Saturday, August 16, 2025

ఖజానా జ్యువెలరీ చోరీ కేసులో ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖజానా జ్యువెలరీ చోరీ కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 900 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మరో ఏడుగురు నిందితులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 12 న ఆరుగురు దుండగులు ముసుగు ధరించి చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ పై కాల్పులు జరిపారు. అనంతరం సిబ్బందిని బెదిరించి 10 కిలోల వెండి ఆభరణాలను దుండగులు దోచుకొని పారిపోయారు. జ్యువెలరీ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు నిందితులు ఆశీష్ కుమార్ సింగ్(22), దీపక్ కుమార్ సాహ్(22) బీహార్ లోని సరన్ జిల్లాకు చెందినవారు. బీహార్ నుండి హైదరాబాద్ కు వచ్చిన వీరు బంగారం, వజ్రాల దుకాణాలను దోచుకోవడానికి ప్రణాళికలు రచించారు. దీపక్ కుమార్ సాహ్ ఒక వెల్డింగ్ కార్మికుడు అతడు తన సహచరులతో కలిసి జూలై 31 2025న జీడిమెట్ల ప్రాంతంలోని ఆస్‌బెస్టాస్ కాలనీలో రూమ్ ను అద్దెకు తీసుకున్నారు. వారు రెండు సెకండ్ హ్యాండ్ బైక్‌లను కొనుగోలు చేసి దోపిడీని అమలు చేయడానికి ముందు చందానగర్‌లోని పలు నగల దుకాణాలను పరిశీలించారు. ఆగస్టు 12న ఆరుగురు దుండగులు ముసుగు ధరించి చందానగర్‌లోని ఖజానా జ్యువెల్లరీ షాపులోకి ప్రవేశించి వెండి ఆభరణాలను అపహరించారు. అనంతరం దుండగులు బైకులపై పారిపోయారు. ఆశీష్ కుమార్ సింగ్ మహారాష్ట్రలో పట్టుబడ్డాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు దీపక్ కుమార్ సాహ్ ను కూడా అరెస్టు చేశారు.  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది సంయుక్త కృషితో వారిని అరెస్టు చేశామని మాదాపూర్ డిసిపి వినీత్ కుమార్ తెలిపారు. నగల దుకాణ యజమానులు భద్రతా చర్యలను మెరుగుపరుచుకోవాలని, ఆపరేషన్ సమయంలో తగిన భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు అలారం ప్యానెల్‌లను ఏర్పాటు చేసుకోవాలని డిసిపి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News