Friday, March 29, 2024

ఒడిశాకు ఎక్సైజ్ బృందాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రదారుడైన బాలరాజ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు దీనిపై విచారణను వేగవంతం చేశారు. నకిలీ మద్యాన్ని ఒడిశాతో పాటు బెంగళూరు నుంచి తెచ్చినట్టు బాలరాజ్‌గౌడ్ అంగీకరించారని, ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖకు చెందిన మూడు బృందాలు ఆయా రాష్ట్రాలకు దర్యాప్తు నిమిత్తం వెళ్లినట్టుగా తెలిసింది. డిప్యూటీ కమిషనర్ రంగారెడ్డి, సరూర్‌నగర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్‌ల నేతృత్వంలోని మూడు టీంలు నకిలీ మద్యంపై విచారణ చేపట్టాయి. సుమారు కోటి రూపాయలకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేయగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్, చౌటుప్పల్, దేవల్లమ్మ, నాగారం ఏరియాలో నకిలీ మద్యం డంప్‌ను గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే దీనికి సూత్రదారులైన బింగి బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డిలుగా గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు అందులో బింగి బాలరాజు గౌడ్‌ను ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం కొండల్ రెడ్డి పరారీలో ఉన్నట్టు ఎక్సైజ్ పోలీసులు పేర్కొంటున్నారు.రెండు, మూడు సంవత్సరాలుగా ఈ దందా ఈ దందా రెండు, మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నట్టు అధికారుల విచారణలో తేలింది. ఇన్ని రోజులుగా హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ ముఖ్యమైన ప్రాంతాల్లోని బెల్టుషాపులతో పాటు సుమరుగా 40 మద్యం షాపులకు ఈ నకిలీ మద్యాన్ని బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డిలు సరఫరా చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డికి ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 20పైగా వైన్స్ షాపులున్నట్టు సమాచారం. అయితే గతంలోనూ బింగి బాలరాజు గౌడ్ నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డారు.
రూ.50 నుంచి రూ.100 కోట్ల ఆదాయానికి గండి
అయితే మద్యం ప్రియులు ఇది నకిలీ మద్యమని తెలియక ఫంక్షన్లకు, దావత్‌లకు హాజరైన వారితో పాటు మొన్న జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో ఇదే మందు తాగామని మందుబాబులు వాపోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అసలు మద్యం కన్నా ఈ నకిలీ మద్యం అధికంగా అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీనివల్ల సుమారు రూ.50 నుంచి రూ.100 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు గండిపడ్డట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో మరిన్ని మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించి వివరాలను రాబట్టాలని ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్, చౌటుప్పల్, దేవలమ్మ నాగారం ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం డంపుల నుంచి ఎక్సైజ్ అధికారులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకోగా రెండు, మూడు రోజుల్లో నకిలీ మద్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News