Saturday, April 20, 2024

సామాజిక స్పృహ లేని చదువులు

- Advertisement -
- Advertisement -

మానవ విలువలు, వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ పౌరుడి లక్షణాలు అలవడేందుకు విద్య దోహదపడుతుంది. బడిలో వేసింది మొద లు.. పిల్లల్లో ప్రజ్ఞాపాటవాల్ని పెంచి, వివేకవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బోధన మొదలవుతుంది. శారీరక, మానసిక ఒత్తిడికి గురికాకుండా చదువు అబ్బేలా బోధన చేస్తున్న పాఠశాలలు వేళ్ళ మీద లెక్కించొచ్చు. ఉచిత నిర్బంధ విద్య, మధ్యాహ్న భోజన పథకం, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆంగ్ల మాధ్యమం, వయోజన విద్యా కార్యక్రమం తదితరమైన విద్యా వ్యాప్తికి దశాబ్దాలుగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. బండెడు పుస్తకాలు భుజాన వేసుకొని పాఠశాలకు వెడుతున్న పిల్లల్లో ఎంతో జ్ఞానం అబ్బుతోందని ప్రతి తల్లిదండ్రీ అనుకోవడం సహజం. కానీ, జీవితానికి అక్కరకు రాని చదువు మనకిప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. పాఠ్యాంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవడం, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందడం రెండూ వేర్వేరు అంశాలు. పరీక్షల కొరకే చదువు కొనసాగడం వల్ల పిల్లల మానసిక వికాసం దెబ్బతింటుంది. అలా కాకుండా పిల్లల అభిరుచులకు అనుగుణంగా చదువు చెప్పడం వల్ల మేథో వికాసం చెందడానికి ఆస్కారముంటుంది. సామాజిక బాధ్యతను తెలియజెప్పి, పిల్లలను బాధ్యతగా పెంచే చదువు కావాలిప్పుడు. ఇలాంటి చదువు ఎంత మంది పిల్లలకు చేరువవుతున్నదన్నది మన ముందున్న ప్రశ్న.

వాస్తవంగా ఎదురవుతున్న సమస్య విద్యా ప్రమాణాల స్థాయి. పాఠశాలలు అందిస్తున్న విద్యస్థాయి అత్యంత నిరాశాజనకంగా ఉన్నదని సర్వేలు వెల్లడి చేస్తున్నా యి. చాలా మంది పిల్లలు తమ మాతృభాషలో ఉన్న వచనాన్ని చదవలేకపోతున్నారు. ప్రాథమిక అంక గణితంలో లెక్క కూడా పరిష్కరించలేకపోతున్నారు. పాఠశాల విద్య నాణ్యత సూచీలో మన రాష్ర్టం కూడా వెనుకబడి వుంది. బడుల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరతతో విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయని కేంద్రం వెలువరించిన ‘పర్మార్మెన్స్ ఇండెక్స్ గ్రేడ్ (పిఐజి)’ నివేదిక తేల్చింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి చూస్తే పాఠశాల విద్య నాణ్యతలో తెలంగాణ 31వ స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఐదు పాయింట్లు తగ్గి, దిగువ నుంచి ఏడో స్థానంలో నిలిచింది. పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పాలన, విద్యార్థుల నమోదు వంటి అంశాల ఆధారంగా ఏటా పిఐజి సూచీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆయా అంశాల ఆధారంగా 202021 సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు 754 పాయింట్లు వచ్చాయి. అంతకు ముందు 201920 పిఐజిలో మన రాష్ర్టం 759 పాయింట్లు పొందింది. ఈసారి తెలంగాణ కన్నా దిగువన సిక్కిం 751, మణిపూర్ 741, నాగాలాండ్ 728, ఉత్తరాఖండ్ 719, మేఘాలయ 716, అరుణాచల్ ప్రదేశ్ 669 పాయింట్లు పొందాయి.

నాలుగు నాలుగులు ఎంత అంటే… ఒక విద్యార్థి 15 అని, మరో విద్యార్థి 12 అని చెప్పాడు. ఇలాంటి తప్పుడు సమాధానం చాలా మంది విద్యార్థులు నోట వచ్చింది. ఇందుకు బాధ్యత ఎవరిది? ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలకు మాతృభాషలోని పుస్తకం చదవమని ఇస్తే, తప్పులతడకలతో వల్లె వేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ సారథ్యంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం లో ఎదురైన అనుభవాలివి. వెనుకబడుతున్న చదువుల కారణం గా చిన్నారుల నైపుణ్యతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చదవడం, రాయడం, సాధారణ లెక్కలు చేయడంలో బడి పిల్లలు రాణించలేకపోతున్నారు. దేశ వ్యాప్తంగా పది వేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 86 వేల మూడవ తరగతి విద్యార్థుల ప్రజా ్ఞపాటవాలను పరిశీలించిన ఎన్‌సిఇఆర్‌టికి ఆశాజనకమైన వాతావరణం కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. తెలంగాణ, ఎపిలలో కూడా 52 శాతం పిల్లల్లో కనీస విద్యా ప్రమాణాలు కానరాలేదు. మొత్తం విద్యార్థుల్లో 19 శాతం మంది తెలుగులో ఒక్క పదమూ సరిగా పలకలేకపోయారు. గణితంలో ఎపిలో 47 శాతం, తెలంగాణలో 49 శాతం మంది కనీస ప్రమాణాలను అందుకోలేకపోయారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాల ప్రకారం నిమిషంలో 8 పదాలలోపు మాత్రమే చదవగలిగిన వారిలో కనీస ప్రాథమిక పరిజ్ఞానం లేదని అర్థం. 926 మధ్య పదాలను తప్పులు లేకుండా చదివితే ప్రపంచ కనీస ప్రమా ణాలను పాక్షికంగా అందుకున్నట్లు పరిగణిస్తారు. 27 50 మధ్య పదాలు చదవగలిగితే ప్రపంచ కనీస సామర్థ్యాలను కలిగివున్నట్లవుతుంది. ఈ ప్రకారం ఎపి, తెలంగాణలో సగటున 52 శాతం మందిలో కనీస అభ్యసన సామర్థ్యాలు లేవని స్పష్టమవుతోంది. 3వ తరగతి విద్యార్థుల్లో చిన్న పదాలు, తరగతి గదుల్లోని గోడలపై పోస్టర్లపై అంశాలు, గేయాలు చెప్పలేకపోయారు. గణితంలో మూడంకెల విలువల్ని వాటి స్థానాల ఆధారంగా గుర్తించడంలో ఇబ్బందిపడ్డారు.

కూడికలు, తీసివేతలు, భాగాహారాలు చేయలేకపోయారు. పక్షు లు, ఆహారం, జంతువులను గుర్తించడంలో విఫలమయ్యారు. ఇక 5వ తరగతి విద్యార్థులు తమ దైనందిన జీవితంలో భాగమైన సంఖ్యలను వినియోగించలేకపోయారు. త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం, చుట్టుకొలత, వైశాల్యం గణించలేదు. సంఖ్యలను చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, విపత్తులపై అవగాహన కొరవడింది. 8వ తరగతి విద్యార్థులు తరగతి గదిలోని వస్తువులు, చతురస్ర, దీర్థచతురస్ర వస్తువులు, గది నేల, చాక్‌పీస్ బాక్సు చుట్టు కొలత, వైశాల్యం లెక్కించలేకపోయారు. పటాలపై చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించలేకపోయినట్లు సర్వేలో వెల్లడయింది. తెలుగు, బెంగాలీ, మిజో, తమిళం, హిందీ, ఇంగ్లీషు,
పంజాబీ తదితర భాషల్లో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. దీనికోసం ఆయా భాషలను బోధించే రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా వరకు మెరుగ్గా ఉన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి కేటగిరీల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. వీరిలో బిసి విద్యార్థులు కొంత మెరుగ్గా కనిపించినట్లు సర్వే స్పష్టం చేసింది. పంజాబ్, రాజస్తాన్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2017 కంటే ముందు విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యం పడిపోయింది. కరోనా మహమ్మారి ప్రధాన కారణమై ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి చదివే, రాసే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు తెలంగాణ రాష్ర్ట విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిమెట్టు, బ్రిడ్జి కోర్సుల ద్వారా పాఠశాలల ప్రారంభంలోనే ఈ దిశగా కొంత మేర కృషి జరిగింది. అయితే దీనిపై క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు వెనుకబడి ఉన్నారనే విమర్శలొస్తున్నాయి. భాషా పండితులు, సబ్జెక్టు టీచర్ల కొరత కారణంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయత్నం జరుగలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో 3 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో వంద శాతం సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని రాష్ర్ట విద్యాశాఖ కేంద్రానికి భరోసా ఇచ్చింది. 8వ తరగతి విద్యార్థుల్లో ప్రస్తుత అభ్యసన సామర్థ్యాన్ని 85 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అయితే గతేడాది కరోనా మూలంగా విద్యా ప్రమాణాల మెరుగుదలలో పురోగతి కనిపించలేదని భావించారు. ఈ ఏడాది బడిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడంతో విద్యా ప్రమాణాలు కుంటుపడకుండా చూడాలి. పాఠాల బరువు తగ్గించడంతో పాటు వాటి నాణ్యతను పెంచడం, అభ్యసన తీరు తెన్నుల్ని మార్చడం అవసరం. పాఠాలను విశదీకరించడంతో పాటు, వారికి ఆచరణాత్మక జ్ఞానం అలవడేట్లుగానూ చర్యలు తీసుకోవాలి. చదువులకూ సమాజానికీ మధ్య నెలకొన్న అంతరాన్ని పూడ్చాలి.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News