పాక్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ పిలుపు
పార్లమెంట్‌లో అత్యంత కీలక ప్రతిపాదన
2003 తరహా చర్చలకు దాయాది సిద్ధం
ఇస్లామాబాద్ : పలు వివాదాస్పద సమస్యలపై పాకిస్థాన్ వెంటనే భారతదేశంతో సమగ్ర, సమ్మిశ్రిత చర్చలు జరపాలని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ పిలుపు నిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తరువాతి భారత్ ఆపరేషన్ సిందూర తరువాతి క్రమంలో పాకిస్థాన్ వైపు నుంచి ఈ విధమైన చర్చల ప్రతిపాదన రావడం కీలక పరిణామం అయింది. అదీ దేశ విదేశాంగ మంత్రి ఈ మేరకు పిలుపు ఇవ్వడం రాజకీయ , దౌత్య వర్గాలలో ఆసక్తికి దారితీసింది. దార్ శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిప్రాయం తెలిపారు. పాక్ ఉగ్రదాడులు , ప్రత్యేకించి పహల్గాం దాడి తరువాతి దశలో భారతదేశం చర్చల విషయంలో ఖచ్చితమైన రీతిలో నిలబడింది.
పాక్‌తో ఇకపై ఎటువంటి చర్చలు అయినా, ద్వైపాక్షికంగా కేవలం పిఒకె తిరిగి అప్పగింత, ఉగ్రవాద నిర్మూలన ప్రాతిపదికనే జరగాలని తెలిపింది. ఈ దశలో పాక్ పార్లమెంట్‌లో విదేశాంగ మంత్రి మాట్లాడారు. భారత్‌తో కాల్పుల విరమణ ఈ నెల 18వతేదీ వరకూ కొనసాగుతుందని తెలిపారు. అయితే ఇది తాత్కాలిక పరిణామం , పూర్తి స్థాయి సమగ్ర రాజకీయ చర్చలు ద్వారానే రెండు దేశాల సమస్యలు పరిష్కరించుకోవల్సి ఉందని పేర్కొన్నారు. ఇటీవల కాల్పుల విరమణ ప్రక్రియ పొడిగించాలని నిర్ణయించడం కీలక పరిణామం అయింది.
భారత్‌తో సమగ్ర రీతిలో చర్చలు జరగాల్సిందేనని ఉప ప్రధాని కూడా అయిన ఇషాఖ్ చెప్పడంతో ఈ చర్చల ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది. చర్చలకు తాము సిద్ధమని ప్రపంచ దేశాలకు ఇప్పటికే తెలియచేశామని వివరించారు. భారత్ పాక్‌కు అందాల్సిన నదీ జలాలను నిలిపివేయరాదని, ఇది చట్ట విరుద్ధం అవుతుందని ,సింధష్త్ర ఒప్పందం రద్దుకు దిగడం తాము యుద్ధ చర్యగానే భావించి తగు విధంగా స్పందించాల్సి ఉంటుందని తెలిపారు. పలు వివాదాస్పద అంశాల గురించి చర్చించడం ఈ సమగ్రరీతి సంప్రదింపుల పరిధిలోకి వస్తుంది.
ఇటువంటి కీలక చర్చలు ఇంతకు ముందు 2003లోజనరల్ పర్వేజ్ ముషారఫ్ పదవీకాలంలో జరిగాయి. ఇందులో కీలకమైన ఎనిమిది విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉభయ దేశాల మధ్య అత్యంత వివాదాస్పద విషయాలు కూడా వీటిలో ఉన్నాయి. కాగా ఇటీవలి కాలంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు అత్యంత కీలక విషయంగా భారతదేశం భావిస్తోంది. అయితే అప్పటి చర్చల ప్రక్రియ 2008 ముంబై దాడుల తరువాత నిలిచిపోయింది. ఒక్కరోజు క్రితమే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్‌తో చర్చలకు తమ దేశం సిద్ధమని ప్రకటించారు.