Tuesday, April 30, 2024

సమరోత్సాహంతో భారత్

- Advertisement -
- Advertisement -

లక్నో: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే ఐదు విజయాలతో అదరగొట్టిన టీమిండియా మరో గెలుపుపై కన్నేసింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక దాంట్లో మాత్రమే విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచిన ఇంగ్లండ్ ఇతర మ్యాచుల్లో అవమానకర రీతిలో పరాజయాలను మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేలవమైన ప్రదర్శన ఇంగ్లండ్‌కు ప్రతికూలంగా మారింది.

బ్యాటింగ్‌లో బాగానే ఉన్నా బౌలింగ్ వైఫల్యాలు జట్టును వెంటాడుతున్నాయి. కెప్టెన్ జోస్ బట్లర్ జట్టును ముందుండి నడిపించడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. బెన్‌స్టోక్స్ చేరినా ఫలితం లేకుండా పోతోంది. అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్, శ్రీలంక వంటి బలహీన జట్ల చేతుల్లోనూ ఇంగ్లండ్ పరాజయాలను చవిచూడడం గమనార్హం. ఇక భారత్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి పెద్ద జట్లను ఓడించి జోరుమీదుంది. అంతేగాక అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లను కూడా టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లు జోరుమీదుండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. గిల్, రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షమి, సిరాజ్, బుమ్రా, జడేజా, కుల్దీప్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీనికి తోడు సొంత గడ్డపై ప్రపంచకప్ జరుగుతుండడం భారత్‌కు మరింత సానుకూల పరిణామంగా మారింది.

ఇంగ్లండ్‌ను కూడా ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఇంగ్లండ్ కూడా భారత్‌ను ఓడించడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని భావిస్తోంది. అయితే వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న భారత్‌ను ఓడించడంఇంగ్లండ్‌కు అనుకున్నంత తేలికేం కాదనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే అసాధారణ ఆటను కనబరచాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించాలి. అప్పుడే గెలుపు అవకాశాలు ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News