Wednesday, March 26, 2025

కోఠి ఉమెన్స్ కాలేజీకి వందేళ్ల చరిత్ర ఉంది:సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కోఠి ఉమెన్స్ కాలేజీకి వందేళ్ల చరిత్ర ఉందని, ఈ వర్శిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గొప్ప కీర్తి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదని, వారిలోనూ వ్యాపారవేత్తలుగా రాణించే సత్తా ఉందని, తప్పక వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. చాకలి ఐలమ్మ మహిళా వర్శిటీలో పలు నూతన భవనాలకు శనివారం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ యూనివర్శిటీ అభివృద్ధి పనులకు రూ. 500 కోట్లు కేటాయిస్తున్నా మన్నారు.

ఈ యూనివర్శిటీ అంతర్జాతీయ యూనివర్శిటీలతో పోటీ పడాలన్నారు. ఇక్కడ చదివిన ప్రతి ఆడబిడ్డ ప్రపంచ స్థాయిలో రాణించాలన్నారు.రెండున్నరేళ్లలో వర్శిటీ నిర్మాణం పూర్తవుతుందన్నారు. వర్శిటీ నిర్మాణానికి నిధుల ఢోకా ఉండదని రేవంత్ తెలిపారు. అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తారని రేవంత్ పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సిఎం రేవంత్ తెలిపారు. రాజకీయాల్లోకి కూడా మహిళలు కూడా రావాలని, మహిళలు ఐఏఎస్ అయినా మంత్రులు అయినా అవకాశం వచ్చిన వాళ్లు చిత్తశుద్ధి నిరూపించుకొని నిలబడుతున్నారన్నారు.

మహిళలకు ఏ పాత్ర ఇచ్చినా సమర్థవంతంగా
మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. మహిళలకు ఏ పాత్ర ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తారన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించామన్నారు. అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యతను అప్పగించామని సిఎం రేవంత్ గుర్తు చేశారు. రెండున్నరేళ్లలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో నిర్మాణాలు పూర్తి కావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశానని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ నిర్మాణంలో నిధులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని చదువుల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని సిఎం రేవంత్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News