Sunday, December 4, 2022

ఉల్ గులాన్ వీరుడు

- Advertisement -

 

ఒక మనిషి జీవన ప్రస్థానంలో 25 ఏళ్ళు అనేవి అతి స్వల్ప కాలం! జీవితం పట్ల, సమాజం పట్ల, వ్యవస్థ, విశ్వం పట్ల నిర్దిష్టమైన అవగాహన ఏర్పడే తొలి కాలం అది… ఇది సాధారణ వ్యక్తుల విషయం! కానీ, వీరులకు 25 ఏళ్ళ కాలం నూరేళ్ళకాలపు విజయాల ప్రస్థానం. ఎంత కాలం బతికామన్నదాని కన్నా ఎంత అర్థవంతంగా బతికామన్నదే వారికి ముఖ్యం. ఇలా అత్యల్ప జీవితకాలంలోనే అత్యధిక ప్రభావాన్ని జాతి చరిత్రపై లిఖించిన ఆదివాసీ విప్లవవీరుడే బిర్సాముండా! జార్ఖండ్‌లో మొదలై జగతి అంతా విస్తరించిన ఆ ధిక్కార హెచ్చరిక పేరే బిర్సా ముండా!!‘అబువా రాజ్ ఎటెజనా, మహరాణి రాజ్ తుండుజనా’ (మహరాణి రాజ్యం అంతమవనీ, మన ఆదివాసీ స్వరాజ్యం ప్రభవించనీ) అంటూ ఎలుగెత్తి పోరాడిన సమరయోధుడు బిర్సాముండా జయంతిని (నవంబర్ 15) యావత్ దేశం ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’ గా జరుపుకోవాలని గత సంవత్సరమే ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.

ఇంతకీ ఈ బిర్సాముండా ఎవరు? కేవలం 25 సంవత్సరాల లోపు మాత్రమే బతికి చెరసాలలోనే చనిపోయిన ఈ ‘ఆదిమవాసి’ సాధించిన వీరోచిత కార్యక్రమాలేమిటి? రాంచీ లోని విమానాశ్రయానికి ‘బిర్సాముండా’ గా నామకరణం చేయటానికి, వ్యవసాయ, విశ్వవిద్యాలయాలెన్నిటికో వీరి పేరు పెట్టడానికి కారణం ఏమిటి? ఎందుకు ఎంతో మంది వీరి మీద సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు? భారత పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్లో వీరి చిత్రపటం పెట్టి తద్వారా వారి గొప్ప జీవితాన్ని యావత్ దేశానికి స్ఫూర్తి గీతంగా పంచి… ఏకైక ఆదివాసీ నాయకుడిగా ఈ సత్కారం అందుకున్నట్లుగా ప్రకటించటంతో యువత ఆనాడు ‘బిర్సా’ వెనుక దండి దండిగా కదిలినట్లు ఇప్పుడు కూడా నెటిజన్లు భారీగా సెర్చ్ చేస్తున్నారు ఈ బిర్సాముండా జీవిత విశేషాల కోసం.

మనకు తెల్సిన కొమరం భీం “జల్, జంగల్, జమీన్‌” నినాదంతో ఏ పోరాటమైన భూమి కోసం, భుక్తి కోసం, బంధనాల విముక్తి కోసం అన్నది ప్రపంచానికి ఎరుక పరిచాడు. భగత్ సింగ్ -23, సుఖదేవ్ -24, రాజ్ గురు -22, చంద్రశేఖర్ ఆజాద్ -24, జతేంద్రనాధ్ రాస్ – 24, బినయ్ బాస్ -22, కర్తార్ సింగ్ -19, దినేష్ గుప్త- 19, హేమూకలానీ – 20, ప్రపుల్లచాకి , బసతా కుమార్ బిశ్వార్, కన్నయ్యలాల్ దుత్తా వీరంతా 25 సంవత్సరాల లోపు వాళ్ళే. మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడానికి మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించిన వాళ్ళే. మేరా భారత్ మహాన్ అంటూ ఈ భూమిలో కలిసిపోయిన వాళ్ళే. అదిగో అలాంటి మరొక యువ కిశోరమే బిర్సా ముండా. 1875లో జార్ఖండ్ ఖుంతి జిల్లా డెలిహట్ లో పుట్టిన ఈ వీరుడు చిన్నతనంలో గొర్రెలు మేపాడు. దుమ్ము ధూళిలో ఆడుకున్నాడు. వేణుగానంలోనూ – గుమ్మడి ఏకతారను మీటటంలోనూ నిష్ణాతుడయ్యాడు. బ్రిటిష్ వలసవాదం పైన తిరుగుబాటు జెండా ఎగురేసి తీవ్ర స్థాయిలో వారి దమననీతిని ఎండగట్టటంలో భీకర పోరాటం చేశాడు.

భూ ఆక్రమణల పోరాటం -1893 -94 మధ్య కాలంలో బంజరు భూములన్నిటినీ రక్షిత వనాలుగా ప్రకటించిన బ్రిటిష్ ప్రభుత్వం స్వేచ్ఛగా విహరిస్తూ పోడు భూముల్ని స్వచ్ఛందంగా సాగు చేస్తున్న ఆదివాసీల మీద తమ ఆధిపత్యాన్ని చాటుకోవటం కోసం అక్కడ కూడా భూస్వాముల్ని పెట్టింది. ఈ దళారీ వ్యవస్థను ఎదుర్కోవటానికి ఎందరో వీరులు కదలినట్టుగానే ‘బిర్సాముండా’ కూడా ముందుకు ఉరికాడు. గిరిపుత్రులు, వనపుత్రులైన తమ స్వేచ్ఛ మీద ఈ పెత్తందారీతనమేమిటని నిలదీశాడు. తనను తాను సంప్రదాయ అటవీ ప్రచార రక్షకుడిగా చెప్పుకుంటూ ‘దర్తీ ఆబా’ గా మారిపోయాడు. మట్టి బిడ్డగా ఈ ఆదివాసీల నేలను రక్షించే రక్షకుడిగా, యోగి గా, దేవుడిగా అవతరించాడని ఆదివాసీలెందరో అనుకునేంతగా ప్రజలకు అండగా నిలబడ్డాడు.

మతాంతరీకరణపై పోరాటం బిర్సాముండా సాల్గా గ్రామంలో చదివినప్పుడు గురువు ‘జైపాల్ నాగ్’ ప్రభావం ఎక్కువగా పడింది. బూర్ఖు మిషన్ స్కూల్ లోకి మారాక క్రైస్తవాన్ని తీసుకుని మరో మిషనరీ పాఠశాలలోకి మారి, పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. బిర్సా డేవిడ్‌గా బిర్సా దౌర్ గా ‘బిర్సా’ తన పేరు మార్చుకున్నాడు కూడా. కాలక్రమేణా ఈ మత మార్పిడులు తమ మూలాలను ఎంతగా నాశనం చేస్తున్నాయో గ్రహించి ఆ విధానాన్ని విపరీతంగా విమర్శిస్తూ తీవ్రంగా వ్యతిరేకించాడు. 1899 క్రిస్మస్ రోజు 7,000 మంది స్త్రీ పురుషులతో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.

‘ఉల్ గులాన్’ పేరు పలికితే ఇప్పటికీ దేశ సంస్కరణవాదులు లేచి నిలబడి సెల్యూట్ చేస్తారు ‘బిర్సా’ ఎంత మేధావి అంటే “ఆదివాసులు మతం మారి క్రిస్టియన్లుగా స్థిరపడ్డ వారి మీద దాడులు చేస్తున్నాడు బిర్సాముండా అని వక్రభాష్యాన్ని ప్రచారం చేస్తున్న బ్రిటిష్ వాళ్ళ కుయుక్తుల్ని ధ్వంసం చేస్తూ “మన వాళ్ళ మీద కాదు మన పోరాటం మన సంస్కృతీ మూలాల్ని నాశనం చేస్తున్న విదేశీ మతవాదుల మీదనే మన దాడి” అని స్పష్టంగా పిలుపునిచ్చాడు.
ఎన్నోసార్లు వందల మందితో బ్రిటిష్ వాళ్ళు దాడి చేసినా దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. “బిర్సాయిత్‌” అనే సిద్ధాంతాన్ని విపరీతంగా ప్రచారం చేశాడు ముండా. దానికి ఎంతో మంది యువత ఆకర్షితులై బిర్సాకి అండగా నిలబడ్డారు.

చివరికి ‘బిర్సా’ తలకు అప్పట్లోనే అంటే 1899లో 500 రూపాయలు నజరానాగా ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఒక ఆదివాసీ.. అతి తక్కువ జనాభా వున్న జార్ఖండ్ నివాసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిద్ర పట్టకుండా చేశాడు.కౌలు రైతులకు శిస్తులు కట్టాడు రహస్య సమావేశాలు ఏర్పాటు చేశాడు. చివరికి బిర్సాదళంలో 460 మంది అనుచరులను పట్టుకుని ఎంతోమందికి యావజ్జీవ జైలు శిక్షను, ఒకరికి ఉరి శిక్షను, 14 ఏళ్ళ జైలు శిక్షను కొందరికి విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. 6 మంది మీద తీవ్ర నేరాలు మోపుతూ జైల్లో పెట్టింది. ఆ 6 గురిలో ముఖ్యమైన వ్యక్తిగా వున్న ‘బిర్సా’ జైల్లోనే చనిపోయాడు. తీవ్ర ఉద్యమంగా ప్రజల ఆగ్రహం మారకూడదని బ్రిటిష్ వాళ్ళు బిర్సా మరణానంతరం చోటా నాగపూర్‌లో భూమి కౌలు చట్టాన్ని రూపొందించి గిరిజనుల ఆదివాసీల భూములు ఎవరూ బయటవారు కొనకూడదని శాసనం చేయాల్సి వచ్చింది ఇది బిర్సా సాధించిన ఘన విజయంగా చెప్పుకోవాలి.

మేధావులెందరినో కదిలించిన ఈ వీరుని కథను ఇతివృత్తంగా తీసుకుని 5, 6 సినిమాలు వచ్చాయి. – పరాంజిత్ కూడా త్వరలో సినిమా తీయబోతున్నారని వినికిడి – మహాశ్వేతాదేవి సైతం 1979లోనే ‘అరణ్యేర్ అధికార్’ పేరుతో రాసిన ఒక బెంగాలీ నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ను స్వంతం చేసుకుంది. ‘ఉల్ గులాన్ ఏక్ క్రాంతి’ పేరుతో సినిమా వచ్చింది. 2008లోనే “గాంధీజీకే పహిలే గాంధీ” పేరుతో కూడా మరో సినిమా వచ్చి మంచి పేరు తెచ్చింది. చిత్రమైన విషయం ఏమిటంటే బీహార్ రెజిమెంట్ వాళ్ళు ఇప్పటికీ “బిర్సా ముండా జై” అంటూ నినాదాలు ఇస్తారు.

అలా పాతికేళ్ళ అతి స్వల్ప కాలంలోనే అనూహ్యమైన ఆదివాసీ ప్రజా పోరాటాన్ని చేసి శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వన వీరుడు బిర్సా! ముండా తెగలో పుట్టినప్పటికీ ఆయన పోరాటం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఆదివాసీ, గిరిజనులకు గొంతుకగా మారడం ఆయన పోరాటంలోని సార్వజనీనతకు నిదర్శనం. ఆయన చేసిన “ఉల్ గులాన్‌” (తిరుగుబాటు) వనవాసుల పొలి కేక! అణచివేతల ఉక్కు పాదాలను ఛిన్నాభిన్నం చేసిన పోరాట గీతిక. మానవహక్కుల ప్రస్థానంలో వీరి పాత్ర వీరపతాక!!

అయినంపూడి శ్రీలక్ష్మి- 9989928562

 

Related Articles

- Advertisement -

Latest Articles