కమ్యూనిజాన్ని అంతం చేయడం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సాధ్యమవుతుందా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా, కురవి మండల కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారధి అధ్యతక్షన దివంగత పోగుల శ్రీనివాస్‌గౌడ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పార్టీ 3వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలు, కమ్యూనిస్టుల వైఖరి, మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఎన్‌కౌంటర్లు వంటి అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘అధికారం ఉన్నా లేకున్నా కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాడుతారు…తప్పు చేస్తుంటే
చూస్తూ ఊరుకోం.. పాలకులను ప్రశ్నిస్తూనే ఉంటాం…మాకు పదవులు ముఖ్యం కాదు మమ్మల్ని, ప్రజలను కాదనుకుని బిఆర్‌ఎస్ ఫాంహౌస్‌కు పోయింది… ప్రజలకు నష్టం చేస్తే రేపు కాంగ్రెస్ గతి అంతే.. ప్రజలను ఇబ్బంది పెడితే పోరాటాన్నే ఎంచుకుంటాం’ అంటూ వ్యాఖ్యానించారు. ముందుగా కురవి గ్రామ పంచాయతీ దివంగత పార్టీ నేతలు లియాకత్ అలీ, సూరీల ప్రాంగణం నుండి భారీ ప్రదర్శన చేపట్టారు. ఎర్ర జెండాలతో కవాతు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో సాంబశివరావు మాట్లాడుతూ.. పొత్తులు రాజకీయ ఎత్తుగడల్లో భాగమని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా, పట్టించుకోకపోయినా ఎదురించి తీరుతామని హెచ్చరించారు.
మావోయిస్టులు మనవారే….
మావోయిస్టులు మనవారే…కమ్యూనిస్టు పార్టీ పుట్టింది మనిషి కోసమని, ప్రజలంత కమ్యూనిస్టులు బతకాలని కోరుకుంటున్నారని మనుషులున్నంత వరకు ఎర్రజెండా ఉంటుందన్నారు. సిపిఎం మనవాడే, సిపిఐ (ఎంఎల్) మనవాడే, కమ్యూనిస్టులంతా ఒక్కటే.. ఎర్రజెండాలన్నీ ఒక్కతల్లి పిల్లలే అన్నారు. కమ్యూనిజాన్ని లేకుండా చేస్తానని బిజెపి అగ్రనేతలు విర్రవీగుతున్నారని, అడాల్ఫ్ హిట్లర్ వల్లే కాలేదు.. ఆఫ్ట్రాల్ అమిత్ షా వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు. 1951 వరకు మేము సాయుధ పోరాటం చేశాం, పరిస్థితుల ప్రాతిపదికన ఆయుధాలను జమ్మిచెట్టు మీద పెట్టాం వాటిని తీసే అవసరం రాకూడదని కోరుకుంటున్నామని అన్నారు. కగార్ పేరుతో కేంద్రం సాగిస్తున్న ఆరాచకం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నంబాల కేశవరావును అమిత్ షా అన్యాయంగా చంపించారని మండిపడ్డారు. డిసెంబర్ 26 నాటికి పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మందితో వేడుకలను జరుపబోతున్నామని అన్నారు.
కార్పొరేట్ శక్తులకు మద్దతుగా కేంద్ర పాలన…
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా దేశ ప్రజలకు దక్కింది శూన్యమన్నారు. కార్పొరేట్ శక్తులకు మద్దతుగా కేంద్రంలో పాలన సాగిస్తోందని అన్నారు. మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్న బిజెపి విధానాలతో రాబోయే రోజుల్లో మరింత ముప్పు ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టులు రాజకీయంగా బలపడితేనే పేదల ఆకాంక్షలు నెరవేరుతాయని, సమసమాజం నెలకొల్పబడుతుందన్నారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ సంగతి తేల్చాలి…
ఎన్నికల సమయంలో నాయకులు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళపల్లి శ్రీనివాసరావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పునాదులపై రాష్ట్ర సాధనలో తమ పార్టీ పోరుబాట పట్టిందన్నారు. ప్రజలను పట్టించుకోకపోతే గత పాలకులకు పట్టిన గతే ఈ పాలకులకు పడుతుందని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. బయ్యారం ఉక్కు కోసం లక్షలాది మందితో నాడు పోరుబాట పుణ్యమా అని విభజన చట్టంలో చేర్చారని చెప్పారు. ఈ ప్రాంతం నుండి గెలిచిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇప్పటివరకు పరిశ్రమ గురించి మాట్లాడకపోవడం విచారకరమన్నారు.
ఈ మహాసభల్లో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కంట్రోల్ కమిటీ సభ్యులు తమ్మెర విశ్వేశ్వర్‌రావు, రాష్ట్ర సమితి సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్, కర్నం రాజన్న, నెల్లూరి నాగేశ్వర్‌రావు, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, పాండురంగాచారి, సాంబలక్ష్మి, వెంకన్న, భిక్షపతి, ఆర్.నవీన్, జిల్లాలోని వివిధ మండలాల కార్యదర్శులు సందీప్, బాలకృష్ణ, తురక రమేష్, శేషాద్రి, పోలేపాక వెంకన్న, స్వామి, శేఖర్, మహేందర్, జంపాల వెంకన్న, శ్రీనివాస్, మాలోతు రవీందర్, ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకుడు ఉప్పలయ్య, వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి పంజాల రమేష్, హన్మకొండ సహాయ కార్యదర్శి తోట భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.