Tuesday, April 30, 2024

ఇండోర్..ఔట్ డోర్ క్రీడా ప్రాంగణాల నిర్మాణంతో క్రీడాకారులకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లోనూ నిర్మిస్తున్న సర్కార్
సిరిసిల్ల..బాన్సువాడల్లో ఇప్పటికే నిర్మాణం
తాజాగా మహబూబ్‌నగర్.. వైరాలోనూ ఏర్పాటు

మన తెలంగాణ / హైదరాబాద్ : క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం తీసుకువచ్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు జిల్లాల్లో నూతనంగా క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు రాజధాని హైదరాబాద్‌లోనే భారీ స్టేడియంలు ఉండగా..ఇక జిల్లాల్లోనూ వాటిని మరిపించేలా క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తోంది. మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశంతో జిల్లాల బాట పట్టిన క్రీడాశాఖ సిరిసిల్లలో అబ్బుర పడే స్థాయిలో క్రీడా ప్రాంగణాలను నిర్మించింది. ఈ స్టేడియం ప్రారంభోత్సవానికి వెళ్లిన పలువురు మంత్రులు , ఎంఎల్‌ఏలు తమ తమ నియోజక వర్గాల్లోనూ ఈ స్థాయిలో ఉండేలా కావాలని కోరడంతో సిఎం కెసిఆర్ అన్ని జిల్లాల్లోనూ క్రీడా ప్రాంగణాలను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తన నియోజక వర్గంలో కావాలంటూ మరీ పట్టుబట్టి బాన్సువాడలో నిర్మాణం జరిగేలా చూశారు.

బాన్సువాడలోనూ అబ్బుర పడే స్థాయిలో స్టేడియం నిర్మాణం జరుగుతోంది. వీరిని ఆదర్శంగా తీసుకుంటున్న మరి కొందరు తమ తమ జిల్లాల్లో క్రీడల అభివృద్ధి, క్రీడాకారులకు అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. క్రీడల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనూ తాజాగా అద్బుతమైన ఔట్ డోర్ స్టేడియం నిర్మాణం పూర్తయి ఇటీవలే ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఖమ్మం జిల్లా వైరాలోనూ ఇండోర్ స్టేడియాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ( శాట్స్ ) ఇటీవలే నిర్మించింది. ఒక్కో క్రీడా ప్రాంగణానికి సుమారు కోట నుండి మూడు నాలుగు కోట్ల వరకు వ్యయం చేసి నిర్మిస్తుండడంతో ఆయా జిల్లాల్లోని క్రీడాకారులు సంబర పడుతున్నారు.

గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం
తెలంగాణలోని క్రీడాకారులు తమ చిన్నప్పటి నుండి గ్రామీణ ప్రాంతాల నుండి ఆడుకుని వచ్చిన వారే. ఇలాంటి వారే ఇప్పుడు ఆసియన్ గేమ్స్ వరకు ఎదిగి బంగారు పతకాలను సాధిస్తున్నారు కూడా. ఇటీవల 19వ ఆసియన్ గేమ్స్‌లోనూ షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్, అలాగే 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలోనూ రజత పతకం సాధించిన ఇషా సింగ్ గ్రామీణ క్రీడాకారిణినే అని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణప్రాంత క్రీడలకు, క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఇటీవల సిఎం కప్ క్రీడలను నిర్వహించిందని వారు గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా ఛలో మైదాన్ పేరిట మరో సారి క్రీడాశాఖ చర్యలు తీసుకుందని వారు చెబుతున్నారు.

సిఎం కెసిఆర్ ప్రోత్సాహంతోనే నూతన ప్రాంగణాలు : శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్
తమ శాట్స్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రీడా అకాడమిలకు సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రొత్సాహం కల్పిస్తోందని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత దాదాపు దశాబ్దకాలం నుండి క్రీడా అకాడమిలు, స్పోర్ట్ స్కూళ్ల పై తమ శాట్స్ శాఖ ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టిందని, దీంతో క్రీడాకారుల్లో ఉత్సాహం మరింత రెట్టించిందని ఈ సందర్బంగా ఆయన ‘మన తెలంగాణ’కు తెలిపారు. క్రీడా పాఠశాలలు, అకాడమీల నిర్వహణపైనా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ప్రతి ఏటా ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలతో అటు క్రీడా ప్రాంగణాల నిర్మాణం, ఇటు క్రీడాకారుల్లో పతకాలు తేవాలన్న లక్షం ఏక కాలంలో నెరవేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Court

Stadium

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News