Wednesday, May 1, 2024

సమరోత్సాహంతో భారత్

- Advertisement -
- Advertisement -

నేడు బంగ్లాదేశ్‌తో పోరు

పుణె : సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న టీమిండియా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లాలనే పట్టుదలతో భారత్ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. అయితే భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడాలని భావిస్తోంది. కానీ ఆతిథ్య భారత్‌ను ఓడించాలంటే బంగ్లాదేశ్ అసాధారణ ఆటను కనబరచాల్సి ఉంటుంది. బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లాదేశ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది.

దీంతో వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి తప్పలేదు. కానీ భారత్ ఇప్పటికే బలమైన ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో పాటు అఫ్గానిస్థాన్‌ను కూడా చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, జడేజా, హార్దిక్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక సిరాజ్, కుల్దీప్, జడేజా, హార్దిక్, బుమ్రాలతో పటిష్టమైన బౌలింగ్ లైనప్ విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

తక్కువ అంచనా వేయలేం..

అయితే బంగ్లాదేశ్‌తో పోరు ఎప్పుడూ కూడా సవాల్‌గానే ఉంటుంది. గతంలో పలుసార్లు భారత్‌ను ఓడించిన ఘనత బంగ్లాకు ఉంది. ముఖ్యంగా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీల్లో భారత్‌తో జరిగే మ్యాచుల్లో మెరుగైన ఆటను కనబరచడం బంగ్లాకు అనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. మెహదీ హసన్ మీరాజ్, లిటన్ దాస్, ముష్ఫికుర్ రహీం, మహ్మదుల్లా, కెప్టెన్ షకిబ్ తదితరులతో బంగ్లా బలంగా ఉంది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ నా ఆల్ టైం ఫేవరేట్ మూవీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News