Saturday, May 24, 2025

ఆకాశంలో ప్రమాదం పడిన ఇండిగో విమానం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన దేశీయ విమానం ఆకాశంలో ఉండగా భీకర తుపాను,గాలివాన, వడగళ్ల మధ్య తీవ్రమైన అల్లకల్లోలానికి గురైంది. ప్రయాణికులు ప్రాణభయంతో వణికి పోయారు. విమానం పైలెట్లు పలు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర స్థితిలో పాకిస్తాన్ వైమానిక ప్రాంతంలో ల్యాండింగ్ కు అనుమతించాలన్న అభ్యర్థనను తిరస్కరించడంతో ఆకాశంలో ఒక్క నిముషంలో 8,500అడుగుల కిందకి వేగంగా దిగిపోయింది. వైమానిక సిబ్బంది ధైర్యంగా, సురక్షితంగా శ్రీనగర్ లో విమానాన్ని దించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశంలో ప్రయాణిస్తుండగా భీకర తుపానులో చిక్కుకుంది. తర్వాత విమానం తీవ్ర అత్యవసరపరిస్థితిని ఎదుర్కొంది.పౌరవిమానయాన డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డిజిసిఏ) ప్రకటించిన వివరాల ప్రకారం విమానం వడగళ్లవానలో చిక్కుకున్న తర్వాత పైలెట్లు పలుసార్లు కాక్ పిట్ నుంచి హెచ్చరికలు జారీ చేశారు. విమానం, కీలక పరికరాలు పని చేయడంలో లోపాలు తలెత్తుతున్నాయని సూచిస్తూ, హెచ్చరికలు పంపారు.

ఒక దశలో ఫ్లైట్ 6ఇ-2142 గా నడుస్తున్న ఇండిగో ఏ321 నియో విమానం ఒక్కనిముషంలో 8,500 అడుగులు కిందకి పడిపోయింది. సాధారణంగా విమానం దిగే రేటు నిముషానికి 1500 నుంచి 3000 అడుగులు ఉంటుంది. ఒక్కసారిగా హఠాత్ గా విమానం కిందకి కుంగిపోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు పెట్టారు. అరుపులు, గోలతో విమానం దద్దరిల్లింది. కొన్ని నిముషాల సేపు నరకం అనుభవించారు.విమానంలో పార్లమెంటు సభ్యులతో సహా 220 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానం ఆకాశంలో 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, భారత – పాక్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న పఠాన్ కోట్ సమీపంలో ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. ఆ సమయంలో విమానం పైలెట్లు రాబోయే ప్రమాదాన్ని, తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని గుర్తించి భారత వైమానిక దళం నార్తర్న్ కంట్రోల్ కు అత్యవసర అభ్యర్థన చేసింది. దీనివల్ల విమానం పాకిస్తాన్ గగనతలంలోకి క్లుప్తంగా ప్రవేశించి ఉండేది. కానీ ఆ అభ్యర్థన తిరస్కరించబడినట్లు విమాన సిబ్బంది డిజిసిఏకు సమర్పించిన నివేదికలో తెలిపింది.

వేగంగా ఉరుములు, మెరుపులతో తుఫానులో చిక్కిన విమానంతో పైలెట్లు మరో గత్యంతరం లేకపోవడంతో మొదట ఢిల్లీకి తిరిగి వెళ్లాలని భావించారు. వడగళ్లకు విమానం దెబ్బతింది. అప్పటికే విమానాన్ని భారీ మేఘాలు సమీపిస్తుండడంతో తక్షణం నిర్ణయం తీసుకుని, ప్రతికూల వాతావరణంలో కూడా ధైర్యంగా విమాన్ని శ్రీనగర్ వైపు మళ్లించాలని నిర్ణయించారు. విమానం యాంగిల్ ఆఫ్ అటాక్ లోపానికి గురైంది. ప్రత్యామ్నాయ రక్షణకోల్పోయింది. దీంతో విమానం తీవ్రమైన అప్ డ్రాప్ట్ లు, డౌన్ డ్రాఫ్ట్ లు వల్ల నిలువునా ఎగిరిపోవడంతో విమానం నియంత్రణ వ్యవస్థలు వైఫల్యానికి కారణమయ్యాయి. దీంతో వీమాన సిబ్బంది మాన్యూవల్ నియంత్రణ చేపట్టి , సురక్షితంగా శ్రీనగర్ చేర్చారని డిజిసిఏ ప్రాథమిక అంచనా నిర్థారించింది.

చావును తాకి వెనక్కి వచ్చాం
తాము చావుకు దగ్గరగా వెళ్లి తిరిగి ప్రాణాలతో బయటపడ్డామని, వణికి పోయామని టిఎంసి ప్రతినిధి సాగరికా ఘోష్ అన్నారు. ప్రయాణీకులు కేకలు వేశారు. ప్రార్థనలు చేశారు. భయాందోళనలకు గురయ్యారు. ఏమైనా తమను క్షేమంగా ప్రాణాలతో బయటకు తీసుకువచ్చిన పైలెట్ కు , విమాన సిబ్బందికి హాట్సాఫ్ అన్నారు. విమాన ప్రయాణికులు 220 మందిలో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం ఉంది.వారిలో ఎంపీలు డెరెక్ ఓబ్రియాన్, నదిముల్ హక్, మానస్ భూనియా, మమతా ఠాకూర్, పార్టీ ప్రతినిధి సాగరిక ఘోష్ ఉన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News