Tuesday, June 18, 2024

‘ఇది తెలంగాణ దశాబ్ది’: కేటీఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

‘ఇది తెలంగాణ దశాబ్ది’
వేల బలిదానాలు, ఉద్యమ సేనాని అకుంఠిత,
ఆమరణ దీక్షతో తెలంగాణ సాకారమైంది
అవహేళనలు ఎదుర్కొన్న గడ్డపై
ఆత్మగౌరవ పతాకం ఎగురవేశాం
ఎక్స్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ‘ఇది తెలంగాణ దశాబ్ది’ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. ఆరున్నర దశాబ్దాల పోరాటం.. మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల బలిదానాలు, త్యాగాలు.. బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు.. ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష.. ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారమైందని కెటిఆర్ ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారని కొనియాడారు. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసిందని.. ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి ఐటి ఎగుమతుల దాకా రికార్డులు బద్దలయ్యాయన్నారు. అందరి మద్దతుతో నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచామని.. నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపామని పేర్కొన్నారు.

రైతన్నల, నేతన్నల, కష్టజీవుల కలత తీర్చినం.. కడుపు నింపామని తెలిపారు. వృద్ధులకు ఆసరా అయ్యామని.. ఆడబిడ్డలకు అండగా నిలిచామని వ్యాఖ్యానించారు. సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేశామన్నారు. గుండెల నిండా జై తెలంగాణ నినాదం నింపుకొని మన భాషకు పట్టం గట్టామని పేర్కొన్నారు. మన బతుకమ్మ, మన బోనం సగర్వంగా తలకెత్తుకున్నామని.. గంగా జమునా తెహజీబ్‌కు సాక్షీభూతంగా నిలిచామని తెలిపారు. అవమానాలు, అవహేళనల ఎదుర్కొన్న గడ్డ మీదనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని అంబరమంత ఎత్తున ఎగరేశామన్నారు. కెసిఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది.. వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది…జై తెలంగాణ అంటూ కెటిఆర్ ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News