Saturday, May 17, 2025

యుద్ధకాలంలో చీమ కథ

- Advertisement -
- Advertisement -

పిల్లవాడు ఎప్పుడూ చీమపుట్టలో వేలుపెడుతూనే ఉంటాడు. వాడి వేలును చీమ ప్రతిసారీ కుడుతూనే ఉంటుంది. కనుక వాడు ఏడ్వక తప్పదు. వేలుపెడితే కుడుతుదన్న విషయం పిల్లవాడికి తెలియదు. పెడతాడు గనుక కుట్టాలన్నది మాత్రం చీమకు తెలుసు. అంతా ఒక వలయం. ఎవరినీ ఏమీ అనలేము. పిల్లవాడు ఎదిగి, విషయాలు తెలిసి, చీమపుట్టలో వేలుపెట్టకూడదనే జ్ఞానం కలిగే వరకు. పాశ్చాత్యుల సామ్రాజ్యవాదం, వలసవాదం, నయావలసవాదం, ఆర్థిక ఆధిపత్యవాదం, భౌగోళిక ఆధిపత్యవాదం, సైనిక ఆధిపత్య వాదాలకు 600 సంవత్సరాల వయసు.

అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ 600 ఏళ్లుగా చీమలు పిల్లవాడు ఆడుకునే చోట పుట్టలు పెడుతూనే, పిల్లవాడి వేలును కరుస్తూనే ఉన్నాయి. చీమలది చాలా తెలివైన వ్యూహం. పిల్లవాడి కుటుంబం నివసించే ఇంటికి వెళతాయి. అక్కడి నేలను తవ్వి తోడి ఆ చోటంతా వెతికి, తమకు కావసినదంతా కొల్లగొడతాయి. స్థానిక ప్రజలకు విషయం అర్థమై కాదు పొమ్మంటే మందలుగా పైనబడి కరిచి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తర్వాత మందలన్నీ కలిసి ఆ పిల్లవాడి ఇంటిని, ఊరిని పంచుకుంటాయి. ఆ ప్రకారం అన్ని భూఖండాలూ పంపిణీ అవుతాయి. పంపిణీలో సమస్యలు వచ్చి తగవులు జరిగితే చీమల మధ్య కొంత పునః పంపిణీలు జరుగుతాయి. మొత్తంమీద ఇల్లూ, ఊరూ చీమలకే ఉంటాయి గాని పిల్లవాడికి, తన కుటుంబానికి కాదు. ఊరివారికి కాదు.

ఆ విధంగా కొన్ని వందల సంవత్సరాలు గడిచేసరికి, ఆ పిల్లవాడికి వారసులుగా కొత్తతరాలు వచ్చేసరికి, ఆ ఇల్లూ, ఊరూ తమవేగదానన్న ఆలోచనలు వారిలో మొదలయే కాలానికి, చీమలకు కూడా కొత్త ఆలోచనలు మొదలవుతాయి. ఆ ఇంటిని, ఊరిని తమ నియంత్రణలో ఉంచుకోవటమైతే అవసరం గనుక, అందుకు తగిన కొత్త వ్యూహాలు రచిస్తాయి. ఆ పిల్లవాడి కొత్త తరాల వారితో ఇల్లూ, ఊరూ మీదేనని, వాటి బాగోగులు మాత్రం తాము చూస్తామంటాయి. ఆ ఫలితాలను చెరికొంత తీసుకుందామని ఒప్పిస్తాయి. మారిన కాలానికి తగినట్లు వ్యూహాలైతే రచించారు గనుక, అవి నెరవేరేందుకు ఆ ప్రకారం ఆ కొత్త తరాల మధ్య తగవులు సృష్టిస్తాయి. వాటిలో సరిహద్దుల సంబంధమైనవి ఉంటాయి. జాతులు, మతాలపరమైనవి ఉంటాయి. ఆర్థికమైనవి, నదీజలాలు, పర్వతశ్రేణులు, పొరుగు సముద్రాలలోని దీవులపరమైన ఉంటాయి. ఇంకా ఇటువంటి వేఛప్పన్నారు.

ఎపుడైనా ఆఫ్రికా చిత్రపటాన్ని చూసారా? లేనట్లయితే చూడండి. ఇవేమి సరిహద్దులని ఆశ్చర్యపడకండి. అవి అక్కడి పిల్లవాడి ఇంటినీ, ఊరినీ అమెరికా, బ్రిటన్‌తో పాటు 12 యూరోపియన్ దేశాలు, ఓటోమన్ రాజులు కలిసి 1884లో బెర్లిన్‌లో సమావేశమై గీసిన సరిహద్దులు. ఆ పటాన్ని దయచేసి ఒకసారి చూడండి. సరిహద్దులు ఇట్లా ఉంటాయా అని నమ్మలేకపోతే కళ్లు నులుముకుని మరీ తిరిగి చూడండి. ఆ చిత్రమైన ఆ సరిహద్దులను ఏ విధంగా గీసి ఉంటారో ఊహించగలరా? ఆఫ్రికా మహా ఖండంలో ఎక్కడ ఏమున్నదో ఎవరికీ తెలియదు. ఏ కొండలు, ఏ నదులు, ఏ లోయలు, ఏ జాతులు ఎక్కడ ఉన్నాయనే సర్వే ఏమీ లేదు.

ఆ చీమలకు కావలసిందంతా ఎవరుకోరుకున్నంత వారు పంచుకోవటం. అప్పటికి యూరప్‌లో, దానితోపాటు బయటి వలస దేశాలలో ఎవరి బలం ఎంతో ఆ దామాషాలో ఆఫ్రికా పిల్లవాడి ఇంటిని, ఊరిని పంచుకోవటం. కాని సర్వేలు అంటూ జరగలేదు గనుక, బెర్లిన్‌లోని ఒక పెద్ద హాలులో, ఒక పెద్ద ద్ద, ఒక పెద్ద ఆఫ్రికా మ్యాప్‌ను తయారు చేయించి పెట్టారు. చేతులలోకి స్కేళ్లు, పెన్సిళ్లు తీసుకున్నారు. స్కేళ్లను మ్యాప్‌పై అడ్డంగా, నిలువుగా పెట్టి గీతలు గీస్తూ పోయారు. దేశాల సరిహద్దులు అడ్డం, నిలువు జామెట్రీ గీతలతో తయారయ్యాయి. ఆ గీతల మధ్య ఆఫ్రికా పిల్లవాడి ఇల్లు, ఊరిలోని భూభాగాలు, పర్వతాలు, నదులు, లోయలు, మహా సరస్సులు, జాతులు, తెగలు ఏవి ఏవిధంగా ముక్కలుచెక్కలయాయో, ఏముక్క ఏ చీమ పాలన కిందకు ఎందుకు పోయిందో ఆ పిల్లలు ఎవరికీ తెలియదు. ఆ పిల్లలలో అనేకుల మధ్య అపుడు మొదలైన సరిహద్దు తగవులు, హింసలు 155 సంవత్సరాల తర్వాత కూడా నేటికీ సాగుతునే ఉన్నాయి.

అది చీమలకు పండగ అయింది. పిల్లవాడి ఇంటిని, ఊరిని నేటికీ తొలుస్తూనే ఉన్నాయి. అంతేకాదు. మరొక విశేషం ఉంది. ఆ వేర్వేరు పిల్లల మధ్య తగవులు పెచ్చరిల్లినపుడు ఈ చీమలే మధ్యవర్తిత్వం వహిస్తాయి. హింసలు జరిగితే లేక జరిగేట్లు తామే చేసినా, ఇరువురికీ ఆయుధాలు అమ్ముతాయి. హింస బాగా జరగటానికి రెండు సైన్యాలకూ శిక్షణ ఇస్తాయి. మధ్య మధ్య లండన్, పారిస్, జెనీవాలలో శాంతి చర్చలు జరిపిస్తాయి. తమ ప్రతిపాదనలు తాము చేస్తాయి. అందుకు ఒప్పిస్తాయి. వాటి అమలును పర్యవేక్షిస్తాయి. ఎవరైనా మాట వినకపోతే సైనికం గానో, రాజకీయం గానో కుట్రలు జరిపిస్తాయి. అక్కడ తమ సైనిక స్థావరాలు నెలకొల్పుతాయి. ఆ దేశాల ఆర్థిక విధానాలు ఏవిధంగా ఉండాలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ద్వారా, వాణిజ్య విధానాల గురించి డబ్లుటిఒ ద్వారా చెప్పిస్తాయి.

వాటి మధ్య కాల్పులు జరిగితే కాల్పుల విరమణ, యుద్ధాలు జరిగితే యుద్ధ విరమణ చేయిస్తాయి. తమ ఆయుధాలు ఖరీదు చేయకుంటే చేయిస్తాయి. తక్కువ ఖరీదు చేస్తే ఎక్కువ చేయిస్తాయి. తగవులు లేకున్నా కొనిపిస్తాయి, తమ ఆయుధ వ్యాపారం వర్ధిల్లాలి గనుక. కొనండి కొనండి మీకు కమీషన్లు ఇస్తామంటాయి. నాయకులకు, అధికారులకు, సైన్యాధికారులకు, ఆయుధ దళారులకు, అవతలి వారికిచ్చి పోటీ పెంచి ఇవతలి వారిని, ఇవతలివారికిచ్చి పోటీ పెంచి అవతలి వారిని కొనమంటాయి. ఇంకా లండన్, పారిస్ వగైరాలలో జరిగే ఆయుధ ప్రదర్శనలకు తీసుకుపోయి విలాసవంతమైన ఆతిథ్యాలిస్తాయి. కొనకపోతే మీరు లంచాలు అడిగారంటూ మీడియాలో ప్రచారం చేయిస్తాయి. అంతా చీమల రాజ్యం. అవి కుట్టే కథలు. పిల్లవాడి ఇల్లూ, ఊరూ చీమల తవ్వకాలకు నిరంతరం గురవుతూనే ఉండే సీరియల్ కథ. 600 ఏళ్లుగా. ఆఫ్రికా వంటి ఉదంతాలు ప్రపంచం అంతటా ఉన్నాయి. 1884 85లో అక్కడి సరిహద్దుల వ్యవహారం తర్వాత 1947 లో భారతదేశ సరిహద్దులకు రండి.

బెర్లిన్‌లో మరికొన్ని చీమలతో కలిసి ఆఫ్రికన్ పిల్లవాడిని కుట్టిన బ్రిటిష్ చీమ, ఈసారి తాను మాత్రమే పూనుకొని ఏషియన్ పిల్లవాడిని కుట్టింది. భారత పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు గుర్తించేందుకు ఒక కమిషన్‌ను నియమించి సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ అనే లాయర్‌ను దానికి అధ్యక్షుడిని చేసింది. అంతవరకు ఆయన ఇండియాను ఒక్కటంటే ఒక్కసారైనా చూడలేదు. భారతదేశం గురించి ఏమీ తెలియదు. ఉపఖండపు స్థాయి గల ఇంత భారీ దేశ విభజనకు సరిహద్దులు గుర్తించటం కోసం తనకు ఇచ్చిన సమయం కేవలం అయిదు వారాలు. ఇప్పటి కమిషన్లకు వలె పొడిగింపులు లేవు. అదిగాక, జమ్మూ కశ్మీర్ సమస్య ఒకటి సృష్టి అయేందుకు ఆస్కారం కల్పించిపోయారు. దానితో అప్పటి నుంచి 87 సంవత్సరాలుగా జరుగుతున్నది చూసినపుడు, ఏషియన్ పిల్లవాడిని బ్రిటిష్ చీమ ఏ విధంగా కుట్టి, తన చిరకాలపు వ్యూహాలను ఎంత విజయవంతంగా నేటికీ అమలు చేస్తున్నదో చూసి మెచ్చుకోవలసిందే.

ఇటువంటిదే భారత, చైనా సరిహద్దు. అపుడు ఇండియాలో ఉండిన బ్రిటిష్, వలస ప్రభుత్వపు విదేశాంగమంత్రి సర్ హెనీ మెక్ మహన్, ఎటువంటి సర్వేలు, సంప్రదింపులు లేకుండా, మొత్తం హిమాలయ పర్వత ప్రాంతాల మీదుగా సుమారు 2,200 మైళ్ల సరిహద్దును కాగితంపై తనకు తోచిన విధంగా గీసిపోయాడు. 87 సంవత్సరాలుగా బ్రిటిష్ చీమ ఏషియన్ పిల్లవాడిని అక్కడ కూడా కుట్టుతూనే ఉన్నది. అట్లా కుట్టటంలో 600 ఏండ్ల అనుభవం గల పాశ్చాత్య చీమలకు, అందువల్ల తగిన ఫలితం కూడా లభించటం అవసరం. అందువల్ల ఆఫ్రికాలో అన్ని యుక్తులూ పన్నటంలో భాగస్వామ్యం గల బ్రిటన్, అమెరికా చీమలు ఇక్కడ కూడా 87 సంత్సరాలుగా పనిచేసి ఆనందిస్తూ లాభపడుతున్నాయి. సమస్యలను పరిష్కారం కానివ్వరు. మరింత రెచ్చగొడతారు. అదే సమయంలో పెద్ద మనుషులు వలె నటిస్తారు.

ఒకరి నుంచి ఒకరికి రక్షణ కోసమంటూ ఇద్దరికీ ఆయుధాలు అమ్ముతారు. అయినా అంతా మంచి చేస్తున్నట్లు ఉభయులనూ నమ్మిస్తారు. తమను, తమ పెద్దరికాన్ని, మధ్యవర్తిత్వాన్ని నమ్మి, తాము చెప్పినట్లు చేయకపోతే ఇక ప్రళయమేనంటారు. ఇరాక్‌లో సామూహిక విధ్వంసక ఆయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్) అనే దొంగ ఇంటెలిజెన్స్ రిపోర్టులు సృష్టించినట్లు, ఏషియాలోనూ అటువంటివి సృష్టించి ఇక్కడి పిల్లవాండ్లను భయపెడతారు. ఇటువంటి అనుభవాలు పాశ్చాత్య చీమలకు 600 సంవత్సరాలుగా ఉన్నపుడు, అవి కుట్టడమనే అనుభవాలు ఇతర దేశాల పిల్లలకు కూడా అంతేకాలంగా ఉన్నాయి గదా. అటువంటపుడు ఆ పిల్లలు చేయవలసిందేమిటి? వారు తమలో తాము ఏకమై, చీమల కుయుక్తుల నుంచి బయటపడే ప్రయత్నాలు తగినన్ని గతంలో జరిగియి. ఇపుడు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని వేర్వేరు చోట్ల. ఆ ప్రయత్నాలు కొన్ని నెరవేరుతున్నాయి కూడా. అట్లా ప్రయత్నించనపుడు తమ అనుభవాలకు, వివేకానికి అర్థమే ఉండదు. అందువల్ల, భారత్, పాకిస్తాన్, చైనాలు కలిసికట్టుగా ప్రయత్నించి ఈ గండు చీమల బారి నుంచి బయట పడటం మంచిదవుతుంది. ప్రయత్నిస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు.

టంకశాల అశోక్

దూరదృష్టి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News