Friday, September 13, 2024

జెఎంఎం, కాంగ్రెస్ ప్రభుత్వం ‘గూఢచర్యం చేస్తోంది’

- Advertisement -
- Advertisement -

చంపై సోరెన్ ఆరోపణ
ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ దాఖలు

న్యూఢిల్లీ : ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆదివాసీ ప్రముఖుడు చంపై సోరెన్ రాష్ట్రంలో జెఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ‘గూఢచర్యం ఆరోపణలు’ చేశారు. ఢిల్లీ చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. గడచిన ఐదు మాసాలుగా చంపై సోరెన్‌ను అనుసరిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చిన ఝార్ఖండ్ ప్రత్యేక బ్రాంచ్ (జెఎస్‌బి) పోలీసులు ఇద్దరిని ప్రశ్నించే నిమిత్తం ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. బిజెపి నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ‘స్వతంత్ర భారతంలో అతిపెద్ద రాజకీయ నిఘా’ వివరాలను బుధవారం ఢిల్లీలో వెల్లడిస్తూ, ‘స్వతంత్ర భారత చరిత్రలో ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి (హేమంత్ సోరెన్) సొంత మంత్రివర్గ సహచరునిపైనే నిఘాకు ఎన్నడూ ఆదేశించలేదు.

దివంగత అస్సాం సిఎం నాపై నిఘాకు ఆదేశించిన కథనాలు మీరు విన్నారు. అయితే, ఆ సమయంలో సాక్షాధారాలు ఏవీ లేవు’ అని చెప్పారు. ‘చంపై సోరెన్ కేసులో మాజీ సిఎం ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా ఆయనను అనుసరిస్తున్న ఝార్ఖండ్ ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు ఇద్దరు పట్టుబడ్డారు. ఆ ఇద్దరిని మంగళవారం ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వారు సోమవారం (26) నుంచి దేశ రాజధానిలో తాజ్ హోటల్‌లో చంపై సోరెన్ బస చేసిన అంతస్తులోనే ఒక గది బుక్ చేసుకున్నారు’ అని శర్మ తెలియజేశారు. బిజెపిలోకి చంపై సోరెన్ ప్రవేశానికి మార్గాన్ని శర్మే సుగమం చేశారు.

చంపై సోరెన్ శుక్రవారం (30న) బిజెపిలో చేరతారు. ఆయన జెఎంఎం నుంచి రాజీనామా చేసేంత వరకు ఝార్ఖండ్ జల వనరుల శాఖ మంత్రిగా కొనసాగుతారు. చంపై సోరెన్ కదలికలపై ఒక కన్ను వేసి ఉంచవలసిందిగా తమను రాష్ట్ర ప్రత్యేక బ్రాంచ్ చీఫ్ కోరారని ఝార్ఖండ్ పోలీసులు వెల్లడించినట్లు శర్మ తెలియజేశారు. ‘వారి గూఢచర్యం ఐదు నెలలుగా సాగుతోంది. దానిపై ఎంతో డబ్చు ఖర్చు చేశారు. ఇప్పుడు చంపై సోరెన్ ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. దర్యాప్తు సాగుతోంది. మా వద్ద ఆ పోలీసుల వివరాలు, ఫోటోలు ఉన్నాయి’ అని శర్మ చెప్పారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని శర్మ కోరారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ ఝార్ఖండ్ బిజెపి కూడా రాష్ట్ర గవర్నర్‌ను కలుసుకోవచ్చునని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News