మన తెలంగాణ/హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల ఉమ్మడి వరంగల్ జిల్లాకి వరప్రదాయిని అని స్టేషన్ ఘనపూర్ ఎంఎల్‌ఏ కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. దేవాదుల ఎత్తిపోతలతో సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఎప్పుడో పూర్తి కావాలని, గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వలన పనులు పూర్తికాలేదని తెలిపారు.
దేవాదుల కింద ఉన్న ప్రధాన పంట కాలువలు పూర్తి కాకపోవడం వల్ల చివరి భూములకు సాగు నీరు అందించలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యత ఏ ప్రాజెక్టుకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని దేవాదుల ఎత్తిపోతుల పథకానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు.
స్టేషన్ ఘనపూర్ నుంచి నవాబ్ పేట్ వరకు ప్రధాన కాలువతో పాటు ఉప కాలువల లైనింగ్ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 140 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. దేవాదుల మూడవ దశ, ప్యాకేజ్ ఆరు పనులు అర్ధాంతరంగా గత ప్రభుత్వం ఆపివేసిందని దీంతో పలు గ్రామాల్లో సాగునీరుకు ఇబ్బందులు ఎరైయ్యాయన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, రూ.1,010 కోట్ల రూపాయలు పనుల కోసం కేటాయించిందని ఆయన తెలిపారు. ఎత్తైన ప్రదేశాలకు నీరు అందడంలేదని, గత ప్రభుత్వం రూ. 104 కోట్లు కేటాయించినా పనులు జరగలేదని, ఇప్పుడు ప్రభుత్వం వీటికి ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. దేవాదుల వాటి అనుబంధ కాలువల పనులు పూర్తి చేయటానికి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.