Friday, March 29, 2024

సమరానికి సై

- Advertisement -
- Advertisement -

India vs Australia

 

ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు ముంబైలో తొలి వన్డే

ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు అసలైన పరీక్ష ఇప్పుడూ ఎదురుకానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బలమైన ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ముంబై వేదికగా మంగళవారం రెండు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. బలబలాల్లో ఇటు భారత్, అటు ఆస్ట్రేలియా దాదాపు సమంగా ఉన్నాయనే చెప్పాలి. అయితే సొంత గడ్డపై సిరీస్ నేపథ్యంలో టీమిండియాది కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయినా ఎటువంటి జట్టునైన ఓడించే సత్తా కలిగిన ఆస్ట్రేలియాతో పోరు అనుకున్నంత తేలిక కాదనే విషయాన్ని విరాట్ కోహ్లి సేన గుర్తుంచుకుంటే మంచింది. ఏమాత్రం నిర్లక్షం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

రోహిత్ శర్మ జట్టులో చేరడం, శిఖర్ ధావన్‌ను అందుకోవడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తదితరులతో టీమిండియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, మహ్మద్ షమి, సైని, దూబే, ఠాకూర్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతోపాటు చాహల్, జడేజా, కుల్దీప్ వంటి మ్యాచ్ విన్నర్ స్పిన్నర్లు కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక, ఆస్ట్రేలియాలో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ అరోన్ ఫించ్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, యువ సంచలనం మార్నస్ లబూషేన్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కమిన్స్, స్టార్క్, హాజిలవుడ్, రిచర్డ్‌సన్, అష్టన్ అగర్, ఆడమ్‌జంపాలతో బౌలింగ్ కూడా బలోపేతంగా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులకు కొదవలేదు. దీంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పక తప్పదు.

ధావన్‌కు పరీక్ష
కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్ సవాలుగా తయారైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ధావన్‌కు గాయాలు సమస్యగా మారాయి. అంతేగాక పేలవమైన ఫామ్‌తో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ధావన్ సత్తాకు పరీక్షగా తయారైంది. లోకేశ్ రాహుల్ ఓపెనర్‌గా మెరుగ్గా రాణించడంతో ధావన్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ధావన్ ఎలా ఆడుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

మరో ఓపెనర్ రోహిత్ శర్మపై కూడా అందరి దృష్టి నెలకొంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌కు రోహిత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. విశ్రాంతి అనంతరం రోహిత్ ఈ సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమయ్యాడు. కొంతకాలంగా భీకర ఫామ్‌లో కొనసాగుతున్న రోహిత్ ఈసారి కూడా అదే జోరును కనబరిచేందుకు తహతహలాడుతున్నాడు. ఫార్మాట్ ఏదైన పరుగుల వరద పారించడం రోహిత్ అలవాటుగా చేసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై అతను ఎలా ఆడుతాడనేది ఆసక్తిగా తయారైంది. అగ్రశ్రేణి బౌలర్లతో కూడిన కంగారూలను రోహిత్ ఎలా ఎదుర్కొంటాడో చూడాల్సిందే.

అందరి కళ్లు కోహ్లిపైనే
ఇక, సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఫార్మాట్ ఏదైన పరుగుల వర్షం కురిపించడం కోహ్లికి పరిపాటిగా మారింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ కోహ్లి నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు పటిష్టమైన ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో కూడా కోహ్లి జట్టుకు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే భారత్‌కు తిరుగుండదు. అతను చెలరేగితే ఎంత పెద్ద లక్ష్యాన్నైన అలవోకగా ఛేదించడం ఖాయం. అంతేగాక ముందుగా బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడం కూడా తథ్యం. కోహ్లి కూడా భారీ స్కోర్లపై కన్నేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు.

ఇదే మంచి ఛాన్స్
మరోవైపు యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శివమ్ దూబే, మనీష్‌పాండే, శ్రేయస్ అయ్యర్ తదితరులకు కూడా సిరీస్ చాలా కీలకమనే చెప్పాలి. బలమైన ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రదర్శన కనబరిస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత యువ ఆటగాళ్లపై ఎంతైన ఉంది. లంకతో జరిగిన టి20 సిరీస్‌లో అయ్యర్ ఆడిన రెండు మ్యాచుల్లో కూడా విఫలమయ్యాడు. ఇది కాస్త ఆందోళన కలిగించే పరిణామమే. ఈ సిరీస్‌లోనైన సత్తా చాటాల్సిన అవసరం అయ్యర్‌పై నెలకొంది. రిషబ్ పంత్‌కు కూడా సిరీస సవాలుగా తయారైంది.

వరుస అవకాశాలు లభిస్తున్నా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో పంత్ విఫలమవుతున్నాడు. ఇప్పటికే పంత్‌కు ఎన్నో ఛాన్స్‌లు దక్కాయి. అయితే ఈసారి విఫలమైతే మాత్రం రానున్న రోజుల్లో జట్టులో స్థానాన్ని కాపాడు కోవడం క్లిష్టంగా మారడం ఖాయం. మనీష్ పాండే, కేదార్ జాదవ్, జడేజా, దూబేలు కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే జట్టులో స్థానం ప్రశ్నార్థకమే. ఇలాంటి పరిస్థితుల్లో యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ సవాలు వంటిదేనని చెప్పక తప్పదు.

బౌలింగే బలం
బ్యాటింగ్‌తో పోల్చితే బౌలింగ్‌లో టీమిండియా మరింత బలోపేతంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు జట్టులో కొదవలేదు. బుమ్రా, షమి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక శివమ్ దూబే, షైని, ఠాకూర్ వంటి యువ ఫాస్ట్ బౌలర్లు కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ఏ ఇద్దరూ రాణించినా భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. దీంతో పాటు చాహల్, కుల్దీప్, జడేజాల రూపంలో అగ్రశ్రేణి స్పిన్నర్లు ఉన్నారు. దీంతో భారత్ సిరీస్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.

తక్కువ అంచన వేయలేం
కాగా, పర్యాటక ఆస్ట్రేలియా జట్టును కూడా తక్కువ అంచన వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా కనిపిస్తోంది. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే సత్తా కంగారూలకు ఉంది. ఒక మాటలో చెప్పాలంటే టీమిండియాతో పోల్చితే ఆస్ట్రేలియా కాస్త బలంగా ఉందని చెప్పక తప్పదు. వార్నర్, లబూషేన్, స్మిత్, ఫించ్, అలెక్స్ కారే, డి ఆర్సి షార్ట్, హాండ్స్‌కొంబ్ వంటి విధ్వంసక ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు అందుబాటులో ఉన్నారు. కొంతకాలంగా ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనంగా మారిన లబూషేన్ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతనిపై అందరి దృష్టి నిలిచింది. ఇప్పటికే టెస్టు క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన లబూషేన్ వన్డేల్లోనూ సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. వార్నర్, కెప్టెన్ ఫించ్, స్మిత్‌లు కూడా భారీ స్కోర్లపై కన్నేశారు. అంతేగాక కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్, అగర్, జంపా తదితరులతో ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. దీంతో భారత్‌కు సిరీస్‌లో గట్టి తప్పదని చెప్పాలి.

India vs Australia odi series
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News