Friday, December 1, 2023

కెనడా నిరాధార ఆరోపణ

- Advertisement -
- Advertisement -

భారత, కెనడా సంబంధాలు వున్నట్టుండి దిగజారిపోడం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. గత జూన్‌లో కెనడాలో జరిగిన నిజ్జార్ అనే సిక్కు టెర్రరిస్టు హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తమున్నదని భావించడానికి ఆధారాలున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత సోమవారం నాడు అక్కడి పార్లమెంటులోనే ప్రకటించడం రెండు దేశాల మధ్య సంబంధాలు పాతాళం తాకేలా చేశాయి. జి7, నాటో కూటమి సభ్యదేశమైన కెనడా మన మీద ఇంత తీవ్రమైన ఆరోపణ చేయడం వెనుక వున్నది అక్కడ అప్రతిహతంగా సాగుతున్న సిక్కుల వేర్పాటువాద కార్యకలాపాలను ట్రూడో ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేయడమేనని స్పష్టపడుతున్నది. ఇండియాపై ట్రూడో ఇంతటి ఆరోపణ చేసిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య అధికారుల వెలి చోటు చేసుకొన్నది. ఈ వివాదంలోకి అమెరికా, బ్రిటన్ తదితర తన మిత్ర దేశాలను సైతం లాగడానికి కెనడా ప్రయత్నిస్తుంది. కెనడాతో మనకు ఇంత వరకు అన్ని విధాలా మంచి సంబంధాలే వున్నాయి. రెండు దేశాల మధ్య 202223లో 8.16 బిలియన్ డాలర్ల వాణిజ్యం సాగింది.

మందులు, వజ్రాలు, నగలు, జౌళి ఉత్పత్తులు, యంత్ర పరికరాలు వంటి 4.1 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు కెనడాకు ఇండియా ఎగుమతులు చేసింది. అలాగే పప్పులు, కలప, కాగితం, దాని ముడిసరకు, ఖనిజాలు వంటివి కలిసి 4.06 బిలియన్ డాలర్ల మేరకు ఇండియాకు కెనడా ఎగుమతులు వచ్చాయి. ఇంచుమించు సమాన స్థాయిలో సాగుతున్న ఈ వాణిజ్యం ముందు ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ దశలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను వాయిదా వేస్తున్నట్టు రెండు దేశాలూ ప్రకటించాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భాగస్వామ్య దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులపై సుంకాలు పరిమితంగా వుంటాయి. కెనడాతో వాణిజ్యం పురోగమిస్తున్న దశలో ఈ ఒప్పందానికి బ్రేకులు పడడం బాధాకరం. జస్టిన్ ట్రూడో ఇటీవల జి20 సమావేశాలకు న్యూఢిల్లీ వచ్చినంత వరకు రెండు దేశాల మధ్య ఇంతటి అగాధం చోటు చేసుకొనే అవకాశాలు కనిపించలేదు. గతంలో విపరీతమైన రక్తపాతానికి కారకులైన ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఇటీవలి కాలంలో కొన్ని విదేశాల్లో సృష్టిస్తున్న భారత వ్యతిరేక సన్నివేశాలే కెనడా సంబంధాలు వున్నట్టుండి ఇంతగా దిగజారిపోడానికి కారణమని తెలుస్తున్నది.

కెనడా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో స్థిరపడిన సిక్కులు ఈసారి అక్కడి నుంచే ఖలిస్థానీ కార్యకలాపాలను చేపట్టినట్టు బోధపడుతున్నది. పంజాబ్‌లో ఇందుకు సాహసించడానికి బదులు విదేశీ గడ్డ మీది నుంచి భారత దేశాన్ని ఇరకాటంలో పెట్టాలని వారు వ్యూహం పన్నారు. నిజ్జార్ హత్యతో భారత ప్రభుత్వాన్ని ముడిపెడుతూ ప్రధాని ట్రూడో చేసిన ప్రకటనను ఇండియా తీవ్రంగా తిప్పికొట్టింది. ఖలిస్థానీ శక్తులపై చర్య తీసుకొంటామని బ్రిటిష్, అమెరికన్ అధికార్లు ఇండియాకు హామీ ఇవ్వగా, కెనడా పాలక పక్షం మాత్రం వారికి మద్దతుగా మాట్లాడినట్టు తెలుస్తున్నది. దీనితో జి20కి వచ్చిన ట్రూడోకు ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా స్వాగతం పలకడానికి బదులు ఒక మంత్రిని విమానాశ్రయానికి పంపించడం కెనడా కోపానికి కారణమైంది. ఇంకే దేశంలోనూ లేనంత ఎక్కువగా సిక్కులు కెనడాలో వున్నారు. వారి బలమైన ఓటు బ్యాంకును దృష్టిలో వుంచుకొని అక్కడి పాలక పక్షం వారిని బుజ్జగించే విధానాన్ని అమలు చేస్తున్నది. టెర్రరిస్టు సానుభూతిపరులు తమ స్వప్రయోజనాల కోసం తాము నివసిస్తున్న దేశంలో ప్రభుత్వాన్ని, పాలకులను ప్రభావితం చేయగలగడం ప్రపంచ సంబంధాల్లో ఆందోళనకరమైన మలుపులకు దారి తీస్తుంది. కెనడాలో ఇప్పుడు జరుగుతున్నది అదే.

అంతర్జాతీయ సంస్థల వేదికలపై ఇటువంటి ధోరణుల గురించి కూలంకషంగా చర్చించి తగు నియమాలను రూపొందించే అవకాశాలు ప్రస్తుతానికైతే లేవు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు అక్కడి సిక్కు వేర్పాటువాదులపై భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి. సిక్కు టెర్రరిస్టు నిజ్జార్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తమున్నట్టు కెనడా బహిరంగంగా ప్రకటించిన తర్వాత పశ్చిమ దేశాలు ఎటువైపు మొగ్గుతాయి అనేది పెద్ద ప్రశ్న. ఈ ఆరోపణపై కెనడా ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుకు సహకరించవలసిందిగా భారత దేశాన్ని అమెరికా కోరినట్టు వార్తలు చెబుతున్నాయి. అయితే తన ఆరోపణలకు గల ఆధారాలను కెనడా బయటపెట్టకపోడం భారత దేశం నిరపరాధిత్వాన్ని చాటుతున్నది. ఈ విషయమై తాము అమెరికాతో కలిసి సన్నిహితంగా పని చేస్తున్నామని, ఇందులో ఇండియా పాత్రపై మరింత సమాచారం ముందు ముందు వెల్లడవుతుందని కెనడా చెబుతున్నది. ఖలిస్థానీయులకు అదే పనిగా మద్దతు ఇస్తున్నందుకు కెనడాను ఎత్తి చూపడంతో ఇండియాపై అది ఇంతటి ఆరోపణకు బరితెగించడం బాధాకరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News