Tuesday, October 15, 2024

మండుతున్న మధ్యధర

- Advertisement -
- Advertisement -

లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం జరిపిన భీకర దాడులలో కనీసం 51 మంది మృతి చెందారు. 223 మంది వరకూ గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ల ఏరవేత, వారి స్థావరాల నిర్మూలనకు ఇజ్రాయెల్ ప్రతిన వహించింది.దీనితో గడిచిన రెండు రోజులలో ఇజ్రాయెల్ దాడులలో మొత్తం మృతుల సంఖ్య ఇప్పుడు 564కు చేరింది. 1800 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ తమ ప్రకటనలో తెలిపింది. గాయపడ్డ వారు, మృతులలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. పరిస్థితి భీకరంగా మారిందని, ఆసుపత్రులలో హృదయ విదారక పరిస్థితులు ఉన్నాయని ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియద్ వార్తా సంస్థలకు తెలిపారు. 2006లో ఇజ్రాయెల్ , హెజ్‌బొల్లా మధ్య నెలరోజుల పాటు సాగిన సమరం తరువాత ఇప్పుడు ఈ వారం ఘర్షణ అత్యంత భయానకం అయింది.

ముందుగా హెజ్‌బొల్లా బీకర క్షిపణి దాడి
ఇజ్రాయెల్ దాడులకు ముందే బుధవారం హెజ్‌బొల్లా దళాలు తమ స్థావరాల నుంచి ఇజ్రాయెల్ భూతలం వైపు శక్తివంతమైన రాకెట్లను ప్రయోగించింది. వీటిలో ఓ క్షిపణి కూడా ఉంది. టెల్ అవీవ్ లక్షంగా చేసుకుని ఈ మిస్సైల్ దాడి జరిగిందని నిర్థారించారు. ఇజ్రాయెల్ రాజధానినే టార్గెట్ చేసుకుని హెజ్‌బొల్లా ఇప్పుడు అత్యంత వ్యూహాత్మక దాడికి దిగడంతో దీని పర్యవసానాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం అయింది. అనుకున్నట్లుగానే ఇజ్రాయెల్ నుంచి కూడా లెబనాన్ పై దాడులు ఆరంభం అయ్యాయి. పలు చోట్ల పౌర ప్రాంతాలలో ఇజ్రాయెల్ సేనలు తమ అత్యంత అధునాతన వైమానిక విమానాలతో బాంబుల వర్షం కురిపించాయి. క్రమేపీ ఉద్రిక్తతలు చెలరేగుతూ ఉండటంతో ఇక తమ అదనపు బలగాలను కూడా లెబనాన్ లోని హెజ్‌బొల్లా దళాల ఏరివేతకు రంగంలోకి దింపుతామని టెల్ అవీవ్ వర్గాలు ప్రకటించాయి. దీనితో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా చేయి దాటిపోనుందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. టెల్ అవీవ్ వైపు దూసుకువచ్చిన సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్‌ను తమ బలగాలు ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ ప్రకటించింది.

టెల్ అవీవ్‌లో సైరన్లు..జనం పరుగులు
హెబ్‌బొల్లా మిస్సైల్ ప్రయోగం గురించి ముందు పసికట్టిన సేనలు వెంటనే ఉన్నత స్థాయిలో ఎయిర్ రైడ్ సైరన్‌లు మోగించాయి. టెల్ అవీవ్, సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతాలలో జనం భయకంపితులు అయ్యారు. క్షిపణిని ముందుగానే ఇజ్రాయెల్ దెబ్బతీయడంతో ఎక్కడా ప్రాణనష్టం , ఆస్తినష్టం వార్తలు లేవని వెల్లడైంది. తాము దక్షిణ లెబనాన్‌లోనే క్షిపణిని ప్రయోగించిన చోటునే దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఓ వైపు ఇజ్రాయెల్ గాజాస్ట్రిప్‌లో హమాస్ పూర్తి స్థాయి అంతానికి యుద్ధం సాగిస్తోంది. మరో వైపు ఇప్పుడు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాల తుదముట్టింపునకు కూడా పాల్పడటంతో లెబనాన్, గాజా స్ట్రిప్, సమీపంలోని పలు ప్రాంతాలలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రధాన శక్తుల మధ్య ప్రచ్ఛన్న ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

మొస్సాద్ కార్యాలయం టార్గెట్‌గా హెజ్‌బొల్లా మిస్సైల్
తాము టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ వేగు సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపై దాడికి సంకల్పించినట్లు హెజ్‌బొల్లా తెలిపింది. ఈ క్రమంలోనే తాము ఖ్వాదర్ 1 ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా తెలిపింది. దీనితో ఆ స్థావరానికి నష్టం జరిగి ఉంటుందని తెలిపారు. అయితే తాము ఈక్షిపణిని ముందే దెబ్బతీశామని ఇజ్రాయెల్ తెలిపింది. కాగా తాము లెబనాన్‌లోని నిర్ణీత లక్షాలను వైమానిక దాడులతో దెబ్బతీస్తామని వెల్లడించారు. భూతల దాడుల వివరాలను పొందుపర్చలేదు. దీనికి అవసరం అయిన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

లెబనాన్‌లో దెబ్బతిన్న కుటుంబాలు , వీధుల్లోకి జనం
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులతో పలు మారుమూల ప్రాంతాలలో జనం పరిస్థితి అగమ్యగోచరం అయింది. దూర ప్రాంతాల నుంచి జనం కొద్దిగా సురక్షితంగా ఉన్న బీరూట్‌కు కుటుంబాలుగా తరలివస్తున్నారు. కొందరు తీర ప్రాంత నగరం సైడాన్ ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. వారు పలు చోట్ల స్కూళ్లలో ఆశ్రయం పొందుతున్నారు. కార్లలో, పార్క్‌లలో బీచ్‌ల వెంబడి , కొద్దిగా భద్రంగా ఉందనుకుంటున్న చోట్లల్లా జనం బెంబేలెత్తి గడుపుతూ ఉన్న దృశ్యాలు కన్పిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

రెండురోజుల్లో లక్ష మంది నిర్వాసితులు
గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులతో దాదాపు లక్ష మంది వరకూ లెబనానీయులు నిర్వాసితులు అయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి తెలిపింది. కాగా ఏడాది క్రితం హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య సమరం తీవ్రతరం అయిన నాటి నుంచి ఇప్పటివరకూ రెండులక్షల మంది వరకూ జనం ఇళ్లూ వాకిళ్లూ కోల్పోయి ,వీధుల్లో గడపాల్సి వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News