Saturday, April 27, 2024

కెసిఆర్ @ 70

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అధినేత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు

తెలంగాణ భవన్‌లో 70 కిలోల భారీ కేక్ కట్ చేసిన కెటిఆర్

ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ

శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎంపి వద్దిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా శనివారం నాడు జరిగాయి. తెలంగాణ సాధకుడుగా, ప్రగతి ప్రదాతగా అభివర్ణిస్తూ పార్టీ నేతలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని బిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు, దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. 70 కేజీల కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. అతడే ఒక చరిత్ర పేరుతో తెలంగాణ ఉద్యమం దిశగా అనంతర రాష్ట్ర ఏర్పాటు ప్రగతి ప్రస్థానం దాకా సాగిన కెసిఆర్ జీవన రాజకీయ ప్రస్థానంపై బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. అసెంబ్లీ కొనసాగుతున్న నేపధ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీశ్ రావు ఆద్వర్యంలో అధినేత పుట్టినరోజు వేడుకలను అసెంబ్లీ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల, ఎంఎల్‌ఎలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
బిఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటూ ఆదుకుంటుందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మరణించిన 70 మంది బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ప్రమాద బీమా కింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఎంపిలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌ఎలు ముఠా గోపాల్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి
కెసిఆర్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలు ఎక్స్ వేదికగా కెసిఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పుష్పగుచ్ఛాన్ని పంపించిన గవర్నర్
కెసిఆర్‌కు గవర్నర్ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం గవర్నర్ కెసిఆర్‌కు ఒక లేఖను, పుష్పగుచ్ఛాన్ని పంపించారు. గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన ఓ ప్రతినిధి.. కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ రాసిన లేఖను, పుష్పగుచ్ఛాన్ని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు. మరోవైపు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్ హోటల్‌లో అధినేత పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News