Saturday, May 4, 2024

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోళ్లకు బుద్ధి చెప్పాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: మోడీ, ఎన్‌డిఎ కూటమికి 400 సీట్లు కాదు 200 సీట్లు కూడా వచ్చేలా లేవని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరైనా మన వద్దకు రావాలంటే బిఆర్‌ఎస్‌కు మంచి సీట్లు రావాలన్నారు. 93 బిసి కులాలను ఒక్కతాటి పైకి తెచ్చి నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని, బలహీన వర్గాలు గొంతుకై నిలబడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని పేర్కొన్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి బిసిల సత్తా ఏంటో చూపాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా రాజేంద్ర నగర్ నియోజవర్గంలోని బుద్వేల్ లో నిర్వహించిన రోడ్ షో లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బిఆర్‌ఎస్‌కు పది పన్నెండు సీట్లయినా ఉంటేనే తెలంగాణకు రక్షణ అని, పదవులు అనుభవించి తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లిన వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలని, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోళ్లకు సరైన జవాబు చెప్పాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని, ఓడిపోగానే పారిపోయిన పిరికిపందలకు బుద్ధి చెప్పాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ వాళ్లను రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు అని అడిగాలని, ఇప్పుడు కొత్తగా ఆగస్టు 15 అంటున్నారని, మనం మళ్లీ నమ్ముదామా?, మహిళలందరికీ రూ.2500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానానికే పరిమితమౌతుందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత గ్యారంటీలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. రైతు బంధు రూ.15 వేలు ఏమైంది, రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది, రూ.4 వేల పెన్షన్ ఏమైంది, అడబిడ్డలకు నెలకు రూ.2500 ఏమైందని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మీకి తోడు తులం బంగారం ఇస్తామన్నారని, ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మోసపోయారని, మరోసారి మోసం చేయడానికి సిఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని జాగ్రత్తగా చూసి ఓటు వేయాలని కెటిఆర్ కోరారు.

పదేళ్లలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిందని, కానీ పెట్రోల్ ధర రూ.110 మాత్రం అలానే ఉందని, క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర తగ్గదా? అని విమర్శించారు. బిజెపి వాళ్లు అధికారంలో ఉండి చేసింది ఏంటంటే జైశ్రీరామ్ అన్నారని, జైశ్రీరామ్ బిజెపి ఎంఎల్‌ఎ కాదని అని, అందరివాడు అని చెప్పారు. శ్రీరాముడిని మొక్కుదామని, తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని బిజెపి తొక్కుదామని పిలుపునిచ్చారు. కృష్ణావాటర్‌లో మన వాటా తేల్చమని కెసిఆర్ అంటే కేంద్రం స్పందించలేదని, కెసిఆర్ మళ్లీ ఢిల్లీని ఆటాడించే రోజు తొందరలోనే ఉందన్నారు. కెటిఆర్ రోడ్ షోలో పెద్ద ఎత్తున్న గులాబీ శ్రేణులు, ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News