి కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలు ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాల్లో 25 శాతం సీట్లు బలహీన వర్గాలకు ఉచితంగా కేటాయించాలి. ఇందులో భాగంగా వికలాంగులు, అనాథలు, వీధి బాలలకు 5 శాతం, ఎస్‌సి బాలలకు 10%, గిరిజన బాలలకు 4%, వెనుకబడిన వర్గాల పిల్లలకు 6% సీట్లను ఉచితంగా కేటాయించాలి. కానీ అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కనీసం 10 శాతం పాఠశాలలు కూడా ఈ చట్టం నిబంధనలను పాటించడం లేదు. అలాగే సెక్షన్ 13 ప్రకారం ప్రాథమిక స్థాయిలో వివిధ పాఠశాలల్లో పిల్లల ఎంపిక కొరకు ఎలాంటి ఎంట్రన్స్‌లను నిర్వహించకూడదు. కానీ ఈ చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తూ మన రాష్ట్రంలో గురుకుల, ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల ఎంపిక కోసం ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశం కోసం ఎలాంటి క్యాపిటేషన్ రుసుములు తీసుకోకూడదు.

కానీ ఈ చట్టం నిబంధనలు బేఖాతరు చేస్తూ డొనేషన్, అడ్మిషన్ ఫీజులను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్నాయి. అలాగే సెక్షన్ 18 ప్రకారం గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడపరాదు. అలా నడిపితే ఈ చట్టం నిబంధనల ప్రకారం జరిమానాలు వసూలు చేయవచ్చు. కానీ చాలా గ్రామీణ ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలు నెలకొల్పుతూ ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలలను నడుపుతున్నారు. దీనిపై ప్రభుత్వాల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు చట్టం సత్ఫలితాలను ఇవ్వాలంటే విద్యా హక్కు చట్టం సెక్షన్ 25 ప్రకారం మొదట పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. ప్రస్తుతం దేశంలో 9 లక్షల ఉపాధ్యాయ పోస్టులు, అలాగే రాష్ట్రంలో దాదాపుగా 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా వాటిని వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. పనుల్లో, గనుల్లో, కార్ఖానాల్లో కర్మాగారాల్లో పని చేస్తున్న బాలకార్మికులను ఆపరేషన్ స్త్మ్రల్ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ బడి ఈడు పిల్లలందరూ బడిలో కొనసాగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా పాఠశాల విద్య ఉండాలి. అలాగే నిష్ట వంటి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయ విద్యను మరింత అభివృద్ధిపరచాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం ఏకతాటిపై నిలిచి మొక్కవోని దీక్షతో కృషి చేస్తే విద్యా హక్కు చట్టం లక్ష్యాలు నెరవేరుతాయి.

అంకం నరేష్ 6301650324

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News