Thursday, October 10, 2024

రైలు ట్రాకుపై ఎల్‌పిజి సిలిండర్‌, పెట్రోల్ సీసా, అగ్గిపెట్టెలు

- Advertisement -
- Advertisement -

భివానీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళుతున్న కాళింది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు ట్రాకుపై ఉంచిన ఎల్‌పిజి సిలిండర్‌ను ఢీకొన్న రైలును ఇంజన్ డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. రైలు ట్రాకుపై పెట్రోల్ సీసా, అగ్గిపెట్టెలు కూడా లభించాయని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇది రైలును పేల్చడానికి జరిగిన కుట్రగా వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 8.20 గంటల ప్రాంతంలో రైలు వేగంగా వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రైల్వే పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపేందుకు అనేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ తీవ్రవాద నిరోధక బృందం(ఎటిఎస్) విడిగా దర్యాప్తు చేపట్టినట్లు డిసిపి(పశ్చిమ) రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. రైల్వే ట్రాకులపై ఎల్‌పిజి సిలిండర్‌ను పెట్టి కాళింది ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పేలా చేసేందుకు ప్రయత్నం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఆదివారం రాత్రి ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ అధికారులు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారని వారు చెప్పారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా అక్కడకు రప్పించినట్లు వారు తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పిఎఫ్) కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు. రైలు ట్రాకులపై ఎల్‌పిజి సిలిండర్‌ను చూసిన లోకో పైలట్ ఎమెర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశాడని ఎసిపి(శాంతి భద్రతలు) హరీష్ చంద్ర తెలిపారు. అయితే రైలు ఆగడానికి ముందే సిలిండర్‌ను ఢీకొనడంతో సిలిండర్ ఎగిరి ట్రాకుల అవతల పడిందని ఆయన చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని లోకో పైలట్ రైలు గార్డుకు, గేట్‌మ్యాన్‌కు సమాచారం అందచేశారని ఆయన తెలిపారు. సుమారు 20 నిమిషాల సేపు అక్కడే నిలిచిపోయిన రైలు ఆ తర్వాత బయల్దేరి తనిఖీ కోసం బిల్హోర్ స్టేషన్‌లో నిలిచిందని ఆయన తెలిపారు. ధ్వంసమైన సిలిండర్‌తోపాటు పెట్రోల్ సీసాను, అగ్గిపెట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నేరస్థులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎసిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News