Tuesday, May 14, 2024

వన్ నేషన్- వన్ ఎలక్షన్ రగడ ఎందుకు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుండి జమిలి ఎన్నికల ఆలోచన తేవడం పట్ల ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. నిర్ణయం తీసుకోవడం వెంటనే ఓ కమిటీని ఏర్పాటు చేయడం ఏమిటిదంతా అని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. దేశంలోని ఇప్పటి సమాఖ్యాయుత ప్రజాస్వామిక విధానానికి ఇటువంటి దూకుడు ఆలోచనలు విఘాతం అవుతాయని స్పందించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాల పరిశీలన పేరిట కమిటీని ఏర్పాటు చేయడంపై ముంబైలో జరుగుతున్న ఇండియా కూటమి వేదికగా ప్రతిపక్ష నేతలు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజల దృష్టిని మళ్లించేందుకు అని కాంగ్రెస్ నేత ఖర్గే పేర్కొన్నారు. ముంబైలో ఇండియా కూటమి భేటీతో అధికార పక్షం బిజెపిలో వణుకు పుట్టిందని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఈ ప్రభుత్వం మరెన్ని చేష్టలకు దిగుతుందో, తీవ్రసమస్యల నుంచి పక్కదోవపట్టిస్తుందో తెలియడం లేదని ఖర్గే వ్యాఖ్యానించారు.

ఇటువంటి విన్యాసాలు ఎన్నెన్ని చేసినా పట్టించుకునేది లేదని , దేశ ప్రజలు ఎంతోకాలం మోసపోతూ ఉండలేరని ఖర్గే స్పష్టం చేశారు. కమిటీ ఏర్పాటుపై నేరుగా ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు నిరంకుశ ప్రభుత్వ నిష్క్రమణకు కౌంట్‌డౌన్ ఆరంభం అయిందని ఖర్గే తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఎగ్జిట్‌కు రంగం సిద్ధమైందని, 140 కోట్ల మంది ఇండియన్స్ ఈ దిశలో పరివర్తనకు సిద్ధపడ్డారని చెప్పారు. శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ కావల్సింది ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ కాదని సజావుగా ఎన్నికల నిర్వహణే తాము కోరుకుంటున్నామని , మోడీ డొంకతిరుగుళ్లు పనికిరావని చెప్పారు. ఇండియా కూటమి దెబ్బతో మోడీ సర్కారు ఇక పలు డ్రామాలు ఆడుతుందని కాంగ్రెస్ నేత విజయ్ వాదెట్టివ్వర్ తెలిపారు. సిపిఐ నేత డి రాజా మాట్లాడుతూ ప్రధాని మోడీ మాటలకు చేతలకు పొంతనలేదనేది తెలిసిపోయిందన్నారు.

ఓ వైపు భారతదేశం ప్రజాస్వామ్య తల్లి అంటారు. మరో వైపు జమిలీపై ఏకపక్ష నిర్ణయాలు. ఏ రాజకీయపార్టీతో మాట్లాడకుండా ముందుకు సాగడాలు అని విమర్శించారు. అధికార పార్టీలోనిభయాలు ఇప్పుడు స్పష్టం అయ్యాయని ఆప్ నుంచి ప్రియాంక కక్కర్ తెలిపారు. ప్రతిపక్షాలు ఏకమవుతాయని గ్రహించి లోక్‌సభ ఎన్నికలను ముందు జరపడం లేదా సుదీర్ఘంగా వాయిదా వేయించడం కేంద్రం ఆలోచనగా కన్పిస్తోందని ప్రతిపక్ష నేతలు స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News