Friday, April 26, 2024

శాంతి, భద్రతల తెలంగాణ

- Advertisement -
- Advertisement -

ఎక్కడ శాంతియుత పరిస్థితులు ఉంటే ఆ ప్రాంతం అన్ని విధాలా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనేది జగమెరిగిన సత్యం. దీనికి మరో ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రత్యేక రాష్ట్రం అనంతరం ఎలా ఉన్నాయో ఒకసారి అవలోకనం చేసుకుంటే ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్వితీయమైన అభివృద్ధి సాధించింది. 2014 కు ముందు, తెలంగాణతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అల్లర్లు, తీవ్రవాద గ్రూపుల హింసాత్మక చర్యలు, సమ్మెలు, మతపరమైన సమస్యలతో నిత్యం సంక్షుభితంగా ఉండేది. తెలంగాణ సరికొత్త రాష్ట్రంగా ఏర్పడడంతో శాంతి భద్రతల పరంగా మెరుగైన రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీనితో రాష్ట్రం అభివృద్ధి పరంగా ఇతర రాష్ట్రాల కన్నా దూసుకుపోవడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ బహుళజాతి సంస్థలు, దిగ్గజ ఐటి సంస్థలన్నీ హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకొన్నాయి. తెలంగాణ తలసరి ఆదాయం 2013- 14లో రూ. 112,162 నుండి 2022- 23 నాటికి రూ. 317,115కి పెరిగింది. ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువ. ఈ అప్రతిహత అభివృద్ధికి ప్రధాన కారణం గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం శాంతియుత తెలంగాణగా ఉండడమే అని చెప్పవచ్చు.

దార్శనికులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ పోలీస్ శాఖకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా భారీ ఎత్తున నిధుల కేటాయింపు, నూతన సాంకేతిక పద్ధతుల వినియోగం, అత్యాధునిక నేర పరిశోధనా పరికరాల కొనుగోలు, అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం, అదనపు పోలీస్ జిల్లాలు, జోన్‌లు, కమిషనరేట్ లు, డిఎస్‌పి, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కొత్త పోస్టులను పోలీస్ శాఖకు మంజూరు చేశారు. దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకొన్న మొదటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నిర్మితమైంది. బంజారాహిల్స్‌లోని ఈ అద్భుతమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో లక్ష కెమెరాల ఫుటేజీని ఒక్క నిమిషంలోనే పరిశీలించే ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయి.

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరించి, నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పిడి యాక్టు నమోదు చేసి జైలుకు పంపేలా ఆర్డినెన్స్ తెచ్చిన మొట్ట మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. క్రైట్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సిసిటిఎన్‌ఎస్) ను ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజెఎస్) అనుసంధానించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ.
శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తున్న సిసి కెమెరాలను ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల 66 వేల 792 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వెయ్యి మందికి 30 క్లోజ్డ్ సర్క్యూట్ టివి (సిసిటివి) సర్వైలెన్స్ అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచి, ప్రపంచంలో 16వ స్థానం పొందింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో వివిధ రకాల నేరాలలో గణనీయమైన తగ్గుదల సాధించడం జరిగింది. వీటిలో ప్రధానంగా స్వలాభం కొరకై జరిగే మర్డర్లు 32.94 శాతం తగ్గాయి. రాష్ట్రంలో 19.42 శాతం హత్యలు తగ్గగా, మహిళలపై జరిగే నేరాలలో 40 శాతం వరకు తగ్గాయి.

ముఖ్యంగా వరకట్న సంబంధిత హత్యలు గణనీయంగా తగ్గాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పోలీస్ శాఖను మరింత పటిష్ఠం చేయడానికి దాదాపు 31970 వివిధ ర్యాంకుల ఉద్యోగాలను కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది.‘తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 48,096 పోస్టుల భర్తీకి 3 నోటిఫికేషన్‌లు జారీ చేయబడ్డాయి. నోటిఫై చేసిన 48,096 పోస్టులలో 28277 పోస్టులు 2 విడతలుగాలో భర్తీ చేయగా, మూడవ విడత నియామకాలు పురోగతిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాంతి, భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత నివ్వడమే కాకుండా, పోలీస్ శాఖ ఆధునీకరణ, మహిళా భద్రతకై మొట్టమొదటిసారిగా అడిషనల్ డిజి స్థాయి అధికారి నేతృత్వంలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, ఫ్రెండ్లి పోలీసింగ్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సత్వర సేవలు, పోలీస్ అధికారులు ముఖ్యంగా పోలీసుస్టేషన్ స్థాయిలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి పని తీరు మెరుగుపరిచేందుకు ఫంక్షనల్ వర్టికల్స్.. ఇలా ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఫలితంగా నేడు దేశంలోనే తెలంగాణ పోలీస్ అత్యంత సామర్ధ్యపూరక శాఖగా నిలిచింది.

కన్నెకంటి వెంకటరమణ
9849905900

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News