Monday, April 29, 2024

అమెరికా చైనా సైనిక సమన్వయం..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ప్రపంచస్థాయి యుద్ధ సంక్షోభాల నడుమ గురువారం అమెరికా చైనా అధినేతలు జో బైడెన్, జి జిన్‌పింగ్ నడుమ సమావేశం జరిగింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు నేతల మధ్య జరిగిన రహస్య చర్చలు ఉభయ శక్తుల నడుమ సమన్వయం దిశకు దారితీశాయి. ఇరుదేశాల నడుమ పరస్పర సైనిక సమన్వయ సమాచారం (మిలిటరీ టు మిలిటరీ కమ్యూనికేషన్స్) ఏర్పాటుకు ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటువంటి అవగావహన కుదరడం కీలక పరిణామమని అంతర్జాతీయ విశ్లేషకులు తెలిపారు. అమెరికా చైనా దేశాల మధ్య ఇప్పటికీ మిలిటరీ మారీటైం కన్సల్వేటివ్ అగ్రిమెంట్ అమలులో ఉంది. అయితే ఇది పెద్దగా కార్యాచరణలో లేదు. 2020 వరకూ దీనిని కేవలం గగనతలం, సముద్ర మార్గాలలో భద్రతల మెరుగుదలకు ఉపయోగించుకుంటూ వస్తున్నారు.

ఇప్పుడు ఈ ఒప్పందం పరిధిలోనే తరచూ సైనిక వర్గాల స్థాయిలో సంప్రదింపులకు దిగాలని ఇప్పటి భేటీలో నిర్ణయించారు. బైడెన్ జిన్‌పింగ్ సమావేశం తరువాత వివరాలను అమెరికాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వివరించారు. 2017 తరువాత చైనా అధినేత అమెరికాకు రావడం ఇదే తొలిసారి. మిలిటరీ కమ్యూనికేషన్ ప్రాతిపదికన సైనిక విషయాలలో సామరస్యపూర్వక సహకారానికి ఇప్పుడు దారి ఏర్పడిందని అధికారి తెలిపారు. ఇక ఈ క్రమంలో అమెరికా , చైనా రక్షణ మంత్రుల మధ్య తరచూ సంప్రదింపులు తరచూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరిగేందుకు వీలేర్పడుతుంది. ఓ వైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తాజాగా గాజాలో తలెత్తిన హమాస్ ఇజ్రాయెల్ భీకర పోరు దశలో అటు చైనా, ఇటు అమెరికాలు వేర్వేరు విధాన నిర్ణయాలకు పాల్పడటం అంతర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచిపోషిస్తోంది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య తరచూ సైనిక విషయాల సమన్వయంపై సంప్రదింపులు, సముచిత సహకారం ఉంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామం అవుతుందని ఆశిస్తున్నారు.

ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి సైనిక చర్చలకు అంగీకారం కుదిరిన విషయాన్ని చైనా అధినేత కూడా ఆ తరువాత నిర్థారించారు. తాను బైడెన్‌తో జరిపిన విస్తృత స్థాయి చర్చలు ఇరుదేశాల ఆత్మగౌరవం, సమానతల ప్రాతిపదికన సరైన వాతావరణం నెలకొనడానికి దారితీస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ రెండు అగ్రదేశాల యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అతిక్రమణలకు పాల్పడటం ఉద్రిక్తతలకు దారితీసింది. చైనాతో సైనిక సత్సంబంధాలను అమెరికా అత్యంత కీలకంగా భావిస్తోంది. శాంతియుత ఇండో పసిఫిక్ ప్రాంతం నెలకొనాలంటే , తరచూ తలెత్తుతున్న తప్పటడుగులు, ఏర్పడుతున్న అపార్థాలు నివారించాలంటే తప్పనిసరిగా ఇరుదేశాల సైనిక వర్గాల సమన్వయం అత్యవసరం అని అమెరికా పేర్కొంటోంది. కోవిడ్, లాక్‌డౌన్లు, తరువాత అమెరికా మాజీ స్పీకర్ నాన్సీపెలోసీ 2022లో తైవాన్‌లో పర్యటించడంతో ఇరుదేశాల మధ్య సైనిక సంబంధాలు బెడిసికొట్టాయి.

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News