ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా పైచేయి సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. దీంతో భారత్ ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకే పెవిలియన్ చేరిన భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. అతనికి మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ అండగా నిలిచాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యశస్వి కాస్త దూకుడుగా ఆడగా రాహుల్ డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు.
ఆస్ట్రేలియా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్ తీయడంలో మాత్రం విఫలమయ్యారు. స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, లియాన్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉన్నా ఆస్ట్రేలియాకు ఫలితం లేకుండా పోయింది. రాహుల్, యశస్విలు అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను సురక్షిత స్థితికి చేర్చారు. యశస్వి తన మార్క్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచేందుకు ప్రయత్నించాడు. అతనికి రాహుల్ పూర్తి సహకారం అందించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇద్దరు తొలి వికెట్‌కు అభేద్యంగా 172 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన యశస్వి 193 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 90 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. రాహుల్ 153 బంతుల్లో 4 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
కొద్ది సేపట్లోనే..
అంతకుముందు 67/7 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. ఓవర్‌నైట్ బ్యాటర్ అలెక్స్ కారె కిందటి స్కోరు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి ఔటయ్యాడు. అతన్ని కెప్టెన్ బుమ్రా వెనక్కి పంపాడు. నాథన్ లియాన్ ఐదు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. హాజిల్‌వుడ్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన మిఛెల్ స్టార్క్ 112 బంతుల్లో రెండు ఫోర్లతో 26 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 104 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో బుమ్రా 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణాకు మూడు, సిరాజ్‌కు రెండు వికెట్లు లభించాయి. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది.