Wednesday, March 22, 2023

సాహిత్య సవ్యసాచి కెవియార్

- Advertisement -

నా ఆకాశం ఈ నేలమీదనే. ఈ నా జనమే నా ప్రాణపంచకం. వీరి ఉన్నతి ఒక్కటే నా ధ్యేయం. అందుకోసమే నాశక్తి, నా తీరిక, నా కాలం, నా సమస్తం” అని ప్రకటించిన కె.వి. రమణా రెడ్డి(కెవియార్) ‘సర్వం సామాజికవ్‌ు జగత్’ అనే ఒక ఉచ్ఛస్థితికి వచ్చిన ఒక మహామనీషి. తాను కవినా, అనువాదకుడినా, సంపాదకుడినా, సాహిత్య విమర్శకుడినా, సాహిత్య జీవిత చరిత్రకారుడినా అన్న దానితో పనిలేదు. ఆయనొక సాహిత్య గంభీరుడు, ఒక సాహిత్య సవ్యసాచి.

ఆధునిక విమర్శను చారిత్రక భౌతిక వాద వెలుగులో కొత్త దారులు పట్టించిన కెవియార్ సాహిత్య కృషిని, జీవితాన్ని అంచనా వేయడం అంత తేలికైన పనికాదు. దశాబ్దాలపాటు కెవియార్‌తో సన్నిహితంగా ఉన్న ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ఆయన కృషిని, జీవితాన్ని వంద పేజీల్లో అందించగలిగారు. సాహిత్య అకాడమీ ఇటీవల అచ్చేసిన ‘భారతీయ సాహిత్య నిర్మాతలు కె.వి.రమణారెడ్డి’ అన్న ఈ చిన్న పుస్తకం ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదం కానుంది.

నెల్లూరు జిల్లాలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కెవియార్ బాల్యంలోనే గొప్ప భావుకుడు, పుస్తక పిపాసి. ‘క్విట్‌ఇండియా’ ఉద్యమంలో టెలిఫోన్ తీగలు తెంచడానికి యత్నించడం, సుభాస్ చంద్రబోస్ పట్ల ఆరాధనా భావన కళాశాల జీవితానికి ముందే మొదలైంది. నెల్లూరులోని కళాశాల విద్యార్థిగా వామపక్ష రాజకీయాలవైపు మొగ్గు చూపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే అనిశెట్టి సుబ్బారావు పరిచయంతో రచనలు సాగిస్తూ, అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. వాల్టేరులో చదువు ముగించి, ఐ.ఏ.ఎస్. రాత పరీక్ష రాసి నెగ్గినా, వామపక్ష రాజకీయ నేపథ్యంతో ఇంటర్వ్యూలో ఎంపిక కాలేదు. తొలుత ఒంగోలులోను, ఆ తరువాత కావలిలోనూ చరిత్ర లెక్చరర్‌గా చేరారు. ఆయన సతీమణి శారదాంబ ఆయనకు ‘పూర్ణాంగి’ యే!

చరిత్ర, తత్వశాస్త్రంలో ఆయనకున్న పరిజ్ఞానం, భారతీయ, పాశ్చాత్య సాహిత్యంపై వెలువడ్డ పరిజ్ఞానం వల్ల ఆయన రాసిన సాహిత్యజీవిత చరిత్రలు సమగ్రతను సంతరించుకున్నాయి. కెవియార్ రాసిన ‘కవికోకిల’ను ప్రముఖ భాషాశాస్త్రవేత్త జి.ఎన్.రెడ్డి తెలుగు సాహిత్యంలో ‘మాస్టర్ పీస్’ గా అభివర్ణించారు. గురజాడపై రాసిన ‘మెదయం’ ఒక సమగ్ర రచన. దీన్ని ఆంధ్ర జాతీయ పునర్వికాసాన్ని వివరించడంగా కెవియారే చెప్పుకున్నారు. గురజాడ నవ్యుడే కానీ, గతాన్ని విస్మరించిన నవ్యుడు కాదంటారు. ఆయన ‘ప్రథమాధునికుడు’ అని కూడా కీర్తించారు. గురజాడకు నాటకం వల్లనే ఖ్యాతి వచ్చిందంటారు. జాతీయోద్యమం బలం పుంజుకుంటున్న వేళ భారత సమాజానికి భవిష్యత్తు సూచికగా ‘దేశభక్తి’ గేయం రాశారంటారు. ‘పండిత’కూటమిలో గురజాడ ఒక ‘పితూరి’ అంటారు కెవియార్. ‘మెదయం’ గురజాడపై ఒక విజ్ఞాన సర్వస్వం అంటారు రారా.

హిందీ, బెంగాలి, తమిళం, మలయాళం, కన్నడ, ఒరియా, మరాఠీ భాషలలోని ప్రముఖ సాహిత్య కారులను ‘ఆధునిక భారత సాహిత్యకర్తలు’లో కెవియార్ పరిచయం చేశారు. వీరిలో ప్రేవ్‌ు చంద్, రవీంద్ర నాథ్ టాగూర్, బంకించంద ఛటర్జీ, హరినారాయణ్ ఆప్టే, కందుకూరి, గురజాడ, సుబ్రహ్మణ్య భారతి వంటి సాహితీ ఉద్దండులున్నారు. తెలుగు సాహిత్యంలోని కొందరు ప్రముఖుల జీవిత, సాహిత్య విశేషాలను ఆంగ్లంలో రాశారు. ‘ఆధునిక యుగంలో కవిలోకం’లో లబ్ధ ప్రతిష్టులైన కవుల గురించి పరిచయం చేశారు.

శ్రీశ్రీ గురించి విలువైన సమాచారాన్ని సేకరించి కూడా, ఆయన జీవిత చరిత్ర రాయకుండా వదిలేశారు. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గురించి కూడా సమాచారం సేకరించి రాయకుండా వదిలేశారు. ‘ఆధునికాంధ్ర చరిత్రనిర్మాణ ప్రయత్నం’ లో సాహిత్యం గురించిన అన్ని ప్రక్రియలపైనా రాశారు. రమణారెడ్డి సాహిత్య ప్రస్థానంలో శ్రీశ్రీ సమగ్ర రచనల సంపాదకత్వం ఒక మైలురాయి. శ్రీశ్రీ ‘అనంతం’ ఒక ప్రణాళిక లేకుండా రాసిన ‘అగమ్య గోచర’ గ్రంథంగా కెవియార్ వ్యాఖ్యానించారు. కెవియార్ సాహిత్య పరమైన కొన్ని వందల ఉత్తరాలు రాశారు. అలుపెరగని లేఖకుడు.

విరసం ఏర్పడినప్పుడు శ్రీశ్రీ అధ్యక్షుడుగా, కెవియార్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ కుట్ర కేసులో 1974 జూన్ 24న అరెసె్టై జైల్లో ఉన్న మూడు నెలల్లో రాసిందే ‘మూణ్ణెల్ల ముచ్చట’ డైరీ. ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా కెవియార్‌ను జైల్లో పెట్టిన సందర్భంగా రాసిన ‘డిటెన్యూ డైరీ’ ఒక సామాజిక, సాహిత్య విషయ గ్రంథం. జనవాణి, జనశక్తి, విశాలాంధ్ర, అరుణ తార పత్రికల్లో వివిధ శీర్షికలు రాశారు. రవీంద్రుడి కథల్లో కొన్నిటిని ‘ఆటబొమ్మలు’ పేరుతో అనువాదం చేశారు. అలాగే వర్డ్ ఫాస్ట్ ‘ద లాస్ట్ హారిజాన్’ నవలను ‘మానధనులు’ పేరుతో అనువాదం చేశారు. కేవీయార్ ఆరు స్వీయ కవితా సంకనాలను వెలువరించారు. ‘సూరీడు మావోడు’ కవితా సంకలనంలో ‘మరచిపోయిన మందహాసం’ ఒక మంచి కవిత. ‘గుమ్మడి పాదులా కళకళ్ళాడాల్సిన పసరు, పచ్చనాగల ప్రియమైన ఈ ఒక్కగానొక్క జన్మని ఎందుకిలా జర్జరీభూతం చేసుకుంటున్నావు సుమీ’ అన్న చరణాలు వెంటాడుతాయి.

కెవియార్ వకుళాభరణానికి గురువు, సహఅధ్యాపకుడు, కుటుంబ స్నేహితుడు. కెవియార్ అంటే అంతులేని అభిమానం. అలాంటి కెవియార్ గురించి రాసేటప్పుడు వకుళాభరణం ఒక చరిత్రకారుడిగా, రాగద్వేషాలకు అతీతంగా ఆయన విశిష్టతతో పాటు లోపాలనుకూడా నిర్మొహమాటంగా ఎత్తిచూపారు. రమణారెడ్డి వచన శైలి చాలా బరువుగా ఉంటుందని, వ్యవహారానికి దూరమైన పదాలను, వాక్యనిర్మాణాన్ని ఉపయోగించడం వల్ల పాఠకుడిని గందరగోళ పరుస్తాయనే విమర్శ సహేతుకమేనని వ్యాఖ్యానిస్తారు. రాచమల్లు రామచంద్రా రెడ్డికి రాసిన లేఖలో ‘నా లోపాలను మీరు విస్మరించుకోవాలని నేను కోరుకోను. క్లిష్టాన్వయం కౌగిలి నుంచి నేనిప్పటికీ బయల్పడలేదు. ఎక్కువ భావనను తక్కువ పదాల్లో, ఒక్కోసారి కూరుతానని తుమ్మల వెంకటరామయ్య కూడా ఒక సారి అన్నాడు. కాబట్టి నా లోపాలను మీరు విమర్శించాలి. నా ప్రోస్‌లో కూడా మీరు సూచించిన లోపాలను తొలగించుకొనేందుకు యత్నిస్తాను.’ అని రాయడం కేవీయార్ నిజాయితీ, చిత్తశుద్ధికి నిరద్శనం. కెవియార్ ఒక ఆదర్శ మార్క్సిస్టు సాహితీ వేత్త, తాను విశ్వసించిన సిద్దాంతాలకు తొట్రుపాటు లేకుండా కట్టుబడిన మేధావి.

రాఘవ శర్మ,
94932 26180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News