మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్‌కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కెసిఆర్ కిట్లను ఇవ్వడం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు ఆరోపించారు. బిఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన కెసిఆర్ కిట్లతో మాత శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా కెసిఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కెటిఆర్.. ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్‌లో కెసిఆర్ కిట్లను అందజేశారు. గత 20 నెలల నుంచి కెసిఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని, అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా 5 వేల మంది తల్లులకు సిరిసిల్లలో కెసిఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
2014కు ముందు తాను రాను బిడ్డో సర్కారు దవఖానకు అని జనాలు భయపడేవారని, ముఖ్యమంత్రిగా కెసిఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దవాఖానాకే పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన కెసిఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. కెసిఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం,కోపమే ఇందుకు కారణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.