Sunday, December 15, 2024

మావోయిస్టులు ‘జితేందర్ రెడ్డి’ సినిమా చూడాలి:కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మావోయిస్టులు తప్పకుండా ‘జితేందర్ రెడ్డి’ సినిమా చూడాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అమీర్‌పేట్‌లోని ఓ థియేటర్లో ‘జితేందర్ రెడ్డి’ సినిమాను సోమవారం ఆయన వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు జితేందర్ రెడ్డి బీజేవైఎంలో పనిచేశారని గుర్తు చేశారు. జగిత్యాల పరిసర ప్రాంతాల్లో పేదల పక్షాన నిలబడి జాతీయవాదం కోసం పోరాడారని అన్నారు. వరంగల్లో బీజేవైఎం సభ నిర్వహించినపుడు సుమారు 50 బస్సుల్లో జగిత్యాల నుంచి జనాన్ని తరలించి సభను జయప్రదం చేశారని అన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా వెనుకడుగు వేయని ధైర్యవంతుడు జితేందర్ రెడ్డి అని కొనియాడారు. మావోయిస్టులు ఆయనను చుట్టుముట్టి హత్య చేయడం చూశాను,

హింస ద్వారా ఏమీ ఉపయోగం లేదని తెలిసినా తన మద్దతుదారులను కాపాడుకునేందుకు ఆయన తుపాకీ పట్టాల్సి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా కొందరు తుపాకీ ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని భావిస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. తుపాకీ బుల్లెట్ కంటే ఓటు బుల్లెట్ (బ్యాలెట్) ద్వారా సమాజంలో మార్పు సాధ్యమని అంబేద్కర్ చెప్పారని తెలిపారు. జితేందర్ రెడ్డి కి ప్రాణానికి హాని ఉందని తెలిసినా ఆయన తండ్రి మల్లారెడ్డి ఏనాడూ జితేందర్ రెడ్డి పోరాటానికి అడ్డు చెప్పలేదని అన్నారు. 72 బుల్లెట్లు జితేందర్ రెడ్డి శరీరంలో దింపారు. ఆ పోరాటంలో జితేందర్ రెడ్డి వీర మరణం పొందారని చెప్పారు. జితేందర్ రెడ్డి సినిమాను మావోయిస్టులు తప్పకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. మావోయిస్టులు హింసను వదిలేసి ప్రజాస్వామ్యంలోకి రావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News