Friday, April 26, 2024

లైంగిక వేధింపులకు పాల్పడితే పథకాలు కట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పోలీస్ శాఖ 100 టోల్ ఫ్రీ నెంబర్‌పై అవగాహన ఉన్నట్లుగానే ఇకపై 1930 టోల్ ప్రీ నెంబర్‌పైనా ప్రతి ఒక్కరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటి. రామారావు అన్నారు. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా టోల్ ఫ్రీ నెంబ ర్ 1930 ని మనం ప్రచారం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పిలుపు నిచ్చారు. వ్యక్తుల కంటే కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వంటి సంస్థలను మనం నిర్మించాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో ఐటి రంగంలో లక్ష మందికి పైగా పని చేస్తున్నారని అందరూ సైబర్ యోధులుగా మారి నేరాలను అరికట్టే అంశంలో ముందుకు రావాలని కెటిఆర్ పిలుపు నిచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపట్ల కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఎవరైనా సెక్సువల్ హరాస్‌మెంట్‌కు పాల్పడితే ఇక పై వారికి ప్రభుత్వ పథకాలు ఏవీ కూడా వర్తించకుండా చేస్తామన్నారు. ఇందుకోసం త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మహిళలు, విద్యార్థినులను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వారు పోలీస్‌శాఖ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని..ఆ మరుక్షణమే ఫోన్ అందిన ప్రాంతం సదరు మహిళ, లేదా విద్యార్థినిని కాపాడేందుకు డ్రోన్ల సహాయంతో నిఘా వేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తగినన్ని సిసి టీవీ నిఘా కెమెరాలు ఉన్నాయని.. అమ్మాయిలను వేధించే ఆకతాయిలూ తస్మాత్ జాగ్రత్త అని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు.

నేరాల నియంత్రణకు సాంకేతికనే శ్రీరామరక్ష అని కెటిఆర్ అన్నారు. సాంకేతికత ప్రతి చోటా ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. సైబర్ సెక్కూరిటీ పెద్ద సవాలుగా మారిందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కెటిఆర్ అన్నారు. ఈ సైబర్ నేరాల ప్రభావం కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని చిన్న, మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయని ఆయన అన్నారు. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రానికి సైబర్ ఎకో సిస్టమ్‌ను సురక్షితంగా ఉంచడానికి భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా “ తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ” ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. సైబర్‌నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం నాడు నగరంలో సైబర్ భద్రత కోసం టిఎస్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ, డిజిపి ఎం. మహేందర్ రెడ్డి, అలాగే స్టీఫెన్ రవీంద్ర ఐపిఎస్ , కమిషనర్ ఆఫ్ పోలీస్ ( సైబరాబాద్ కమిషనరేట్ ) తదితరులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

టిఎస్ పోలీస్ “ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సెఫ్టీ” అనేది తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ద్వారా నిర్వహించబడే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ( ఎస్‌సి ఎస్‌సి ) యొక్క కార్యక్రమం. తెలంగాణ స్టేట్‌పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఫర్ సైబర్ సెక్యూరిటీ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. సైబర్ సెక్యూరిటీ సంఘటనలు, మరియు మోసాలను తగ్గించడం కోసం అలాగే సాంకేతికతను ఉపయోగించుకోవడం దీనిని వినియోగించుకోవచ్చని మంత్రి కెసిఆర్ అన్నారు.

యువకలు చేసే సరికొత్త నేరాలకు పోలీసు శాఖ కూడా కొత్త టెక్నాలజీ వినియోగం, పరిష్కారాలు అవసరం అన్నారు. ఆమాటకు వస్తే రాజకీయ నాయకులు కూడా ఆర్థికనేరాలకుపాల్పడుతున్నారని మొన్నటి మునుగోడు ఉప ఎన్నికనే ఇందుకు నిదర్శనమన్నారు. ఓటుకు నోటు ఇచ్చేందుకు సరికొత్తగా ఫోన్ పే, గూగుల్ పేలను వాడుకున్నారన్నారు. మరీ ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఓటర్లను డిజిటల్ చెల్లింపుల ద్వారా నగదు బదిలీ చేసినట్లు గుర్తించామన్నారు. ఎప్పుడూ లేనిది ఉప ఎన్నికల ఆ నాలుగైదు రోజుల్లో భారీగా ఫోన్ పే, గూగుల్ పేల వినియోగం పెరిగిందని, ఇలాంటి విషయాలపై ఎన్నికల సంఘం కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికే షీ టీమ్స్ వంటి కార్యక్రమాలను చేపట్టి మహిళా ఉద్యోగినులకు భరోసా నిచ్చామన్నారు. షీ టీమ్‌ను ప్రశంసిస్తూనే సునితా కృష్ణన్ అనే ప్రముఖ సామాజిక కార్యకర్త లైంగిక నేరస్తుల నమోదుపై హోం శాఖ మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ దృష్టికి తెచ్చారన్నారు.

మహిళా ఉద్యోగినులను, విద్యార్థినులను వేధించే ఆకతాయిల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్నారు. పోలీసు కేసులు అయితే అలాంటి వారిని ఉద్యోగాల నుండి నిషేధించడమే కాకుండా రేషన్ లేదా ఉద్యోగాలు వంటివి ఇక ప్రభుత్వం నుండి ఎలాంటి సౌకర్యాలను కూడా ఉపయోగించుకోకుండా వారిని నిశేధిస్తామని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. అలాగే డ్రోన్‌ల వినియోగం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఇది పోలీసులు రాక ముందే నేరస్థలానికి వేగంగా వెళ్లగలదని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. వీలైనంత త్వరగా నేరాలను అడ్డుకునేందుకు ఈ డ్రోన్‌ల వినియోగం బెటర్ కూడా అని కెటిఆర్ అన్నారు.

స్టార్టప్ సైబర్ ఐ ని ప్రారంభించిన కెటిఆర్

ఈ సందర్భంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కి టెక్నికల్ డైరెక్టర్‌గా కూడా ఉన్న మాజీ డిఆర్‌డిఓ నిపుణుడు రామ్ గణేష్ స్థాపించిన స్టార్టప్ “ సైబర్ ఐ ” ని కెటిఆర్ ఈ సందర్భంగా ల్యాప్ టాప్ ద్వారా ప్రారంభించారు. అంతే కాకుండా మరో వెబ్ సైట్ www.tspcc.org ను కూడా మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

రాష్ట్రంలో 64 శాతం సిసి టీవీలు: హోం మంత్రి మహ్మద్ మహబూబ్ అలీ

రాష్ట్రంలో అన్ని రకాల నేరాలకు అడ్డకట్ట పడేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. సిసి టివీల వినియోగంలో రాష్ట్రంలో 64 శాతం వరకు ఉన్నాయంటే పరిస్థినిని అర్థం చేసుకోవచ్చన్నారు, రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతోందని ఇందులో సైబర్ నేరాలే ఎక్కువగా ఉంటున్నాయని మహ్మద్ మహమూద్ అలీ వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే తమ శాఖకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, నిధులు కూడా సరిపడా కేటాయిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు.

ప్రభుత్వం కేటాయించిన రూ. 350 కోట్ల నిధులతో 10 లక్షల సిసి టివి కెమెరాలను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. అనంతరం డిజిపి ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే సమయంలో పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ మహమూద్ అలీల సహకారంతో దేశంలోనే అత్యుత్తమం అనదగ్గ రీతిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోగలిగామని గర్వంగా చెబుతున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News