Saturday, March 2, 2024

స్వరాష్ట్రంలో సుపరిపాలన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమయ్యే ప్రతి మురుగునీటి చుక్కను శుద్ధి చేయబోతున్నామని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఫలితంగా దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరబాద్ అవతరిస్తుందని పునరుద్ఘాటించారు. శనివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న వార్డు కార్యాలయాల సిబ్బందితో హైటెక్స్ లో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ దాన కిశోర్ తో పాటు ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నగరంలో గతంలో తాగునీటి కష్టాలు ఉండేవని, స్వ రాష్ట్రంలో ఆ బాధలన్నీ తొలగిపోయాయన్నారు. జలమండలి ఆధ్వర్యంలో రూ.3866 కోట్లతో కొత్తగా 31 ఎస్టీపీలు నిర్మిస్తున్నామని.. ఇవి అందుబాటులోకి వస్తే మురుగు శుద్ధి సామర్థ్యం 2 వేల ఎంఎల్డీలకు చేరుతుందన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి లో 9 శాతం మాత్రమే మురుగు శుద్ధి చేస్తున్నారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో జలమండలి, జిహెచ్‌ఎంసి, విద్యుత్తు బోర్డు, తదితర ప్రధాన విభాగాల నుంచి ఒక్కరు చొప్పున మొత్తం 10 మంది అధికారులు ఉంటారని.. వారు సంబంధిత సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అందులో పనిచేసే సిబ్బంది ప్రజలతో మమేకమై ముందుకెళ్లాలని కోరారు. ఆచరణాత్మక మైన లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ నగరానికి లేని తాగునీటి వసతులు మన హైదరాబాద్ కు ఉన్నాయన్నారు. గత తొమ్మిదేళ్లలో తాగునీరు, సంబంధిత ప్రాజెక్టుల కోసం రూ.18 వేల కోట్లు ప్భ్రుత్వం వెచ్చించింద్ని తెలిపారు. గతంలో నగరానికే పరిమితమైన తాగునీటి సరఫరా సేవలు.. నేడు ఓఆర్‌ఆర్ వరకు విస్తరించాయని తెలిపారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. నాగార్జున సాగర్ దగ్గర ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సుంకిశాల ఇన్ టెక్ వెల్ ప్రాజెక్టు పూర్తయితే.. భవిష్యత్తు తరాలకు తాగునీటి గోసలుండవు అని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. దేశంలోనే తొలిసారి మానవ రహిత పారిశుద్ధ్య పనులు చేపట్టింది జలమండలి అని గుర్తు చేశారు. త్వరలోనే వందశాతం మురుగు శుద్ధి చేసే నగరంగానూ రికార్డు సృష్టిస్తామని పేర్కొన్నారు. పనులు సక్రమంగా నడిచేందుకు యాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టం లాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందు చూపు, సహకారంతోనే సాధ్యమైందన్నారు.

దార్శనికులైన పాలకులు ఉంటే.. అభివృద్ధి ఫలాలు ఉంటాయని చెప్పారు. ఇక జలమండలి తరఫున వార్డు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది (వార్డు అసిస్టెంట్లు) ప్రజల పట్ల బాధ్యతతో నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వంలో పనిని సక్రమంగా చెయ్యడమే అధికారుల విధి అని, మనం ప్రజలకు ఇచ్చే స్పందనలోనే మన పరిపక్వత కనిపిస్తుందని చెప్పారు. ఈ ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు క్షేత్ర స్థాయిలో సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.
జలమండలి వార్డు అసిస్టెంట్ల విధి :
ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న వార్డు కార్యాలయంలో మొత్తం 10 మంది సిబ్బంది ఉంటారు. అందులో జలమండలి తరఫున వార్డు అసిస్టెంట్ ఉంటారు. వీరు.. ఆ వార్డు పరిధిలో కింది సమస్యలపై దృష్టి సారించి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు.
తాగునీటి సరఫరా : లో ప్రెజర్ సమస్య, కలుషిత నీటి సరఫరా, పైపు లైన్, వాల్వ్ లీకేజీ, అక్రమ నల్లా కనెక్షన్, క్లోరిన్ శాతం తక్కువగా ఉండటం.
మురుగునీటి నిర్వహణ: మ్యాన్ హోళ్ల వద్ద చోకేజీ, మ్యాన్ హోల్ డ్యామేజి, మరమ్మతు, సీవరేజీ ఓవర్ ఫ్లో, సిల్ట్ తొలగించడం.
బిల్లింగ్ : మీటర్ రీడింగ్ సమస్యలు, పేరు మార్పు, అధిక బిల్లు వస్తే వెరిఫై చేయడం, బకాలయిలు చెల్లించేలా చూడటం, నూతన నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయడం, తొలగించడం.
ఇతర ఫిర్యాదులు: ట్యాంకర్ సేవలు, ట్యాంకర్ డెలివరీ ఫిర్యాదులు, లైన్ మార్పులు, ఇతరత్రావి.

ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ కమిషన్, డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, శ్రీధర్ బాబు, వీఎల్ ప్రవీణ్ కుమార్, సీజీఎంలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News