Monday, April 22, 2024

మాదిగల నినాదమే బలం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అన్ని ప్రధాన పార్టీలకు మాదిగ నినాదం బలాన్ని ఇస్తూ… ఊపిరి పోసేలా ఉంది. అందుకోసం రాజకీయ పార్టీలన్నీ మాదిగ నాయకత్వాన్ని దగ్గర చేర్చుకొని మాదిగల ఓటు బ్యాంకును రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. బలమైన మాదిగ నాయకత్వం కలిగిన నేతలను తమ వైపు తిప్పుకొని ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. మాదిగలపై ఉన్న ప్రేమ కంటే.. దక్షిణ భారత దేశంలో బలమైన శక్తిగా మాదిగలు ఉండడం. సామాజిక సమానత్వం కోసం జరుగుతున్న ఎస్‌సి వర్గీకరణ ఉద్యమం పుట్టింది తెలుగు రాష్ట్రంలోనే. అందుకే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో మాదిగల నినాదం అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో అందుకుంటున్నాయి.

మాదిగలకు సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇస్తూ మరిచిపోవడం. అయినా మాదిగ నాయకత్వం చెక్కుచెదరకుండా సామాజిక సమానత్వం కోసం ఎస్‌సి వర్గీకరణ ఎబిసిడి కోసం గట్టిగానే కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు, అందులో తెలంగాణ రాష్ట్రంలో బలమైన మాదిగ నాయకత్వంలో మందకృష్ణ మాదిగ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ మలివిడత ఉద్యమకారుడు, మాదిగ జెఎసి వ్యవస్థాపకులు పిడమర్తి రవి ప్రధానంగా ఉన్నారు. వీరితో పాటు అనేక మంది మిగతా నాయకత్వం ఉన్నప్పటికీ నిర్ణయాత్మకమైన శక్తిగా వీరి నాయకత్వం తెలంగాణ జిల్లాలన్నింటిలో ప్రధానంగా ఉన్నారు. బలమైన మాదిగ నాయకత్వమైన మందకృష్ణ మాదిగ మొదటి నుంచి ఎస్‌సి వర్గీకరణ కోసం నిలబడ్డారు.

ఎస్‌సి వర్గీకరణ వల్లే సామాజిక సమానత్వం సాధించవచ్చనే నినాదంతో అనేక సామాజిక అంశాలపై, అణచివేతలపై ఆయన తన బలమైన గొంతును విన్పిస్తారు. ఎస్‌సి వర్గీకరణే తన అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతున్న మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆయన సామాజిక ఉద్యమ నాయకత్వ పటిమను చూసి ఎస్‌సి వర్గీకరణ కోసం చర్యలు చేపడతామని చెప్పారు. అంతకు ముందు 2014లోనూ మోడీ అధికారంలోకి తాము వస్తే వంద రోజుల్లో ఎస్‌సి వర్గీకరణ చేస్తామని చెప్పినప్పటికీ పదేళ్లు కావస్తున్నా చేయలేదు. గత కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మాదిగల సభకు హాజరై న్యాయం చేస్తామని చెప్పి మందకృష్ణ మాదిగను తమవైపు మద్దతుగా ఉండేటట్లు చేసుకున్నారు. మోడీ మీద ఉన్న విశ్వాసంతో మందకృష్ణ మాదిగ బిజెపికి మద్దతు తెలియజేస్తూ ఎన్నికల ప్రచారంలో మద్దతును ప్రకటిస్తూ మాదిగలను బిజెపి వైపు ఉండేలా చూస్తున్నారు.

పిడమర్తి రవి సైతం మాదిగ జెఎసిని స్థాపించి మాదిగల న్యాయమైన డిమాండ్ ఎస్‌సి వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు చేస్తూ.. మాదిగల నిష్పత్తి ప్రకారం మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని తన బలమైన గొంతును విన్పిస్తున్నారు. ఈ మధ్యనే మాదిగల జోడో యాత్రతో క్షేత్ర స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి మాదిగల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్నారు. కాగా పిడమర్తి రవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ మాదిగ సామాజిక నినాదాన్ని విడవకుండా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థి ఉద్యమ నేపథ్యం, సామాజిక ఉద్యమాల్లో చురుకుగా ఉండే పిడమర్తి రవి బలమైన మాదిగ గొంతుకగా ఛలో ఢిల్లీ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. మాదిగల డిమాండ్‌తో 17 పార్లమెంటు స్థానాల్లో పర్యటనకు సిద్ధ్దమవుతున్నారు. తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా అణగారిన వర్గాల పిల్లల అక్షర జ్ఞానం కోసం కృషి చేసి గురుకులాల ద్వారా విద్యార్థుల ప్రతిభను ఎవరెస్టు శిఖరానికి చాటి చెప్పి ప్రపంచానికి తెలియజేశారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. ఆయన తెలంగాణలో రాజకీయ అధికారం కోసం తన ఐపిఎస్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీలో చేరి 2023లో తెలంగాణ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు.

మారిన రాజకీయ పరిణామాలు మరే ఇతర కారణాలో తిరిగి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలలో మాదిగ నాయకత్వం పని చేస్తున్నది. అయితే తెలంగాణలో ఏ పార్టీలోనూ మాదిగలకు ఇప్పటికీ సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదనే భావన అసంతృప్తి ఈ సామాజిక వర్గంలో స్పష్టంగా కన్పిస్తుంది. అటువంటి తరుణంలో మాదిగలందరినీ సమీకరించాల్సిన నాయకత్వశక్తి కలిగిన నాయకులను ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు ప్రధానంగా ముందు వరుసలో నిలబెడుతున్నాయి. తరతరాలుగా సామాజిక సమానత్వానికి, అటు రాజకీయ ప్రాతినిధ్యానికి దూరంగా ఉంటున్న మాదిగ సామాజిక వర్గం. ప్రధాన నాయకుల తలో దిక్కు ఉండడం లాంటి చర్యలతో ఎంతో బలమైన సామాజిక శక్తి కలిగిన మాదిగలకు రాజకీయ దిశ కనిపించకుండా పోతుంది. మాదిగల్లో ఉన్న నిబద్ధతను, పోరాట పటిమను గుర్తించి దగ్గరకు తీసుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలు.. రాజకీయ ప్రాతినిధ్యంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏదిఏమైన ఈ సారి తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో మాదిగల శక్తి నినాదాన్ని ఎత్తుకున్న రాజకీయ పార్టీల ఎత్తులకు మాదిగలు సరైన తీర్పును ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం
7893303516

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News