Tuesday, July 16, 2024

ఇషాన్ కిషన్ డబుల్ ధమాకా.. చిత్తుగా ఓడిన బంగ్లా

- Advertisement -
- Advertisement -

ఇషాన్ డబుల్ ధమాకా
కోహ్లి సెంచరీ, చివరి వన్డేలో టీమిండియా రికార్డు విజయం
చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 227 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. యువ సంచలనం ఇషాన్ కిషన్ (210) డబుల్ సెంచరీకి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (113) సూపర్ శతకం తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 34 ఓవర్లలో కేవలం 182 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆతిథ్య బంగ్లాదేశ్ 21 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఇషాన్, కోహ్లి జోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లిలు తమపై వేసుకున్నారు. కోహ్లి కాస్త సమన్వయంతో ఆడగా ఇషాన్ దూకుడును ప్రదర్శించాడు. ఇద్దరు అసాధారణ బ్యాటింగ్‌తో అలరించారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. మరోవైపు ఇషాన్ విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ ఇషాన్‌కు అండగా నిలిచాడు. ఇదే క్రమంలో ఇషాన్ అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ వెనుదిరిగి చూడలేదు. వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన ఇషాన్ 85 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ఆ వెంటనే కోహ్లి కూడా అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

వీర విధ్వంసం
శతకం తర్వాత ఇషాన్ కిషన్ మరింత చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించాడు. అతని దెబ్బకు బంగ్లాదేశ్ బౌలర్లు విలవిల్లాడి పోయారు. అతని జోరుకు స్కోరు వేగంగా పరిగెత్తింది. బౌలర్ ఎవరైనా లెక్కచేయకుండా ఆడిన ఇషాన్ 126 బంతుల్లోనే 23 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తొలి శతకం 85 బంతుల్లో రాగా, తర్వాతి సెంచరీ 41 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. ఈ క్రమంలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా ఇషాన్ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇదే సమయంలో గతంలో వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్‌గేల్ పేరిట ఉన్న వేగవంతమైన డబుల్ సెంచరీ మార్క్‌ను ఇషాన్ తిరగరాశాడు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలు వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించారు. తాజాగా ఇషాన్ కిషన్ ఈ దిగ్గజాల సరసన నిలిచాడు. ఇక కోహ్లితో కలిసి ఇషాన్ కిషన్ రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 290 పరుగులు జోడించాడు.

కోహ్లి శతకం
మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కోహ్లి 91 బంతుల్లోనే 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. కాగా, శ్రేయస్ అయ్యర్ (3), కెప్టెన్ కెఎల్ రాహుల్ (8), విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (37), అక్షర్ పటేల్ (20) తమవంతు పాత్ర పోషించడంతో టీమిండియా స్కోరు 409 పరుగులకు చేరింది.

తక్కువ స్కోరుకే పరిమితం
తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. షకిబ్ అల్ హసన్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతావారిలో కెప్టెన్ లిటన్ దాస్ (29), యాసిర్ అలీ (25), మహ్మదుల్లా (20) మాత్రమే కాస్త రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ మూడు, అక్షర్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో బంగ్లా ఇన్నింగ్స్ 182 పరుగుల వద్దే ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News