Tuesday, June 18, 2024

ఓట్ల నాడు ఒక మాట…నాట్ల నాడు ఒక మాట: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామనడం
కపట కాంగ్రెస్ మార్కు మోసం..దగా.. నయవంచన
ఎక్స్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడం కపట కాంగ్రెస్ మార్కు మోసం..దగా.. నయవంచన అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యారెంటీ కార్డులో వరిపంటకు రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా అంటూ కెటిఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.

ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదు. రైతు వ్యతిరేక పాలన అని విమర్శించారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు, కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారని మండిపడ్డారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా అన్నారు.. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు అన్నారు.. కానీ వేయలేదు.

ప్రతి రైతుకు డిసెంబర్ 9నే రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు” అని విమర్శించారు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారని, ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది కాంగ్రెస్ పార్టీ…పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ సర్కారు అని విమర్శించారు. ఎద్దేడ్సిన యవుసం, రైతేడ్చిన రాజ్యం నిలబడదని వ్యాఖ్యానించారు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరని..పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు, తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు.. కపట కాంగ్రెస్‌పై సమరశంఖం పూరిస్తారని హెచ్చరించారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ అని కెటిఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News