మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః మాకు మరో వారం రోజుల గడువు ఇవ్వండి అని ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. ఆదివారం అసెంబ్లీ లాబీలో కడియం శ్రీహరి తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ నుంచి తమకు నోటీసు వచ్చింది వాస్తవమేనని అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీలోగా నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ గడువు సరిపోదని, ఈ గడువు తర్వాత కూడా తమకు అదనంగా మరో వారం రోజుల సమయం ఇవ్వాలని కోరగా అందుకు స్పీకర్ సమ్మతించారని ఆయన చెప్పారు. ఈ గడువులో తాము సమాధానం ఇస్తామని కడియం తెలిపారు.
పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం ఫిరాయించిన ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ బిఆర్‌ఎస్ ఒకవైపు స్పీకర్‌కు నోటీసు ఇవ్వడం, మరోవైపు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సమాధానం తెలియజేయాలంటూ నోటీసు పంపించారు.