Sunday, April 28, 2024

బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

పుణె: ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. గురువారం పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన నాలుగో మ్యాచుల్లోనూ జయభేరి మోగించడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 41.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అజేయ శతకంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు.
శుభారంభం..
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. బంగ్లా బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. దూకుడుగా ఆడిన రోహిత్ 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. ఇక గిల్ ఐదు బౌండరీలు, రెండు సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు.

కోహ్లి జోరు..
గిల్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత విరాట్ కోహ్లి తనపై వేసుకున్నాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ అండగా నిలిచాడు. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కోహ్లి స్కోరును పరిగెత్తించాడు. తన మార్క్ షాట్లతో అలరించిన కోహ్లి జట్టును లక్షం వైపు నడిపించాడు. మరోవైపు అయ్యర్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కానీ తర్వాత వచ్చిన కెఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లి మరో వికెట్ కోల్పోకుండానే భారత్‌ను గెలిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 97 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో వన్డేల్లో తన 48వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో మాస్టర్ బ్యాట్స్‌మన్ పేరిట ఉన్న 49 అత్యధిక సెంచరీల రికార్డుకు కోహ్లి ఒక శతకం దూరంలో నిలిచాడు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 3ఫోర్లు, సిక్స్‌తో అజేయంగా 34 పరుగులు చేశాడు. దీంతో భారత్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. బంగ్లాకు ఓపెనర్లు తంజీద్ హసన్, లిటన్ దాస్‌లు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన తంజీద్ 3 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. దాస్ 7 బౌండరీలతో 66 పరుగులు సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. చివర్లో మహ్మదుల్లా (46) మెరుపులు మెరిపించాడు. రహీం (38) తనవంతు పాత్ర పోషిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ రెండేసి వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News