ప్రభుత్వం గవర్నర్‌తో అన్నీ అబద్ధాలే చెప్పించింది
దశదిశ లేని గవర్నర్ ప్రసంగం దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టండి
మీడియా పాయింట్‌లో కెటిఆర్ ఘాటు వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో గవర్నర్ చేసిన ప్రసంగం పూర్తిగా ప్రాథమికంగా రాసిన ఒక ప్రెస్ నోట్‌లా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం చేసినట్లు అనిపించడం లేదని, గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడినట్లు ఉంద ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ అసెం బ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి బుధవారం చేసిన ప్రసంగంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బుధవారం కెటిఆర్ మాట్లాడుతూ గత 15 నెలల పాలనలో ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైతే ఒక్క విషయం కూడా నిజం చెప్పకుండా అన్నీ గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారని ధ్వజమెత్తారు. అసలు గవర్నర్ ప్రసంగానికి దశ, దిశా లేదని వ్యాఖ్యానించారు.
దశ దిశ లేని కేవలం డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి పరిస్థితే తప్పా మరోమాట లేదని కెటిఆర్ విమర్శల దాడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ఒక్క మాట కూడా ప్రసంగంలో లేదని అన్నారు. కెసిఆర్‌పై కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయలేదని కెటిఆర్ ఆరోపించారు. బీసీలను కులగణన పేరుతో వంచించి, అవమానించారని అన్నారు. ఈ విషయాన్ని తాము చెప్పడం లేదని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటే అందుకు ఆయనను సస్పెండ్ చేశారని అన్నారు. కుల గణన పేరుతో బీసీలను వంచించి, మోసం చేసి బీసీల సంఖ్యను తగ్గిస్తే. ఏదో ఉద్దరించినట్లు సోషల్ జస్టిస్ అని గవర్నర్ నోటివెంట అబద్ధాలు చెప్పించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
కాంగ్రెస్ తల్లి, రాహుల్ తండ్రి విగ్రహాలను గాంధీ భవన్‌కు పుంపుతాం
కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని తీసుకువచ్చి సెక్రటేరియట్లో పెట్టి, రాహుల్ తండ్రి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్లు, తెలంగాణకు ఏదో ఉద్దరించినట్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు మూడేళ్ల తర్వాత పంపిస్తామని, మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోవాలని చురకులు వేశారు.
దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టాలి
సిఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి, ప్రభుత్వానికి దమ్ముంటే దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ‘ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అమలు చేయకుండా 420 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ కొత్త ప్రాజెక్టుకు ఇటుక పెట్టకుండా 1.62 లక్షల కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ ఏ మన్నా మందలిస్తరేమోనని భావించామని, అయి తే అందుకు విరుద్దంగా గవర్నర్ ప్రసంగం సాగిందని ఆరోపించారు. దావోస్‌లో రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులని మరోసారి గవర్నర్ అబద్ధాలు చెప్పించారు’ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. నిర్మాణ రంగం కుదేలైనా అసెంబ్లీలో ప్రసంగంలో మాత్రం గొప్పలు చెప్పారని అన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ అనే కంపెనీ రూ.1700 కోట్ల పెట్టుబడి ఏపీకి తరలిపోయిందని గుర్తు చేస్తూ, వాస్తవాలు ఇలా ఉంటే రూ.1.79 లక్షల కోట్లు కాదు కదా, ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.
కాంగ్రెస్ నేతల ఆర్‌ఆర్ ట్యాక్సులు. కమీషన్లు, వీళ్ల దాడికి తట్టుకోలేక నిర్మాణరంగం కుదేలైందని ఆరోపించారు. కమీషన్ తప్పా విజన్ లేని ప్రభుత్వం రేవంత్‌రెడ్డి ప్రభుత్వమని విమర్శించారు. దేశంలో బహుశా ఏ రాష్ట్ర సచివాలయంలో జరగని అత్యంత ఘోరమైన, నీచమైన ఘటన మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగిందని అన్నారు. 20 శాతం కమిషన్ ఇవ్వందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టులు ఆర్థికశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి చాంబర్ ఎదుట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరుగలేదని తెలిపారు. ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచ్‌లను వేధిస్తున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.