Saturday, December 7, 2024

లోక్ సభ ఎన్నికల బరిలో కేటీఆర్?

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్ర సమితిలో లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో అంతర్మథనం మొదలైంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా అగ్రనేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్ చేత లోక్ సభకు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల నుంచి కేసీఆర్ ప్రజల మధ్యకు రానున్నట్లు హరీశ్ రావు ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు దూరంగా వ్యవహరించారని, వారిని కలవపోవడం, వారి సమస్యలను పట్టించుకోకపోవడం వల్లనే ఓటమి చవిచూడవలసి వచ్చిందని కొన్నివర్గాల అభిప్రాయం. జనంలో ఉండకపోతే, లోక్ సభ ఎన్నికల్లోనూ పరాజయం తప్పదని గ్రహించిన కేసీఆర్, ఇకపై జనం మధ్యనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీఆర్ఎస్ బాధ్యతలు మోసిన కేటీఆర్ లోక్ సభకు వెళ్ళిన పక్షంలో, ఆ పదవిని హరీశ్ రావుకు అప్పగించాలనే నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ కేడర్ ను ముందుకు నడిపించడంతో హరీశ్ దిట్ట. కేటీఆర్ లాగానే హరీశ్ కూడా అందరినీ కలుపుకుపోతారు. కాబట్టి పార్టీకి  వచ్చే నష్టమేమీ ఉండదన్నది కేసీఆర్ అభిప్రాయం.

కేటీఆర్ ను లోక్ సభకు పంపాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ను లోక్ సభ  ఎన్నికల్లో పోటీకి దింపితే, పార్టీలో జోష్ వస్తుందన్నది అధినేత ఉద్దేశంగా తెలుస్తోంది. ఈమేరకు మల్కాజ్ గిరినుంచి గానీ సికింద్రాబాద్ నుంచి గానీ కేటీఆర్ పోటీ చేసే అవకాశం ఉంది. నగరంలో బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు లభించిన నేపథ్యంలో, ఇక్కడ కేటీఆర్ గెలుపు నల్లేరుపై నడకలా మారుతుందని భావిస్తున్నారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిస్తే, ఒక స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఇక మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది.

ఇక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, పైచేయి సాధించడం అత్యవసరం. ఆ పాత్ర పోషించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News