Friday, April 26, 2024

ఫేవరెట్‌గా భారత్

- Advertisement -
- Advertisement -

ఢాకా: టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. బంగ్లాదేశ్ గడ్డపై భారత్ మూడు వన్డేలు, మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఢాకా వేదికగా మొదటి వన్డే జరుగనుంది. ఇటీవలే న్యూజిలాండ్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడింది. అయితే వర్షం వల్ల ఆ సిరీస్‌లో రెండు వన్డేలు అర్ధాంతరంగా రద్దయ్యాయి. ఇక ఆ సిరీస్‌లో సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రాహుల్ తదితరులు బరిలోకి దిగలేదు.

కానీ బంగ్లాదేశ్ సిరీస్‌లో మాత్రం కీలక ఆటగాళ్లందరూ జట్టులోకి వచ్చారు. రానున్న ప్రపంచకప్ నాటికి మెరుగైన జట్టును తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న భారత్ ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. కాగా, కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా తదితరులు సిరీస్‌కు అందుబాటులో లేరు. బుమ్రా, హార్దిక్‌లకు విశ్రాంతి ఇవ్వగా షమీ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. రవీంద్ర జడేజా ఇంకా ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఇదిలావుంటే బంగ్లాదేశ్‌ను వారి సొంత గడ్డపై ఎదుర్కొవడం ఎంత పెద్ద జట్టుకైనా కష్టంతో కూడుకున్న అంశమే. ఇలాంటి స్థితిలో టీమిండియా ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

సీనియర్ల రాకతో..
మరోవైపు సీనియర్ క్రికెటర్ల చేరికతో టీమిండియా సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రాహుల్, శిఖర్ ధావన్ తదితరులు జట్టుకు కీలకంగా మారారు. ఈ మ్యాచ్‌లో ధావన్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లలో ఎవరికీ తుదిజట్టులో స్థానం దక్కుతుందో చెప్పలేం. కివీస్ సిరీస్‌లో అయ్యర్ మెరుగ్గా రాణించడం అతనికి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇక అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు కూడా తుది జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారు. కివీస్‌పై రాణించడంతో సుందర్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు షమీ దూరం కావడంతో అతని స్థానంలో కుల్దీప్ సేన్‌ను ఆడించే అవకాశాలున్నాయి. ఇక శార్దూల్, దీపక్ చాహర్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లతో భారత బౌలింగ్ బలంగా ఉంది. అంతేగాక అక్షర్, సుందర్, షాబాద్‌ల వంటి మ్యాచ్ విన్నర్ స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. కాగా, రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ జట్టును కలవరానికి గురిచేస్తోంది. కివీస్ సిరీస్‌లో పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం ఈసారైనా అతను తన బ్యాట్‌కు పనిచెబుతాడా లేదా అనేది సందేహమే.

సంచలనాలకు మరోపేరు
ఇక ఆతిథ్య బంగ్లాదేశ్ టీమ్‌ను సంచలనాలకు మరో పేరుగా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. లిటన్ దాస్, నూరుల్ హసన్, అనాముల్ హక్, ఆఫిఫ్ హుస్సేన్, మహ్మదుల్లా, ముష్ఫికుర్ రహీం, ఎబాదత్ హుస్సేన్, ముస్తఫిజుర్ రహ్మాన్ తదితరులతో బంగ్లాదేశ్ పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News