Saturday, July 27, 2024

అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడంలేదా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనజాతర సభ కాదని, అది హామీల పాతర, అబద్ధాల జాతర అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఎక్స్‌వేదికగా కాంగ్రెస్‌పై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. నమ్మి ఓటేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలలోనే కాంగ్రెస్ నయవంచన చేసిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలలో న్యాయ్ పేరిట నాటకానికి తెరతీశారని, న్యాయ్ అంటే ఇప్పుడు నమ్మేదెవరు అని? చురకలంటించారు. సంక్షేమాల్ని సంక్షోభంలోకి నెట్టిందని కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. మా అన్నదాతల ఆర్తనాదాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వినిపించడంలేదా?, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా పట్టించుకోరా?, 200కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా?, చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా?, డిసెంబర్ 9 చేస్తానన్న రైతురుణమాఫీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కెటిఆర్ నిలదీశారు. 75 ఏళ్ల కాంగ్రెస్‌తోనే బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలు వెనకబడిపోయారని, కాంగ్రెస్ ఇప్పుడు కులగణన పేరిట కొత్త పల్లవి అందుకుందని ఆయన ఎద్దేవా చేశారు. వంద రోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్‌కు వచ్చే  పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News