Monday, July 22, 2024

ఎవరి ఓటమి? ఎవరి గెలుపు?

- Advertisement -
- Advertisement -

భారతదేశం అనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర గొప్పది. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలు నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారు. ఈ మధ్య ముగిసిన ఎన్నికలలో 64.2 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యం సౌధాన్ని నిలబెట్టడానికి తమవంతు పాత్ర పోషించారు. ఓటరు చాలా విలక్షణమైన తీర్పునిచ్చాడు. విజ్ఞతను ప్రదర్శించాడు. ఎన్నో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం జరిగినా తనదైన శైలిలో విభిన్నమైన తీర్పునిచ్చాడు. ఎవరు సంతోషించాలో, ఎవరు బాధపడాలో నేతలకు, పార్టీలకు వదిలిపెట్టాడు.అందరూ బాధపడవలసిన అంశం మాత్రం ఒకటి ఉంది. ఒక్కో అభ్యర్థి కోట్లాది రూపాయలు ఖర్చు చేయగా, ఎన్నికల కమిషన్ మాత్రం రూ. 1100 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేయడం అత్యంత బాధాకరం. ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం చేసుకున్న బిజెపి 300 మార్కుకు చేరుకోలేకపోవడం గమనార్హం.

అది కూడా తన మిత్రపక్షాలు గెలుచుకున్న సీట్లతో కలిపి. ఏకచ్ఛత్రాధిపత్యంగా ముచ్చటగా మూడోసారి పరిపాలన చేయాలనుకున్న మోడీ ఆలోచనలకు ఆమోదం లభించలేదు.ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ అనేక పక్షాలను కలుపుకొని ‘ఇండియా’ బ్లాక్ నేర్పరిచినా అధికారమందే వరకు ఓటరు కరుణించలేదు. సీట్ల సంఖ్య బాగానే పెరిగింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. ‘వై నాట్ 175’ అన్న జగన్మోహన్ రెడ్డికి పట్టుమని డజను సీట్లు కూడా గెలవడం గగనం అయిపోయింది.లోక్‌సభ విషయంలోనూ అదే పరాభవం జరిగింది. 4 సీట్లతో సంతృప్తిపడవలసి వచ్చింది. అసలు జాతీయ పార్టీలు అనే చెప్పుకునే పక్షాలు కొన్ని రాష్ట్రాలలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయి ప్రాతినిథ్యం లేకపోవడం బాధాకరం. ప్రజాస్వామ్యంలో ప్రముఖ పాత్ర వహించాల్సిన ప్రతిపక్షం అంటే పాలన పక్షాలకు గిట్టట్లేదు. వాటిని సమూలంగా నిర్మూలించాలని లేదా సభలో వారికి పూర్తిగా ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే దురాలోచనను ఓటరు మాత్రం సహించలేకపోయాడు. తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలో సభ్యులను ఫిరాయింపుల చట్టం వర్తించకుండా వారినందరినీ రకరకాల ప్రలోభాలతో తన పార్టీలో విలీనం చేసుకున్నారు కెసిఆర్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రకంగా ఫిరాయించిన సభ్యులందరినీ ఓటర్ తెలివిగా ఓడించాడు.

ఈసారి కాంగ్రెస్ పార్టీకి కనీసం 50 సీట్లైనా రావాలని తాను దేవుని ప్రార్థిస్తున్నట్లు ప్రధాన మోడీ చెప్పుకొచ్చాడు. ప్రతిపక్ష కాంగ్రెస్ అంటే ఆయనకున్న చులకన భావం ఇక్కడ స్పష్టమవుతున్నది. కానీ ఓటర్ మాత్రం కాంగ్రెసు గౌరవం ఏమైనా సంఖ్యలో సీట్లిచ్చి అధికారానికి మాత్రం కాస్తదూరంలో ఉంచాడు. బలమైన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించమని ఆ బ్లాక్‌ను ఆదేశించాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షం ఉండకూడదు అనుకున్న జగన్‌కు ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయలేదు. ‘వై నాట్ 175’ అనే నినాదాలు నిరసించాడు, పరిహసించాడు. పర్యవసానంగా అస్సలు సభలో అతడి వైకాపా ఉనికి ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. ఓటర్ తనకు పక్షపాతం కాదు, విచక్షణ మాత్రమే ఉంటుందని నిరూపించాడు. అహంకారానికి, అహంభావానికి ‘చెక్’ పెట్టాడు ఓటరు.ప్రతిపక్షాలు నామమాత్రం కూడా లేకుండా చేయాలని ప్రయత్నాలు బెడిసికొట్టి అవి మరింత బలపడగా, ప్రయత్నించిన పక్షాలు బలహీనపడడం లేక నామరూపాలు లేకుండా పోవడం జరిగింది.

ప్రభుత్వ ఖజానా నుండి వివిధ పథకాల పేరిట డబ్బు పంచి ఓట్లు రాలేదని విచారపడ్డ ఆశ్చర్యమేస్తోంది. డబ్బు పంచింది సంక్షేమానికా లేక ఓట్ల కోసమా అనే సందేహం సగటు పౌరుడికి కలుగుతున్నది. అదేంటో ఎన్నికలకు ముందు మాత్రమే ఇంధన ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయి. భారత ప్రజలను వంచించినా, తక్కువగా అంచనా వేసిన అది ఇలాంటి ఫలితాలను ఇస్తుంది. ఎవరు గెలిచినా, ఓడినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి ఆ స్థితి కల్పించిన ఓటరు గెలిచినట్టా, ఓడినట్టా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతిపక్షం పేర్లు ఎంఎల్‌ఎలు తమతో ‘టచ్’లో ఉంటున్నారంటూ పాలక పక్షం మైండ్ గేమ్ అడ్డం కొంతకాలంగా చూస్తున్నాం. ఇక్కడ కూడా దుష్ట సంప్రదాయానికి తెరతీయడం జరుగుతున్నది. ఫిరాయింపులను ప్రోత్సహించడానికి భూమిక ఏర్పాటు చేయడమే వారి ఆలోచన.చట్టాలకు తూట్లు పొడవడం, చట్టాలలోని లొసుగులు తమకు అనుగుణంగా మార్చుకోవడం చూస్తే మన నేతలు ప్రపంచంలోని అత్యున్నత స్థాయి అవార్డులకు అర్హులు అనిపిస్తుంది.

అసలు పార్టీలో చేరడానికి ముందే రాబోయే మంత్రివర్గంలో పదవీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి లాంటి షరతులు, ఇంకా రహస్య ఒప్పందాలు మనకు తెరమీదకు రావడం విశేషం. ఇక ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి మోడల్ కోడ్ అమలులోకి వస్తుంది. ఏ రకమైన విద్వేష ప్రకటనలు, ఉపన్యాసాలు, మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలు, సమయం మించి సభ నిర్వహించడం లాంటివి నిషిద్ధం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం సర్వసాధారణం. ఎన్నికల కమిషన్ ఎక్కువసార్లు నిశ్శబ్దం పాటిస్తూ ఉంటుంది. ఫిర్యాదులు వస్తే మాత్రం సదరు నాయకుడి నుండి వివరణ కోరి చేతులు దులుపుకుంటుంది. చేష్టలుడిగిన అధికారులు చర్యలకు ఉపక్రమించకుండా చోద్యం చూస్తూ ఉంటారు.

వారి పరిస్థితి ‘విడవమంటే పాము కోపం కరమంటే కప్ప కోపం’ లా ఉంటుంది దానికి కోరలు లేవు, కాటు వేయలేదు, కనీసం బుసకొట్టడం కూడా అంతే. ప్రభుత్వాల చెప్పు చేతుల్లో నడిచే సంస్థలు, ఎన్నికల కమిషన్, ఐటి శాఖ, ఇడి ప్రతిపక్షాల మీద మాత్రం తమ ప్రతాపం చూపడంలో ఘన విజయం సాధిస్తున్నాయి. ఎన్నికలు సమీపించిన కొద్ది మాటల వాడివేడి పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రచారం పూర్తి కాగానే ‘శబ్దం మీద నిఘా తగ్గుతుంది. నిశ్శబ్దంగా జరిగే పనులు నిరంతరాయంగా జరుగుతాయి. మాటలు ఉండవు అన్ని మూటలే. నోటికి లేదు నోటుకి పని’ అని ప్రఖ్యాత వ్యంగ్య రచయిత శ్రీ సతీష్ చందర్ అన్న వ్యాఖ్యలు అక్షర సత్యాలు.

 

శ్రీశ్రీ కుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News