Sunday, September 15, 2024

మళ్లీ రిపీట్ కావొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బస్సుల్లో మహిళల ప్రయాణంపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మహిళా కమిషన్ ముందు హా జరై తన వ్యాఖ్యలపై శనివారం వివరణ ఇచ్చారు. ఉచిత బ స్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కా మెంట్స్ యథాలాపంగా చేసినవే కానీ ఉద్దేశ్య పూర్వకంగా చే య లేదని వివరణ
ఇచ్చారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవా లని కోరారు. రాష్ట్రంలో గత ఎనిమిది నెలలుగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను కమిషన్‌కు వివరించేందుకు కెటిఆర్‌ప్రయత్నించారు. అయితే శనివారం ఒక్క అంశానికి మాత్రమే పరిమితం కావాలని, మిగతా అంశాలపై తర్వాత కలవాలని ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. సమన్లకు లోబడి కెటిఆర్ హాజరై వివరణ ఇచ్చారని, తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతోపాటు క్షమాపణలు చెప్పారని రాష్ట్ర మహిళా కమిషన్ వెల్లడించింది. అటువంటి వ్యాఖ్యలు సరికాదని కూడా కెటిఆర్ అభిప్రాయపడినట్లు పేర్కొంది.

కెటిఆర్ క్షమాపణలను అంగీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్, భవిష్యత్‌లో ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. ఈ తరహా ఉదంతాలు చోటుచేసుకుంటే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘షాద్ నగర్‌లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. చెంచు మహిళపై దాడి జరిగింది. గురుకుల హాస్టళ్లలో విద్యార్థినులు చనిపోతున్నారు. ఈ సంఘటనను మహిళ కమిషన్ దృష్టికి తెస్తే మళ్లీ రావాలని కోరారు. తప్పకుండా వారు కోరినట్లుగా మళ్లీ సమయం తీసుకొని వస్తాం’మని కెటిఆర్ అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళ కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యా నన్నారు. తాను యథాలాపంగా మాట్లాడిన మాటల పట్ల విచారం వ్యక్తం చేశానని మహిళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడిం చారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా తాను మాట దొర్లటంపై క్షమాపణ అడిగానని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ తాను కమిషన్ ముందుకు వస్తే మహిళ కాంగ్రెస్ నేతలు మా నాయకులపై దాడి చేశారని వెల్లడించారు. తాను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మేము వస్తే ఇలాంటి దాడి చేయటం సరికాదన్నారు.

‘మా వాళ్లపై జరిగిన దాడిపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి’
రాష్ట్రవ్యాప్తంగా 8 నెలల్లో మహిళలపై జరుగుతున్న పరిస్థితులు, దాడుల విష యంలో కమిషన్ చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చానన్నారు. రాష్ట్రంలో కొరవడిన మహిళా భద్రత, విద్యార్థుల పట్ల లైంగిక దాడులు వంటి అంశాలను ప్రస్తావించేందుకు అన్ని వివరాలతో తాను వెళ్లానని వెల్లడించారు. మరోసారి రావాలని కమిషన్ చెప్పిందన్నా రు. తప్పకుండా వారు కోరినట్టుగా మళ్లీ సమయం తీసుకొని వస్తామన్నారు. కానీ తమ నాయకురాళ్లపై దాడి చేసిన ఘటన మంచిది కాదని పేర్కొన్నారు. మా వాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఇచ్చిన వివరణపై కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, తప్పు చేస్తే క్షమాపణ అడగాలని అన్నారు. తాను అందుకే ఒక్క మాట దొర్లితే మహిళలను గౌరవించే వ్యక్తిగా క్షమాపణ అడిగానని పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ నేతల వైఖరిని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఖండించారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కు కెసిఆర్ హయాంలో కేబినెట్ హోదా ఇచ్చారని, ఈ ప్రభుత్వం కూడా ఆ హోదా కల్పించాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కోరారు.

తీవ్ర ఉద్రిక్తత
అంతకు ముందు మహిళా కమిషన్ ముందు హాజరయ్యేందుకు కెటిఆర్‌తో పాటు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు బిఆర్‌ఎస్ మహిళా కార్పొరేట్లకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో కెటిఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు బుద్ధభవన్ వద్ద ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. క్షమాపణలు చెప్పేవరకు వదిలిపెట్టబోమంటూ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షురాలు సునీత బైఠాయించారు. సునీతను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. కాంగ్రెస్‌కు పోటాపోటీగా బిఆర్‌ఎస్ మహిళా శ్రేణులు కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం తోపులాటలు, నినాదాలతో మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పరిస్థితి రణరంగంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మహిళలపై పోలీసుల వైఖరి సరికాదని, పోలీసులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే మహిళా కమిషన్ కెటిఆర్‌పై సుమోటోగా కేసు పెట్టాలని సూచించారు. అనంతరం పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది?
ఆగస్ట్ 15వ తేదీన తెలంగాణభవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కెటిఆర్ పాల్గొ న్నారు. ఈ సమావేశంలోనే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో భాగంగా మహిళలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్‌టిసి ఉచిత ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చేందుకు యత్నంగా అడ్డంగా బుక్కయ్యారు. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేసినా తాము ఏమంటామని అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి. కెటిఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ దిష్టి బొమ్మల దహనాలు చేశారు. ఈ క్రమంలోనే కెటిఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు నోటీస్ ఇచ్చింది. దీంతో కెటిఆర్ శనివారం మహిళ కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యల పై ఇప్పటికే ఆయన క్షమాపణ చెప్పారు. యథాలాపంగా అన్నవే తప్పా మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News