Saturday, September 13, 2025

మహిళా స్వయం సంఘాలకు దసరా జోష్

- Advertisement -
- Advertisement -

రానున్న దసరా పండుగకు మహిళా సంఘాల్లో జోష్ నింపేందుకు ప్రతి సభ్యురాలికి చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పంపిణీ చేసిన చీరల్లో నాణ్యత లేదని పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. తక్కువ ధర ఉన్న, ఏ మాత్రం నాణ్యత లేని చీరలను పంపిణీ చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. అదీ గుజరాత్‌లోని సూరత్ నుంచి తీసుకువచ్చి కోటి మంది మహిళలకు ఆనాటి బిఆర్‌ఎస్ సర్కార్ చీరలు పంపిణీ చేసిందనే అభియోగాలు వ్యక్తమయ్యాయి. అయితే గతంలో బతుకమ్మ చీరల పేరుతో తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా చౌకధరల దుకాణాల ద్వారా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇప్పుడు ఇందిరమ్మ చీరల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జి) ద్వారా ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి అందించనుంది. కాగా నాణ్యత విషయంలో రాజీ లేకుండా, ఎటువంటి ఆరోపణలకు అవకాశం లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ ప్రాంతంలోని పలు గ్రామాల్లో మరమగ్గాలనపై నాణ్యమైన చీరలను తయారు చేయిస్తోంది.

సుమారు 65 లక్షల చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం -టెస్కోకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63.86 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు టెస్కో సంస్థ ఆధ్వర్యంలో నాలుగున్నర కోట్ల మీటర్ల బట్టను తయారు చేస్తోంది. ఈ బట్ట తయారీ ద్వారా చీరల తయారీని ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ అంశంపై టెస్కో జనరల్ మేనేజర్ ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆర్డర్‌ను గడువులోగా పూర్తి చేసే లక్షంతో పని చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆమోదించి పంపిన డిజైన్లు, రంగుల్లో చీరలను తయారు చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర రావు, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ఎంపిక చేసిన డిజైన్‌లతో చీరలను తయారు చేశారు. ఈ చీరల పంపిణీకి దాదాపుగా రూ.480 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ నెల 28న ఎల్‌బి స్టేడియంలో జరిగే బతుకమ్మ ఉత్సవాలకు పెద్ద ఎత్తున మహిళా సంఘాల సభ్యులను సమీకరించి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించింది.

Also Read: దేశానికి అన్నం పెట్టే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తులా…?

సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో చీరల పంపిణీ
మహిళా సంఘాలకు నాయకత్వం వహించే సెర్ప్, మెప్మా సంస్థలు ఈ చీరలను పంపిణీ చేసేందుకు లబ్దిదారుల జాబితాలను తయారు చేసింది. టెస్కో సంస్థ తయారు చేసిన చీరలను ఈ రెండు సంస్థలకు ప్రభుత్వం ద్వారా అప్పగిస్తారు. వాటిని సంఘాల వారీగా అందరికి పంపిణీ చేస్తారు. ఒక్కో మహిళా సంఘంలో పది మంది సభ్యులు ఉంటారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 63.86 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. వీరందరికి వారి మహిళా సంఘం గుర్తింపు కార్డులు చూసి సంఘం ద్వారా చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో సంఘం సభ్యురాలికి ఒక్కో చీర చొప్పున ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. ఈ మేరకు ఈ నెల 23 నుంచి చీరల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రులు అన్ని జిల్లాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ తేదీపై ఇంకా స్పష్టత రాలేదని అధికార వర్గాల సమాచారం. ఈ నెల 23 నుంచి కాకుండా 30 నుంచి విజయదశమి నాటికి చీరల పంపిణీ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే చీరలను లైట్ బ్లూ కలర్, డార్క్ బ్లూ అంచుతో తయారు చేశారు.

బ్లూ కలర్‌తో ఉన్న ఈ చీరల మీద తెల్లని రంగు పువ్వులను ముద్రించారు. చీర, జాకెట్‌తో కలిపి 6.3 మీటర్లు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే 50 లక్షల చీరల తయారీ పూర్తయ్యింది. మరో 10 లక్షల చీరల ఉత్పత్తి కొనసాగుతోంది. ఒక్కో చీర తయారీకి రూ.800 వరకు ఖర్చు అవుతుందని ఆయా వర్గాల సమాచారం. చీరల సేకరణ కోసం ఈ నెల 15 వరకు తొలుత గడువు ఉండగా దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. తయారైన చీరలను టెస్కో అధికారులు ఆయా జిల్లాలకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మేరకు పంపిస్తున్నారు. అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చీరలు ఆయా సెర్ప్, మెప్మా కార్యాలయాలకు చేరకున్నాయని చెబుతున్నారు. మిగిలిన జిల్లాలు, పట్టణాలు, నగరాలకు ఈ నెల 23 నాటికి చేరుకుంటాయి. ఇదిలావుంటే నేతన్నలకు ఈ పథకం ద్వారా వేతన రూపంలో మంచి ఆదాయం వస్తోంది. ఇది వరకు నెలకు పది వేలకు మించి రాని ఆదాయం గత ఆరు నెలల నుంచి చీరలను తయారు చేసే పనిలో నిమగ్నమైన నేత కార్మికులకు నెలకు రూ.18 వేల నుంచి 20 వేల వరకు అందుతోందని టెస్కో వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News