Friday, July 11, 2025

మాదిగలు మహారాజులు, జాంబవంతుని వారసులు

- Advertisement -
- Advertisement -

హిందు పురాణాలలోని సంకల్ప మంత్రంలో ‘జంబుద్వీపే భరతవర్షే భరతఖండే పదాలు ఉచ్చరింస్తారు. వీటి ప్రకారం ఒకప్పుడు జంబుద్వీపం, అందులో భారతదేశం భాగమని అర్థమవుతుంది. మరి ఈ జంబూద్వీప భూమండలానికి తొలి మూలపురుషుడు, జాంబవ మహాచక్రవర్తి అని ‘జాంబవ ఇతిహాసం’ చెబుతున్నది. ఇది డక్కలి వారి మౌఖిక జానపద చరిత్ర. జాంబవంతుడు ఈ భూమికి ఆది దేవుడు, మహాప్రభువు, మహారాజు.

ఈ దేశాన్ని మొదట జంబూద్వీపం అనే వారని జానపద ఇతిహాసం, మౌఖిక చరిత్ర, శాస్త్రీయ పరిశోధనలు, చరిత్రకారులు, విదేశీ సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. ఈ నేలకు మొదటగా పేరు పెట్టింది మాదిగ జాతి బిడ్డని, మన ఉనికిని, గొప్పతనాన్ని చాటిచెపుతున్నాయి. నేటి మాదిగలు జాంబవంతుని వారసులు, జాంబవంతుని వారసత్వంగా వచ్చిందే ఈ మానవజాతి. అందుకే సమస్త మానవాళి గురించి జరిపే ప్రపంచ జనాభా దినోత్సవ రోజైన జులై 11 జాంబవంతుని జయంతినీ మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు. జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. ఇందులో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి.

భరతవర్షం అని పిలబడే భారతదేశం కూడా భాగమే. భారతదేశం ఈజిప్టు, అఫ్ఘానిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం వరకు వ్యాపించి ఉండేది. జంబుద్వీపానికి మొదటి పాలకుడు జాంబవంతుడు.ఆయనే భూమిపై మానవ నాగరికతను, సంస్కృతిని, విలువలను నెలకొల్పాడని చరిత్ర చెబుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని నేర్పిన గొప్ప మహనీయుడు. గణతంత్ర విలువల ద్వారా రాజ్యాన్ని పాలించిన రాజు. మనుషులకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందించిన గొప్ప దేవుడు. కుల, మత, వర్ణ భేదాలు లేకుండా మనుషుల మధ్య ప్రేమను నింపి, మానవ విలువలతో రాజ్యాన్ని ఏలాడు. స్త్రీలను గౌరవించే మాతృస్వామ్య వ్యవస్థ కేంద్రంగా జాంబవ చక్రవర్తులు రాజ్యపరిపాలన చేసేవారు.

ఆర్య బ్రాహ్మణ వలసదార్లు అధర్మ యుద్ధం ద్వారా జాంబవంతుడిని ఓడించారు. అనంతరం వారు రాసిన పురాణాలలో జాంబవంతుని చరిత్రను తలకిందులు చేశారు. మనుషులను నాలుగు వర్ణాలుగా, అనంతరం కులాలుగా విభజించారు. జాంబవంతుని వారసులైన మాదిగలను అతిశూద్రులుగా, పంచమ వర్ణంగా అట్టడుగునచేర్చారు. అనేక అవలక్షణాలు అంటుగట్టి మాదిగలను ఊరవతల జీవించే పరిస్థితికి తీసుకొచ్చారు. వీరికి విద్యను, భూమిని, ఆయుధాన్నీ, సింహాసనాన్ని అందకుండా చేశారు. ఇప్పటికీ వీరి ఇండ్లు ఊరు బయటనే ఉండడమే దీనికి సజీవ సాక్ష్యం. కడపటి (ఊరి చివర ఉండే మాదిగలు) వాడే ఈ దేశానికి మొట్టమొదటి పాలకుడు అని జ్యోతిబా ఫూలే అధ్యయనం ద్వారా చెప్పారు. దీన్ని బట్టి నేడు మాదిగలు ఈ దేశ పాలకులు అనేది రుజువు అవుతుంది. మరోవైపు సామాజిక శాస్త్ర ప్రకారం నాలుగు వర్ణాల్లో ఇప్పుడున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి, రెడ్డి, వెలుమ, కమ్మ, కరణం కులాలు శూద్రులుగానే చెబుతారు. ఇప్పటికీ ఒక కులానికి ఉన్న ఇంటి పేర్లు మరోక కులానికి కూడా ఉంటాయి. నేడు సామాజిక స్థితి మారడం వల్ల విభజన రేఖ ఏర్పడింది.

వారసత్వ జ్ఞానంతో చైతన్యం కావాలి

మాదిగలు ఒకప్పటి ఈ దేశ నిర్మాతలు, రాజులు అయి ఉండి, వారి చరిత్రను మరచిపోయి, జ్ఞానాన్ని కోల్పోయి, అన్నం కోసం బతికే హీన జీవులుగా బతుకుతున్నవి. ఈ క్రమంలో దళితశక్తి ప్రోగ్రాం ద్వారా డాక్టర్ విశారదన్ మహారాజు తొలిసారి తెలంగాణలో జాంబవంతుని చరిత్రను పరిచయం చేశారు. మాదిగలు జాంబవంతుని వారసులమని, ఈ దేశాన్ని పాలించిన మహారాజులమని చెప్పి ఆత్మనూన్యత భావాన్ని తొలగించాడు. 5 వేల కిలోమీటర్ల మహాకాళి నడక ద్వారా ప్రతి మాదిగ గూడెంలోకి వెళ్లి అక్కడ మహారాజుల కాలనీ బోర్డ్‌లు కూడా పెట్టారు. దీంతో కొన్నాళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో జాంబవంతుడు, మాదిగల వారసత్వ చరిత్ర గురించి చర్చ జరుగుతుంది. ఇప్పటిదాకా మన పూర్వికులు చెప్పులు కుట్టేవాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు అని కొన్ని సంఘాలు చెప్పుకుంటూ తిరిగాయి.

మరోవైపు నేడు మనుధర్మం స్త్రీలకు ఆంక్షలు పెట్టి, అణగదొక్కింది. బానిసత్వం, అంటరానినం, స్త్రీల వెనుకబాటు తనానికి కారణమైన ధర్మాన్ని, సంస్కృతిని ఆరాధిస్తున్నాం. కానీ మన చరిత్రను మాదిగ జాగృతి సంఘం శాస్త్రీయంగా అధ్యయనం చేసి మన పూర్వీకులు ఒకనాడు అఖండ శౌర్య పరాక్రమాలతో, జ్ఞానంతో ఈ దేశాన్ని పరిపాలించిన రాజులమని చెబుతుంది. కుల, మత, వర్ణ, భేదాలు లేని ఆ గొప్పనైన సమాజంలో ప్రజలని కన్నబిడ్డల్లా భావించేవారని మన చరిత్ర చాటిచెబుతోంది. చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడని ఆనాడు అంబేద్కర్ అన్నాడు. ఆయన జాంబవంతుని విలువలను రాజ్యాంగంలో పొందుపరిచాడు. నేడు మాదిగల ఉద్యమ లక్ష్యం దీనస్థితిలో, అజ్ఞానంలో ఉన్న శరీరాలకి అన్నం పెట్టడం, డబ్బులు ఇవ్వడం, ఓట్ల కోసం జాతిని తాకట్టు పెట్టడం కాదు, జ్ఞానం ద్వారా సంస్కరణ చేయడమే. ఇవే నిజమైన మాదిగ ఉద్యమాలు. ఈ నేపథ్యంలో మాదిగలు పూర్వీకుల చరిత్ర, సంస్కృతి, జ్ఞానం వారసత్వాన్ని తెలుసుకొని ఆత్మగౌరవంతో రాజ్యాధికారం వైపు ప్రయాణించాలి. అప్పుడే ఈ దేశంలో అంటరానితనం, అస్పృశ్యతో ఊరవతల ఉన్న మాదిగలు పాలకులవుతారు. అప్పుడే ఈ సమస్త సంపద, వనరులు అందరికీ సమానంగా పంచబడతాయి.

సంపతి రమేష్ మహారాజ్
79895 78428

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News