ముంబై: ఊహించినట్టే జరిగింది. భారత్‌పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2025(Indian Premier League) వాయిదా పడింది. టోర్నమెంట్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం లక్నో వేదికగా బెంగళూరులక్నో జట్ల మధ్యజరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్‌లను కూడా నిలిపి వేస్తున్నట్టు బిసిసిఐ అధికారులు వెల్లడించారు. తిరిగి టోర్నమెంట్ ఎప్పటి నుంచి నిర్వహించాలనే దానిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేస్తామని బిసిసిఐకి చెందిన ఓ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌ను ప్రకటించింది. ఉత్తర భారత దేశంలోని పలు విమానాశ్రయాలను మూసి వేశారు.
అంతేగాక పలు నగరాల్లో బ్లాక్ అవుట్‌ట్‌ను అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో భారత సైనికులు వీరోచిత పోరాటంతో పాకిస్థాన్ దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నారు. ఒకవైపు భారత సైనికులు ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ రక్షణ కోసం సర్వం ఒడ్డుతుంటే వినోదం కోసం ఐపిఎల్‌ను నిర్వహించడం సరికాదని భావించిన బిసిసిఐ టోర్నీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, పాక్‌తో యుద్ధం నేపథ్యంలో అనేక ఫ్రాంచైజీలు ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ఐపిఎల్ పాలక మండలితో బిసిసిఐ చర్చలు సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ప్రసారకర్తలు, స్పాన్సర్ల అభిప్రాయాలను పరిగణలోకి దీసుకున్న తర్వాత టోర్నీని వాయిదా వేయాలని బిసిసిఐ నిర్ణయించింది. సాయుధ బలగాల స్థైర్యం, సన్నద్ధతపై పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ..అందరి అభిప్రాయాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని బిసిసిఐ ప్రతినిధి స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి స్థితిలో దేశానికి బిసిసిఐ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. మన సాయుధ బలగాల ధైర్యం, నిస్వార్ధ సేవకు సెల్యూట్ చేస్తున్నాం అని బిసిసిఐ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు..
ప్రస్తుతం భారత్ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని, సరిహద్దుల్లో భద్రత దళాలు ప్రాణాలకు తెగించి దేశం కోసం అసువులు బాస్తున్నారని, ఇలాంటి స్థితిలో క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించడం ఏమాత్రం సమంజసం కాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఓ వైపు దేశం యుద్ధం చేస్తుంటే..ఇలాంటి స్థితిలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం భావ్యం కాదని బిసిసిఐ వివరించింది. దేశం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని బిసిసిఐ తేల్చి చెప్పింది. అవసరమైతే ఐపిఎల్ టోర్నమెంట్‌ను పూర్తిగా రద్దు చేసేందుకు కూడా తాము సిద్ధమేనని తెలిపింది.
ఇదిలావుంటే ప్రస్తుతం ఐపిఎల్‌ను(Indian Premier League) వారం రోజుల పాటు వాయిదా వేశామని పరిస్థితులు మెరుగు పడితే టోర్నమెంట్‌ను కొనసాగిస్తామని బిసిసిఐ పేర్కొంది. కాగా, ఐపిఎల్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు మిగిలివున్నాయి. అంతేగాక రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ కూడా నిర్వహించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో సీజన్ 2025 ముగియాల్సి ఉంది. కానీ టోర్నమెంట్‌ను వారం రోజుల పాటు వాయిదా వేయడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.